సుకన్య సమృద్ధి స్కీమ్ ద్వారా రూ.50 లక్షలు పొందాలా? - నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే!
- ఆడపిల్లలకు నిధి కూడబెట్టాలనుకునే తల్లిదండ్రులకు వరంగా సుకన్య సమృద్ధి యోజన - ఖాతా ప్రారంభించి 21 ఏళ్లు పూర్తయిన తర్వాత అసలు+ వడ్డీ మొత్తాన్ని తీసుకోవచ్చు!

Published : May 30, 2026 at 5:16 PM IST
Sukanya Samriddhi Yojana Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అందులో "సుకన్య సమృద్ధి యోజన" ఒకటి. అత్యధిక వడ్డీ, ఎలాంటి పన్నూ లేని ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్ అవసరాల కోసం పెద్ద మొత్తంలో నిధి కూడబెట్టాలనుకునే తల్లిదండ్రులకు ఓ వరం అని చెప్పొచ్చు. చక్రవడ్డీ ప్రయోజనమే దీనికి కారణం. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? నెలకు ఎంతెంత జమ చేయాలి? రూ.50 లక్షలు పొందాలంటే ఏమి చేయాలి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఆడపిల్లల సంక్షేమం కోసం 2015లో కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. "బేటీ బచావో.. బేటీ పడావో" ఇనిషియేటివ్‌లో భాగంగా దీనిని ప్రవేశపెట్టింది. ఆడపిల్లలపై చదువులు, వివాహానికి అయ్యే ఖర్చులు తీర్చే ఉద్దేశంతో.. వారి తల్లిదండ్రులు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడమే ఈ స్కీమ్ లక్ష్యం.
ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు :
- అప్పుడే పుట్టిన శిశువు నుంచి 10 సంవత్సరాల లోపు వయసు గల బాలికల పేరు మీద ఎప్పుడైనా ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
- ఒక కుటుంబంలోని ఇద్దరు బాలికలకు ఈ పథకం వర్తిస్తుంది. అయితే ఓకే కాన్పులో ఇద్దరూ లేదా ముగ్గురు పిల్లలు పుట్టినప్పుడు మినహాయింపు లభిస్తుంది.
- ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.250 నుంచి రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచీ 15 ఏళ్ల వరకు డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత ఆరేళ్లపాటు ఎలాంటి డబ్బులు కట్టనవసరం లేదు. కానీ మీరు పెట్టిన పెట్టుబడిపై వడ్డీ వస్తుంది.
- బాలిక వయసు 18 పూర్తైన తర్వాత ఉన్నత చదువుల కోసం 50 శాతం విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
- ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అసలు+ వడ్డీ మొత్తాన్ని తీసుకోవచ్చు.
ఎంత పెట్టుబడి పెడితే ఎంత లభిస్తుంది: ఈ పథకంపై ప్రస్తుతం 8.2 శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. ఎఫ్డీ, ఇతర ప్రభుత్వ స్కీమ్స్‌తో పోలిస్తే ఇందులోనే అత్యధిక వడ్డీ లభిస్తోంది. పథకంలో చేరినప్పటి నుంచే ప్రతి సంవత్సరం గరిష్ఠ పరిమితి ప్రకారం రూ.1.50 లక్షలు చొప్పున 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే 21 సంవత్సరాలకు రూ.70 లక్షలు అవుతుంది. ఇందులో కట్టేది కేవలం రూ.22.5 లక్షలు మాత్రమే. మిగిలిన రూ.40 లక్షలు వడ్డీ రూపంలోనే లభిస్తుంది.
మీ లక్ష్యానికి అనుగుణంగా: ప్రతి సంవత్సరం రూ.లక్షన్నర చెల్లించలేని వారు వీలును బట్టి పెట్టుబడులు చేసుకుంటూ వెళ్లడం మంచిది. నెల లేదా ఏడాదికోసారి ఈ అమౌంట్‌ను అకౌంట్లో జమ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్ అవసరాలకు ఎంత నిధి కావాలో అందుకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. ఉదాహరణకు మీ పాప పేరు మీద రూ.10 లక్షల నిధి కూడబెట్టాలనుకుంటే మొదటి నుంచే నెలకు రూ.1800 లేదా ఏడాదికి రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ రూ.25 లక్షలు కావాలనుకుంటే నెలకు రూ.4,500 లేదా ఏడాదికి రూ.52 వేలు జమ చేయాలి.
50 లక్షలు పొందడం ఎలా: రూ.50 లక్షలు రావాలంటే ప్రస్తుతం ఉన్న 8.2% వడ్డీ రేటు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు రూ.1 లక్షా 10 వేల వరకు చెల్లించాలి. అంటే నెలకు రూ.9,200చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌లో వడ్డీరేట్లు అనేవి ప్రతి 3 నెలలకు ఓసారి మారుతుంటాయి. పైన చెప్పిన లెక్కలు మొత్తం ప్రస్తుత వడ్డీ రేటును అనుసరించి లెక్కించినవే. వడ్డీ రేట్లలో మార్పులుంటే లెక్కల్లో మార్పు వస్తుందనే విషయం గమనించాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్:
- అమ్మాయి బర్త్ సర్టిఫికెట్
- తల్లిదండ్రులు/సంరక్షకుల గుర్తింపు కార్డు, పాన్ కార్డు
- బాలిక, తల్లిదండ్రుల పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?: ఈ ఖాతాను సమీపంలోని పోస్టాఫీసు లేదా ప్రభుత్వ/ ప్రైవేటు బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. అప్లికేషన్‌తోపాటు కనీస డిపాజిట్ రూ.250 చెల్లించాలి. ఈ పథకంలో పొదుపు చేయడం ద్వారా ప్రతి సంవత్సరం రూ. లక్షన్నర వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.
అబ్బాయిల కోసం పోస్టాఫీస్ అద్దిరిపోయే పథకాలు - తక్కువ రిస్క్, పెట్టుబడితో ఎక్కువ లాభాలు!
ఒకే ప్రీమియంతో భార్యాభర్తలకు "ఇన్సూరెన్స్" - డబ్బులు కూడా రిటర్న్! - పోస్టాఫీస్‌లో సూపర్ పాలసీ!

