మెటాకు కేంద్రం నోటీసులు- ఆ ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు
ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర ప్రకటనలపై కేంద్రం ఆగ్రహం- సంబంధిత ప్రకటనలు, కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఆదేశం- ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాకు నోటీసులు

Published : July 5, 2026 at 2:24 PM IST
Centre On Instagram Advertisements : చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను ప్రోత్సహించేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటనలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. చిన్నారుల లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSEAM)ను ప్రోత్సహించే పెయిడ్ యాడ్స్‌తో పాటు సంబంధిత కంటెంట్‌ను వెంటనే తొలగించాలని మెటాను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యవహారంపై ఏడు రోజుల్లోగా సమగ్ర వివరణ ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోగా సరైన సమాధానం ఇవ్వకపోయినా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని తేల్చిచెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న ప్రకటనలకు అసలు ఎలా ఆమోదం లభించిందని కేంద్రం ప్రశ్నించింది. ప్రకటనల పరిశీలన, ఆమోద ప్రక్రియలో ఎక్కడ లోపాలు జరిగాయో వివరించాలని మెటాను కోరింది. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలని ఆదేశించింది.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి సాంకేతిక, భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారో స్పష్టత ఇవ్వాలని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా చిన్నారులకు హాని కలిగించే కంటెంట్‌ను గుర్తించడం, తొలగించడం, సంబంధిత ఖాతాలు, ప్రకటనదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ మీడియా సంస్థ దర్యాప్తు కథనం నేపథ్యంలో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెటాకు చెందిన రికమెండేషన్ అల్గారిథమ్ చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను ప్రోత్సహిస్తోందని ఆ కథనంలో ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అభ్యంతరకర ప్రకటనలు కూడా కనిపించినట్లు పేర్కొంది.
మెటా ప్రకటనల విధానాల్లో నగ్నత్వం, లైంగికంగా అభ్యంతరకరమైన కంటెంట్‌పై స్పష్టమైన నిషేధం ఉంది. అయినప్పటికీ ఇలాంటి ప్రకటనలు ఎలా కనిపించాయన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. కొన్ని పెయిడ్ యాడ్స్‌లో అభ్యంతరకర పదాలను ఉపయోగించడంతో పాటు.. వినియోగదారులను టెలిగ్రామ్ ఛానళ్ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయా ఛానళ్లలో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను విక్రయిస్తున్నట్లు కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యవహారంపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మెటా ప్రతినిధులను పిలిపించి వివరణ కోరాలని సూచించారు. ఆ తర్వాత కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మెటాకు అధికారికంగా నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో థర్డ్ పార్టీ కంటెంట్ అనే వాదనతో మెటా బాధ్యత నుంచి తప్పించుకోలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సాధారణంగా సోషల్ మీడియా వేదికల్లో వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్ విషయంలో మధ్యవర్తి సంస్థలకు కొన్ని చట్టపరమైన రక్షణలు ఉంటాయి. అయితే ప్రస్తుతం వచ్చిన ఆరోపణలు పెయిడ్ యాడ్స్‌కు సంబంధించినవని అధికారులు పేర్కొంటున్నారు. ప్రకటనల ద్వారా మెటాకు ఆదాయం వస్తున్నందున వాటి విషయంలో సంస్థకు బాధ్యత ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆరోపణలు నిజమని తేలితే ప్రకటనలను ప్రచురించిన వేదిక కూడా జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని స్పష్టం చేశాయి. ఈ అంశాన్ని సాంకేతిక, నియంత్రణ పరమైన కోణాల్లో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది.
అదే సమయంలో చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు భావిస్తే సంబంధిత ప్రకటనదారులు లేదా సోషల్ మీడియా వేదికలపై ప్రభుత్వ సంస్థలు, అధికారులు లేదా వ్యక్తులు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోంది. ఆన్‌లైన్ వేదికలు ఇలాంటి కంటెంట్‌ను వెంటనే గుర్తించి, తొలగించడంతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేస్తోంది. డిజిటల్ ప్రపంచంలో చిన్నారులకు రక్షణ కల్పించేందుకు మరింత బలమైన భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సోషల్ మీడియా సంస్థలను కోరుతోంది.
ఇంటర్‌పోల్ నుంచి అందిన సమాచారం ఆధారంగా చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ ఉన్న వెబ్‌సైట్లను కేంద్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు బ్లాక్ చేసింది. సీబీఐ ద్వారా అందిన జాబితాల ఆధారంగా ఈ చర్యలు చేపట్టింది. హానికరమైన కంటెంట్‌ను నియంత్రించడంలో టెక్నాలజీ సంస్థలు విఫలమైతే నియంత్రణ సంస్థల విచారణతో పాటు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. కాగా, ఈ వారంలో మెటాకు కేంద్రం నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వాట్సాప్‌లో తీసుకురావాలని భావిస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పైనా కేంద్రం ఇటీవల అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు, ఇతరుల పేరుతో మోసాలకు పాల్పడే ఘటనలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తయ్యే వరకు వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌ను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ వ్యవహారంపై కూడా మెటా ప్రతినిధులు ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. కేంద్రం కోరిన విధంగా నిర్ణీత గడువులోగా సమగ్ర వివరణ ఇచ్చేందుకు సంస్థ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ప్రకటనల వ్యవహారం కూడా తెరపైకి రావడంతో మెటాపై నియంత్రణ సంస్థల పరిశీలన మరింత పెరిగింది. చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించే కంటెంట్, ప్రకటనల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఏడు రోజుల్లో మెటా ఇచ్చే వివరణ, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలు కీలకంగా మారనున్నాయి.
వాట్సప్ 'యూజర్‌నేమ్' ఫీచర్- మెటాకు నోటీసులు పంపిన కేంద్రం- మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు
'వర్క్ ఫ్రమ్ హోమ్' అని చెప్పి- తెల్లవారుజామున 8వేలమందిని తీసేసిన 'మెటా'

