వార్ ఎఫెక్ట్- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్ 1700 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం

Published : March 4, 2026 at 10:00 AM IST
stock market today : పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై భారీగా పడింది. బుధవారం దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియా ఉద్రిక్తత ప్రభావం ఎలా ఉంటుందోో అనే భయంతో మదుపర్లు జాగ్రత్త పడుతున్నారు. ఎర్లీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1,700 పాయింట్లకి పైగా పడిపోయి 78,550 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 500 పాయింట్లకి పైగా కోల్పోయి 24,340 స్థాయికి చేరింది. ఆ తర్వాత సెన్సెక్స్ 1400 పాయింట్ల పైగా తగ్గగా, నిఫ్టి 400 పాయింట్లకు తగ్గింది. నిఫ్టీ సూచీలో ఇన్ఫోసిస్, కోల్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, ఓఎన్‌జీసీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. లార్సెన్, టాటా స్టీల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీ నష్టాల్లో ఉన్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. దక్షిణ కొరియా మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. దక్షిణ కొరియా సూచీ కోస్పి 11.3 శాతం పతనమైంది.
జీవనకాల కనిష్ఠానికి రూపాయి విలువ
అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ జీవనకాల కనిష్ఠానికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69 పెసలు తగ్గి 92.18 మార్క్ వద్ద కొనసాగుతోంది.
సోమవారం కూడా నష్టాలే
హోలీ పండుగ సందర్భంగా స్టాక్ మార్కెట్లకు సెలవు. సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాలు నమోదైనా, చివరికి కొంతవరకు కోలుకున్నాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్లు (1.29శాతం) కోల్పోయి 80,238 వద్ద, నిఫ్టీ 312 పాయింట్లు (1.24శాతం) పడిపోయి 24,865 ముగిశాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ముడి చమురు ధరలు భారీగా పెరగడం కారణమైంది.
మూడు ప్రధాన ప్రమాదాలు: అజయ్ బగ్గ
ఇరాన్–అమెరికా ఘర్షణ భారత మార్కెట్లపై మూడు ప్రధాన ప్రభావాలు చూపే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక నిపుణులు అజయ్ బగ్గా తెలిపారు. 'మొదటది హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయబడటంతో చమురు ధరలు పెరగడం. రెండోది గల్ఫ్ ప్రాంతంలో ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రభావం, షిప్పింగ్ మార్గాలు-సరఫరా గొలుసులు అంతరాయం చెందడం వల్ల భారత ఎగుమతిదారులకు నష్టం. మూడోది పశ్చిమాసియాలో పని చేసే సుమారు 90 లక్షల భారతీయుల జీవనోపాధి, వారి రెమిటెన్స్‌పై ముప్పు. ఈ మూడు అంశాలపై స్పష్టత ఇంకా లేదు. ఇరాన్ కొత్త నాయకత్వం చర్చలకు తిరిగి రావడం, హర్మూజ్ మార్గాన్ని తెరవడం, గల్ఫ్ దేశాలపై దాడులు నిలిపివేయడం వంటి జరిగితే మేలు' అని బగ్గ తెలిపారు.
గ్లోబల్ మార్కెట్లలోనూ నష్టాలే
మంగళవారం ప్రపంచ ఆర్థిక మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. పశ్చిమాసియాలో ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడే భయంతో షేర్లు, బాండ్లు ప్రపంచవ్యాప్తంగా పడిపోయాయి. ముడి చమురు ధరలు సుమారు 5 శాతం పెరిగాయని హెచ్‌డీఎస్ సెక్యూరిటీస్ ప్రైమ్ రీసెర్చ్ హెడ్ దేవర్ష్ వకీల్ తెలిపారు. యూరోపియన్ హోల్‌సేల్ నేచురల్ గ్యాస్ ధరలు 40 శాతం వరకు ఎగబాకాయని అన్నారు. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తతలు కొనసాగితే, భారత్‌పై కరెంట్ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం, రూపాయి స్థిరత్వంపై ఒత్తిడి పెరుగుతుందని వకీల్ హెచ్చరించారు. చమురు ధరల పెరుగుదల వల్ల దిగుమతి బిల్లు పెరిగి, రూపాయి బలహీనమై, విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు.
పరస్పర దాడులతో పశ్చిమాసియా రోజురోజుకు అట్టుడుకుతోంది. మరోవైపు ప్రపంచ ఇంధన జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఆ జలసంధి నుంచి ఏ నౌక వెళ్లిన ధ్వంసం చేస్తామని ఇరాన్ బెదిరించింది. 700కుపైగా నౌకలు ఆగిపోయాయి. ఇక భారత్ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులే ఉన్నాయి. ఇంకా ఈ యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతాయో తెలియకపోవడంతో మదుపర్లును అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. భారత్‌లో ద్రవ్యోల్బణం, ఆర్థికవృద్ధిపై ఈ ప్రభావం గురించి ఆందోళనలు నెలకొన్నాయి.

