ETV Bharat / business

ఇకపై రూపాయిల్లోనే భారత్​-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం : ఎస్​బీఐ

బలపడుతున్న భారత్​-ఇజ్రాయెల్ సంబంధాలు - వాణిజ్య లావాదేవీలు భారతీయ రూపాయిలో నిర్వహణకు ఎస్​బీఐ సన్నద్ధం

SBI
SBI (ANI (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : January 5, 2026 at 3:50 PM IST

3 Min Read
Choose ETV Bharat

India Israel Trade In Rupee : భారత్​-ఇజ్రాయెల్ వ్యూహాత్మక సంబంధాలు బలపడుతున్న వేళ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్​టీఏ)పై చర్చలు వేగవంతం అయ్యాయి. ఈ తరుణంలో ఇజ్రాయెల్​ ఉన్న ఏకైక భారతీయ బ్యాంక్ అయిన స్టేట్​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ), ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారత రూపాయిల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

ప్రపంచవ్యాప్తంగా భారత రూపాయి పట్ల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఎగుమతులు, దిగుమతుల చెల్లింపులను రూపాయిల్లోనే జరిపేందుకు ఆర్​బీఐ అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఎంపిక చేసిన భాగస్వామ్య దేశాల్లో ఇజ్రాయెల్​ కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ విధానం గురించి ఎస్​బీఐ ఇజ్రాయెల్​ సీఈఓ వి.మణివన్నన్ మాట్లాడుతూ, "ఇజ్రాయెల్​ కంపెనీలు భారత్​తో జరిగే ఎగుమతి-దిగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరపవచ్చు. ఇందుకోసం 'స్పెషల్​ రూపీ వోస్ట్రో అకౌంట్​' (SRVA) వాడుకోవచ్చు. దీనికి అవసరమైన అన్ని అనుమతులు మా టెల్​ అవీవ్ బ్రాంచ్​కు లభించాయి. దీని వల్ల కార్పొరేట్ క్లయింట్ల ఎగుమతులు, దిగుమతులు భారతీయ రూపాయిల్లోనే సెటిల్ చేయడానికి వీలు కలుగుతుంది. సింపుల్​గా చెప్పాలంటే, ఇజ్రాయెల్ సంస్థలు తమ ఎగుమతులు, దిగుమతులకు భారతీయ రూపాయిల్లోనే చెల్లింపులు చేస్తాయి, స్వీకరిస్తాయి" అని తెలిపారు.

రూపాయి వాణిజ్యాన్ని ప్రోత్సహించడానికి ఎస్​బీఐ ఇప్పటికే ఇండియా-ఇజ్రాయెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్​ సహకారంలో పలు సమావేశాలు, వెబినార్లను నిర్వహించింది. అంతేకాదు ఇజ్రాయెల్​లోని ప్రధాన రక్షణ రంగ సంస్థలను కూడా ఈ చర్చల్లో భాగస్వాములను చేసింది. వాస్తవానికి 2007 నుంచి ఎస్​బీఐ ఇజ్రాయెల్​లో సేవలు అందిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలోనూ, ప్రస్తుతమున్న యుద్ధ పరిస్థితుల్లోనూ తన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఎస్​బీఐ 29 దేశాల్లో 241 కార్యాలయాల ద్వారా సేవలు అందిస్తోంది.

భారత కార్మికులకు ఊరట
ఇజ్రాయెల్​కు ఇటీవలే సుమారు 40వేల మంది భారతీయ కార్మికులు వెళ్లారు. వీరు ప్రధానంగా వ్యవసాయ, నిర్మాణ రంగాల్లో పనికి చేరారు. వీరి కోసం ఎస్​బీఐ తన టెల్​ అవీవ్ బ్రాంచ్ ద్వారా భారత్​లో ఎన్​ఆర్​ఐ ఖాతాలను తెరవడానికి వీలు కల్పిస్తుంది. అలాగే సులభంగా తాము సంపాదించిన డబ్బును ఇండియాకు పంపడానికి వీలవుతుంది. ఇందుకోసం ఎస్​బీఐ- ఫిన్​టెక్ సంస్థలతో, స్థానిక బ్యాంకులతో కలిసి పనిచేస్తుంది.

టెల్​ అవీవ్​ పక్కనున్న రామత్​-గాన్​లోని డైమండ్ ఎక్స్ఛేంజ్​లో ఎస్​బీఐ బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్​ స్థానిక కార్పొరేట్​లకు ట్రేడ్ ఫైనాన్స్​ అందిస్తుంది. అలాగే భారత ప్రాజెక్టులకు బ్యాంక్ గ్యారెంటీలు, వ్యాపార ఖాతాలు తదితర సేవలు అందిస్తుంది. మరోవైపు భారత్​-ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్​టీఏ)పై చర్చలు వేగవంతం అయ్యాయి. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంచే లక్ష్యంతో భారత విదేశాంగ మంత్రి ఎస్​.జైశంకర్​ డిసెంబర్​లో ఇజ్రాయెల్​ను సందర్శించగా, అంతకు ముందు నవంబర్​లో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ ఆ దేశంలో పర్యటించారు. గత నెలలో ఇజ్రాయెల్​ ప్రధాని బెంజిమన్​ నెతన్యాహు, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్​లో మాట్లాడారు. వీరిద్దరూ త్వరలో కలవడానికి కూడా సుముఖత వ్యక్తం చేశారు. 2025లో ఇరుదేశాల మంత్రుల పరస్పర పర్యటనల తర్వాత ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బీఐటీ)పై సంతకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత్​-ఇజ్రాయెల్ మధ్య ఆర్థిక సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లడంలో తమ బ్యాంక్​ ఒక పటిష్టమైన వారధిగా పనిచేస్తోందని ఎస్​బీఐ ప్రతినిధులు పేర్కొన్నారు.

రక్షణ సహకారం
భారత్​-ఇజ్రాయెల్ మధ్య మంచి రక్షణ సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే కుదిరిన డీల్​ ప్రకారం, భారత్​కు లైట్‌ మెషిన్‌ గన్స్‌తోపాటు కార్బైన్లను ఇజ్రాయెల్‌ సరఫరా చేయనుంది. ప్రపంచంలోనే తొలి కంప్యూటరైజ్డ్ రైఫిల్ సిస్టమ్‌ 'అర్బెల్‌ టెక్నాలజీ'ని భారత్‌కు అందించేందుకు సంబంధిత ఏజెన్సీలతో చర్చలు జరుపుతోంది.

త్వరలోనే భారత సైన్యానికి మొదటి విడతగా ఇజ్రాయెల్‌కు చెందిన 40వేల లైట్‌ మెషిన్‌ గన్స్‌ అందనున్నాయి. ఇప్పటికే వాటి పరీక్షలు పూర్తయ్యాయని, వాటి ఉత్పత్తి కోసం లైసెన్స్‌ కూడా పొందినట్లు రక్షణ పరికరాల సంస్థ ఇజ్రాయెల్‌ వెపన్‌ ఇండస్ట్రీస్‌ ఈ ప్రకటించింది. వాటితోపాటు దాదాపు లక్షా 70వేల క్లోజ్‌ క్వార్టర్స్‌ బ్యాటిల్‌ కార్బైన్ల సరఫరాకు సంబంధించిన ఒప్పందం తుది దశలో ఉన్నట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. పిస్టల్స్‌, రైఫిల్స్‌, మెషిన్‌ గన్స్‌ సహా ఇతర రక్షణ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకునేందుకు వివిధ ఏజెన్సీలతో భారత్‌ సంప్రదింపులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది.