ETV Bharat / business

సౌదీ ఆరాంకోపై ఇరాన్ డ్రోన్ ఎటాక్​- చమురు శుద్ధి కర్మాగారం మూసివేత

ఇరాన్ వర్సెస్​ ఇజ్రాయెల్, అమెరికా- సౌదీ ఆరాంకోకు చెందిన చమురు శుద్ధి కర్మాగారాంపై డ్రోన్​ ఎటాక్​

Saudi Aramco Shuts Key Oil Refinery
Saudi Aramco Shuts Key Oil Refinery (Associated Press (Representative image))
author img

By ETV Bharat Telugu Team

Published : March 2, 2026 at 3:44 PM IST

3 Min Read
Choose ETV Bharat

Saudi Aramco Shuts Key Oil Refinery : అమెరికా, ఇజ్రాయెల్​ జరిపిన దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్​ పశ్చిమాసియా అంతటా దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో సోమవారం సౌదీ ఆరాంకోకు చెందిన కీలక ఆయిల్ రిఫైనరీపై కూడా దాడి చేసింది. దీనితో ఆరాంకో తన 'రాస్​ తనూరా రిఫైనరీ'ని మూసివేసినట్లు ప్రకటించింది.

సౌదీ అరేబియాలోని గల్ఫ్​ తీరంలో ఉన్న రాస్​ తనూరా కాంప్లెక్స్​ రోజుకు 5,50,000 బ్యారెల్స్​ సామర్థ్యంతో పశ్చిమాసియాలోనే అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటిగా ఉంది. ఇది సౌదీ ముడిచమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన టెర్మినల్​గా కూడా పనిచేస్తోంది. అందుకే దీనిని ముందు జాగ్రత్త చర్యగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలోనే ఉందని పేర్కొన్నాయి. అయితే ఇరాన్ చేసిన ఈ డ్రోన్ దాడి గల్ఫ్​ ప్రాంతంలో జరిగిన వరుస దాడులలో భాగంగానే జరిగిందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరాన్​ అబుదాబి, దుబాయ్​, దోహా, మనామా సహా ఒమన్​లోని నౌకాశ్రయం దుక్మ్​ (Duqm)పై కూడా దాడి చేసింది. దీనితో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​, ఒమన్​లోని ప్రధాన షిప్పింగ్ హబ్​లు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా సోమవారం బ్రెండ్ క్రూట్ ఫ్యూచర్స్ ధరలు సుమారు 10 శాతం మేర పెరిగాయి.

రిఫైనరీ చెలరేగిన మంటలు
సౌదీ అరాంకోకు చెందిన రాస్ తనూరా రిఫైనింగ్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగిన తరువాత, అనంతరం రాస్ తనూరా రిఫైనింగ్ కేంద్రంలో చిన్నపాటి అగ్నిప్రమాదం జరిగిందని, అయితే ప్రస్తుతం అది నియంత్రణలో ఉందని జెరూసలెం పోస్ట్ పేర్కొంది. వాస్తవానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సౌదీ అరేబియా ఇంధన కేంద్రాలపై గతంలోనూ పలుమార్లు దాడులు జరిగాయి. ముఖ్యంగా 2019 సెప్టెంబర్​లో అబ్కైక్​, ఖురైస్​ ప్లాంట్స్​పై జరిగిన డ్రోన్​, క్షిపణి దాడుల వల్ల సౌదీ ముడి చమురు ఉత్పత్తి సగానికిపైగా నిలిచిపోయింది. ఇది అప్పట్లో ప్రపంచమార్కెట్లను కుదిపేసిన విషయం తెలిసిందే.

ఇరాన్ భీకర ప్రతీకార దాడులు
మరోవైపు బహ్రెయిన్​లోని సల్మాన్ పోర్టుపై కూడా క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్​ ప్రెస్ టీవీ వెల్లడించింది. ఇరాన్​పై దాడి చేసేందుకు అవసరమైన అమెరికా లాజిస్టిక్సల్​ పరికరాలను రవాణా చేసేందుకు ఈ పోర్టును ఉపయోగిస్తుండడమే ఇందుకు కారణమని పేర్కొంది. ఇక సోమవారం ఉదయం కువైట్​లో కూలిపోయిన అమెరికా ఎఫ్​-15 యుద్ధ విమాన పైలట్​కుసంబంధించినదిగా చెబుతున్న ఫొటోనూ కూడా ఇరాన్ ప్రభుత్వ మీడియా టెలిగ్రామ్​లో విడుదల చేసింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్​ లక్ష్యాలపై ఇరాన్ దాడులకు సంబంధించిన దృశ్యాలను కూడా పోస్టు చేసింది. 'కువైట్​లో యుద్ధ విమానం కూలిపోయిన తరువాత అమెరికన్ పైలెట్' అనే క్యాప్షన్​తో ప్రెస్ టీవీ టెలిగ్రామ్​లో ఓ పోస్టు పెట్టింది.

మరోవైపు ఇరాన్ ప్రతీకార దాడుల తీవ్రత చూసి గల్ఫ్ దేశాల అధికారులు దిగ్భ్రాంతికి గురైనట్లు ఓ ప్రముఖ పత్రికా విలేకరి అమీచాయ్​ స్టెయిన్ పేర్కొన్నారు. "గల్ఫ్​ దేశాల ఉన్నతాధికారులతో నేను మాట్లాడాను. ఇరాన్ దాడుల తీవ్రతను చూసి వారు పూర్తిగా షాక్​కు గురయ్యారు. ఖమేనీని అంతం చేసిన తరువాత వారు స్పందిస్తారని మాకు తెలుసు. కానీ వారు కేవలం సైనిక స్థావరాలనే కాకుండా, పౌరుల నివాస ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇది పూర్తిగా పిచ్చి చర్య. వారు అర్థపర్థం లేని పనులు చేస్తున్నారు" అని ఒ క అధికారి తనతో అన్నట్లు అమీచాయ్ స్టెయిన్ ఎక్స్​ వేదికగా వెల్లడించారు. "ఇరాన్ దాడులు ఊహకు మించి జరుగుతున్నాయ్​" అని మరో ఉన్నతాధికారి వ్యాఖ్యానించారని చెప్పారు.

అమెరికా, ఇజ్రాయెల్​లు సంయుక్తంగా 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ/ రోరింగ్ లయన్​' పేరుతో ఫిబ్రవరి 28న ఇరాన్​పై భారీ సైనిక దాడి చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆ ఉమ్మడి సైన్యాలు ఇరాన్​లోని కీలక సైనిక స్థావరాలు, అణు స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, నాయకుల కార్యాలయాలపై భారీ స్థాయిలో వైమానిక, క్షిపణి దాడులు చేశాయి. ఈ క్రమంలో అవి చేసిన లక్షిత దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్​ హతమయ్యారు. దీనితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా డ్రోన్, క్షిపణి దాడులు చేస్తోంది. దీనితో ఈ ప్రాంతీయ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ సంస్థలు శాంతిని కోరుతున్నప్పటికీ, యుద్ధం మాత్రం మరింత భీకరంగా మారుతుండడం గమనార్హం.

అమెరికా, ఇజ్రాయెల్​ దాడులు- ఇరాన్​లో 555 మంది మృతి- నతాంజ్‌ యురేనియం శుద్ధి కేంద్రంపై దాడి?

బీ-2 బాంబర్స్, సూసైడ్ డ్రోన్స్ - ఖమేనీని హతమార్చేందుకు అమెరికా ఇంకా ఆయుధాలు వాడిందంటే!