కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు- సెన్సెక్స్ 1650+ పాయింట్స్ డౌన్
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు- చమురు ధరల భారీ పెరుగుదలే కారణం

Published : July 8, 2026 at 3:00 PM IST
Stock Markets Today : Stock Markets Today : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడమే ఇందుకు కారణం. చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 1677 పాయింట్లు నష్టపోయి 76,503 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 516 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ ప్యాక్‌లో ట్రెంట్, ఇన్ఫోసిస్, టైటాన్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎటర్నల్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్బీఐ, టీసీఎస్, రిలయన్స్, ఆసియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి సహా అన్ని రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి.
- నిఫ్టీ 50లో జియో ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, హెచ్‌యూఎల్ భారీగా నష్టపోయాయి. అయితే ఓఎన్జీసీ, బజాబ్ ఆటో, హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా మాత్రం లాభపడ్డాయి.
- మంగళవారం దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 2.7 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.5 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 2.5 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.5 శాతం, నిఫ్టీ మీడియా 2.33 శాతం, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ 2.2 శాతం, నిఫ్టీ ఆటో 2.2 శాతం, నిఫ్టీ ఇన్ఫ్రాస్ట్రెక్చర్ 2 శాతం, నిఫ్టీ మెటల్ 0.9 శాతం, నిఫ్టీ ఫార్మా 0.97 శాతం మేర నష్టపోయాయి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.5 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.2 శాతం మేర క్షీణించాయి.
ట్రంప్ ప్రకటనతో అంతా అతలాకుతలం
హర్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగుతోందని ఆరోపిస్తూ, టెహ్రాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ముఖ్యంగా చమురు ధరలకు ప్రామాణికమైన బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా 6.18 శాతం పెరిగి, బ్యారెల్ ధర 78.74 డాలర్లకు చేరింది. దీని ప్రభావం నేరుగా స్టాక్ మార్కెట్లపై పడింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ట్రంప్ ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందని ప్రకటిస్తూనే, చర్చలు కొనసాగడానికి తాను అనుమతిస్తానని చెప్పారు. అయినప్పటికీ పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు చెలరేగే అవకాశముందని మదుపరుల్లో ఆందోళనలు చెలరేగాయి. దీనికి తోడు మొదటి త్రైమాసిక అంచనాలు మందకొడిగా ఉండడంతో, ఫలితాల ప్రకటనకు ముందు ఆందోళనలు నెలకొన్నాయి. అందువల్ల పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే వారు పెట్టుబడుల ఉపసంహరణకు దిగడంతో మార్కెట్లు కుదేలయ్యాయి.
ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్ల విషయానికి వస్తే, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ 5.35 శాతం, జపాన్ నిక్కీ 2.11 శాతం, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ 0.49 శాతం మేర నష్ట పోయాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ ఒక్కటే 2.99 శాతం మేర లాభపడింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక మంగళవారం నాడు అమెరికన్ మార్కెట్లు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే.
భారత్‌లో విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, మంగళవారం నాడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐ) రూ.393.19 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.
రూపాయి విలువ
మరోవైపు బుధవారం రూపాయి విలువ 20 పైసలు మేర క్షీణించింది. ప్రస్తుతం ఒక అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూ.95.16గా ఉంది.
మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారా? - "నామినీ" రోల్ ఏంటో తెలుసా?
పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్- రూ.5లక్షల వరకు ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్

