ఈ సీక్రెట్ ట్రిక్‌తో "హోమ్ లోన్" చెల్లించండి - రూ.50 లక్షలపై రూ.20 లక్షలు ఆదా!
"హోమ్ లోన్" తీసుకున్నారా? - వడ్డీ, కాలపరిమితి తగ్గించే సూపర్ టిప్ సూచిస్తున్న నిపుణులు!

Published : May 5, 2026 at 12:03 PM IST
Secret Trick to Reduce Home Loan Interest : సొంత ఇంటిని కలిగి ఉండాలని ప్రతి ఒక్కరి కల. దీనిని నిజం చేసుకునేందుకు పాత కాలంలో జీవితాంతం కష్టపడి పనిచేసి, కూడబెట్టిన డబ్బుతో ఇళ్లు కట్టుకునేవారు. కానీ, నేడు ఆ అవసరం లేదు. స్వయంగా బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు హోమ్ లోన్స్ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో చాలా మంది తమ వద్ద సరిపడా డబ్బు లేనప్పుడు బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుని మరీ సొంతింటి కలను నెరవేర్చుకుంటున్నారు.
ఇక తీసుకున్న ఆ గృహ రుణాన్ని తీర్చడానికి 20 నుంచి 30 ఏళ్లు కష్టపడుతూ ఈఎంఐలు చెల్లిస్తారు. దీనివల్ల రుణ కాలపరిమితి ముగిసేసరికి భారీ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. అలాకాకుండా లోన్ రీపేమెంట్‌లో ఈ సీక్రెట్ ట్రిక్ ఉపయోగిస్తే వడ్డీ భారం భారీగా తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఈ ట్రిక్‌తో రూ.50 లక్షల లోన్ చెల్లింపులో దాదాపు రూ.20 లక్షల వరకు వడ్డీని ఆదా చేసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, హోమ్ లోన్ వడ్డీని తగ్గించే ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
హోమ్ లోన్స్ అనేవి లాంగ్ టర్మ్ రుణాలు. అందుకే, వీటిల్లో అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ప్రారంభంలో మీరు చెల్లించే ఈఎంఐ(EMI) ఎక్కువ శాతం వడ్డీకే వెళ్తుంది. దాంతో హోమ్ లోన్స్ తీసుకున్నవారు ఈఎంఐల చెల్లింపు కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయంలో ఎక్కువ శాతాన్ని పక్కన పెట్టవలసి ఉంటుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు అధిక మొత్తంతో కూడిన ఈఎంఐల వల్ల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. కానీ, అదే గృహ రుణం చెల్లింపులో వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించేలా ఈ అడ్వాన్స్ పేమెంట్ టిప్ ఫాలో అవ్వండి. ఫలితంగా భారీ మొత్తంలో వడ్డీని ఆదా చేసుకోవడంతో పాటు తక్కువ టైమ్‌లో లోన్‌ను క్లియర్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.
గోల్డ్ లోన్ Vs పర్సనల్ లోన్ : ఎందులో వడ్డీ రేటు తక్కువ? - మీ అవసరాలకు ఏది బెటర్?
ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటంటే, ఉదాహరణకు మీరు రూ.50 లక్షల హోమ్ లోన్ 25 సంవత్సరాల టెన్యూర్(వ్యవధి)తో తీసుకున్నారనుకుందాం. దానిపై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది. అప్పుడు నెలకు మొత్తం ఈఎంఐ రూపంలో రూ.40,261 చెల్లించాలి. అలా మీరు లోన్ పూర్తయ్యేసరికి వడ్డీ రూపంలోనే రూ.70.78 లక్షల వరకు చెల్లిస్తారు. అదే, అసలు వడ్డీ కలిపితే సుమారుగా రూ.1.21 కోట్లు అవుతుంది. అంటే, అసలుపై వడ్డీ రెట్టింపు కంటే కూడా దాదాపుగా రూ.21 లక్షలు ఎక్కువ అవుతుంది.
అలాకాకుండా మీ హోమ్ లోన్‌ను రెండో సంవత్సరం నుంచి ఏటా ఒక ఈఎంఐ(EMI)ను పెంచుకుంటూ వెళ్లండి. అంటే, ఏడాదిలో 12 ఈఎంఐలకు బదులుగా 13 ఈఎంఐలు చెల్లించండి. ఈ అదనపు ఈఎంఐని బ్యాంకులు అసలు కింద జమ చేసుకుంటాయి. దీంతో వడ్డీ డబ్బు ఆదా అవ్వడంతో పాటు కాలపరిమితినీ తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే, ఈ విషయాన్ని మీరే బ్యాంకుకు చెప్పాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఈ ట్రిక్ ఫాలో అవ్వడం ద్వారా పైన చెప్పిన రూ.50 లక్షల హోమ్ లోన్‌కు వడ్డీ రూ.52 లక్షల 47 వేలకు తగ్గుతుంది. అప్పుడు మీరు చెల్లించే హోమ్ లోన్ మొత్తం కూడా రూ.1 కోటి 2 లక్షల 47 వేలు అవుతుంది. ఫలితంగా మీకు దాదాపు రూ.18 లక్షల 31 వేలు వడ్డీ ఆదా అవుతుంది. అంతేకాకుండా, మీ ఎక్స్ట్రా ఈఎంఐ వల్ల లోన్ టెన్యూర్ కూడా దాదాపు 5 ఏళ్ల 5 నెలలు తగ్గుతుందంటున్నారు నిపుణులు.
ఈ కింది టేబుల్‌ను పరిశీలించడం ద్వారా హోమ్ లోన్ వడ్డీని తగ్గించే ట్రిక్‌ను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
| వివరాలు | సాధారణ పద్ధతి | స్మార్ట్ పేమెంట్ పద్ధతి |
| లోన్ మొత్తం | రూ.50 లక్షలు | రూ.50 లక్షలు |
| చెల్లించే వడ్డీ | రూ.70.78 లక్షలు | రూ.52.47 లక్షలు |
| మొత్తం చెల్లింపు | రూ.1.21 కోట్లు | రూ.1.02 కోట్లు |
| లోన్ కాలపరిమితి | 25 ఏళ్ళు | 19.5 ఏళ్లు |
NOTE : ఈ సమాచారం మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే అందులోని రిస్క్ గురించి పూర్తిగా తెలుసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం ఆర్థిక నిపుణుల సహకారం తీసుకోవడం ఉత్తమం.
"టర్మ్ ఇన్సూరెన్స్" తీసుకుంటున్నారా? - మంచి కంపెనీని ఇలా సెలక్ట్ చేసుకోండి!
"క్రెడిట్ కార్డు మినిమమ్ బిల్లు" చెల్లిస్తున్నారా? - ఇలా నష్టపోవచ్చు జాగ్రత్త!

