ETV Bharat / business

ఇరాన్, ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్- ధమాల్ స్ట్రీట్ ఢమాల్- సెనెక్స్ 2743 పాయింట్స్ డౌన్

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధ ప్రభావం- ఆందోళనలో మదుపర్లు!

Stock Market Today
Stock Market Today (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 9:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

Stock Market Today : అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. ఇరాన్​పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిపిన నేపథ్యంలో మార్కెట్లలో అనిశ్చితి పెరిగింది. అదే సమయంలో ముడి చమురు ధరలు ఎగసిపడటంతో భారతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల వాతావరణం నెలకొంది. ఫలితంగా ప్రారంభం నుంచే సూచీలు కుప్పకూలాయి.

ఉదయం ట్రేడింగ్ ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 9.25 గంటల సమయానికి సెన్సెక్స్ 1,048 పాయింట్లు క్షీణించి 80,238 వద్ద ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 24,871 స్థాయికి పడిపోయింది. ప్రీ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ దాదాపు 2,700 పాయింట్లు, నిఫ్టీ 530 పాయింట్లు కుంగడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ప్రారంభంలో తీవ్ర నష్టాలు కనిపించినప్పటికీ, తర్వాత కొంత కోలుకున్నా మార్కెట్ మొత్తంగా రెడ్​ మోడ్​లోనే కొనసాగింది.

రూపాయి కూడా ఒత్తిడికి లోనైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 24 పైసలు పడిపోయి 91.32 వద్ద ట్రేడవుతోంది. విదేశీ పెట్టుబడిదారుల విక్రయాలు పరిస్థితిని మరింత మార్చేశాయి. గత సెషన్‌లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.7,500 కోట్లకు పైగా ఈక్విటీలు విక్రయించడం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఇరాన్-అమెరికా ఘర్షణ ప్రభావం ప్రధానంగా చమురు ధరలపై పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 80 డాలర్లకు పైగా ఎగబాకింది. భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశానికి ఇది పెద్ద భారంగా మారనుంది.

ఇంధన ఖర్చులు పెరగడం వల్ల ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్, పెయింట్స్, ఎఫ్‌ఎంసీజీ రంగాలపై ఒత్తిడి పెరిగింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతి సుజుకీ, ఏషియన్ పెయింట్స్ వంటి షేర్లు గణనీయంగా క్షీణించాయి. విస్తృత మార్కెట్లలో కూడా అమ్మకాల జోరు కనిపించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో నిఫ్టీ 100 రెండు శాతం క్షీణించగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు మూడు శాతానికి పైగా పడిపోయాయి. అన్ని రంగాల్లోనూ నష్టాలే కనిపించాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగాల్లో భారీ ఒత్తిడి నెలకొంది.

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితి పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంది. ఇరాన్ విదేశాంగ మంత్రి హోర్ముజ్ జలసంధిని మూసివేయబోమని, అమెరికాతో చర్చలకు సిద్ధమని చెప్పడంతో కొంత ఉపశమనం కనిపించినా, పెట్టుబడిదారుల్లో అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం రవాణా అవుతుంది. అది నిలిచిపోతే చమురు ధరలు మరింత ఎగిసిపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక గల్ఫ్ దేశాలతో భారత వాణిజ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. షిప్పింగ్ మార్గాలు దెబ్బతింటే ఎగుమతులు మందగించే ప్రమాదం ఉంది. మధ్యప్రాచ్యంలో పని చేస్తున్న లక్షలాది భారతీయుల భద్రత కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ మూడు అంశాలే భారత మార్కెట్‌కు ప్రధాన ప్రమాదాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. టెక్నికల్ పరంగా కూడా సూచీలు బలహీనంగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీర్ఘకాల మద్దతుగా భావించే 200-డే ఈఎంఏ కంటే సూచీలు దిగువకు రావడం మార్కెట్ నిర్మాణంలో బలహీనతకు సంకేతమని పేర్కొన్నారు. ఇదే స్థాయికి కింద క్లోజింగ్‌లు కొనసాగితే మరింత పతనం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే ఇదే స్థాయి నుంచి బలమైన రికవరీ వస్తే మళ్లీ బుల్ ట్రెండ్ తిరిగి రావచ్చని అంటున్నారు.

ఇక కమోడిటీ మార్కెట్లలో మాత్రం బంగారం, వెండి ధరలు ఎగిశాయి. అనిశ్చితి సమయంలో సేఫ్ హేవెన్‌గా భావించే బంగారం మూడు శాతం పెరిగి కొత్త గరిష్ఠాలను తాకింది. వెండి కూడా దాదాపు నాలుగు శాతం పెరిగింది. పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి డబ్బును సురక్షిత ఆస్తుల వైపు మళ్లిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఏదేమైనా అంతర్జాతీయ యుద్ధ భయాలు, చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ఆ మూడు కారణాలు కలిసి దేశీయ మార్కెట్లను కుదిపేశాయి. రాబోయే రోజుల్లో ఇరాన్- అమెరికా పరిస్థితులు ఎలా మారతాయన్నదే మార్కెట్ దిశను నిర్ణయించనుంది. అప్పటివరకు మార్కెట్లలో అస్థిరత కొనసాగే అవకాశముందని విశ్లేషకులు సూచిస్తున్నారు.