పెరుగుతున్న "క్రెడిట్ కార్డు మోసాలు" - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ ఖాతా ఖాళీ!
మీ దగ్గర "క్రెడిట్ కార్డు" ఉందా? - ఇలా వాడకపోతే మోసపోతారంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 9, 2026 at 5:17 PM IST
How to Prevent Credit Card Frauds : ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. అయితే, కార్డుల వినియోగంతో పాటు వాటిపై మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. బ్యాంకు సేవింగ్స్, కరంట్ ఖాతాదారులు ఎలాంటి మోసాలకు గురవుతున్నారో, అలాగే క్రెడిట్ కార్డు వినియోగదారులూ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రంగం అలాంటి మోసాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ, ఈ మోసాలను నివారించే విషయంలో క్రెడిట్ కార్డు వినియోగదారుల అవగాహన కూడా చాలా కీలకమంటున్నారు నిపుణులు. లేదంటే సైబర్ మోసగాళ్లు ఈజీగా మీ ఖాతా ఖాళీ చేస్తారని హెచ్చరిస్తున్నారు. అందుకే, వినియోగదారుడు స్వయంగా అవగాహన పెంచుకోవడానికి, క్రెడిట్ కార్డు మోసాన్ని నివారించడంలో సహాయపడటానికి కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం.
కార్డు సేఫ్టీ ముఖ్యం :
క్రెడిట్ కార్డ్ మోసాల నివారణకు ప్రాథమిక చర్యగా, కార్డులను ఇతరులకు సులభంగా అందుబాటులో లేని ప్లేస్‌లో ఉంచాలి. ముందుగా, కొత్త క్రెడిట్ కార్డ్ కిట్/ఎన్వలప్‌ను ఎవరూ తారుమారు చేయలేదని నిర్ధారించుకోవాలి. కార్డు అందిన వెంటనే దాని వెనుక సిగ్నేచర్ చేయాలి. ఎప్పుడూ కార్డును ఒక పర్సులో భద్రంగా పెట్టుకోవాలి. ప్రతి కొనుగోలు తర్వాత, వీలైనంత త్వరగా కార్డును భద్రపరచుకోవడం ఎప్పుడూ మర్చిపోకూడదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సెల్ ఫోన్ కెమెరాలతో తీసే స్నాప్‌షాట్‌ల ద్వారా మోసగాళ్లు క్రెడిట్ కార్డు డిజిటల్ ముద్రలను భద్రపరచుకోగలుగుతున్నారు. కాబట్టి, క్రెడిట్ కార్డు వినియోగించేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
క్రెడిట్ కార్డును మీరు కొన్ని రోజులు వాడకపోయినా, మీ పర్సులో అది ఉందో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవడం కూడా మంచిది. క్రెడిట్ కార్డు ట్రాన్సక్షన్స్‌ను SMS, ఇమెయిల్ హెచ్చరికల ద్వారా, అలాగే ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా పర్యవేక్షించవచ్చంటున్నారు. అదేవిధంగా, మీరు క్రెడిట్ కార్డు ఖర్చులను ట్రాక్ చేయడానికి వీలు కల్పించే రియల్ టైం హెచ్చరికలను పొందవచ్చని చెబుతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు మీరు కార్డుకు సంబంధించిన(ఖర్చుల) సమాచారాన్ని తెలుసుకోవచ్చంటున్నారు. ఏదైనా అనుమానస్పద విషయం గమనించిన వెంటనే, ఆ విషయాన్ని మీరు బ్యాంకుకు తెలియజేసి, క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించడం మేలు అంటున్నారు నిపుణులు.
కార్డు డిటేయిల్స్ షేర్ చేయొద్దు :
క్రెడిట్ కార్డు నంబరు, దానికి సంబంధించిన ఇతర సున్నితమైన సమాచారాన్ని మొబైల్ ద్వారా గానీ, టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా గానీ ఇతరులకు ఎప్పుడూ షేర్ చేయకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఓటీపీ మోసాల గురించి పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, కొంతమంది క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇప్పటికీ ఈ మోసాలలో చిక్కుకుంటున్నారని చెబుతున్నారు నిపుణులు. బ్యాంకు ఉద్యోగిగా మోసగాళ్లు వ్యవహరించి ఫోన్ కాల్ ద్వారా OTPని షేర్ చేసేలా కార్డ్ వినియోగదారులను ఒప్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయంటున్నారు. ఎప్పుడైనా సరే బ్యాంకు ఉద్యోగులు ఓటీపీని అడగరని గుర్తించుకోవాలి. ముఖ్యంగా కార్డుదారులు తమ క్రెడిట్ కార్డు వివరాలకు సంబంధించి గడువు తేదీ(expiry date), CVVని కూడా ఎవరికీ షేర్ చేయకూడదని సూచిస్తున్నారు.
"ఇల్లు" అమ్మే ఆలోచనలో ఉన్నారా? - ఇలా చేస్తే "పన్ను" తగ్గించుకోవడానికి ఛాన్స్!
ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ :
క్రెడిట్ కార్డు ప్రొవైడర్ లేదా వ్యక్తిగత సమాచారం అవసరమయ్యే వ్యాపారాల పేర్లతో ఉన్న ఈమెయిల్ లింక్‌ల ద్వారా వచ్చే ఫిషింగ్ ముప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అసురక్షిత వెబ్‌సైట్లలో క్రెడిట్ కార్డు డీటెయిల్స్ నమోదు చేయవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వెబ్‌సైటుకు సంబంధించిన చట్టబద్ధతను ధ్రువీకరించుకోవడం తప్పనిసరి అంటున్నారు. ఆ సైటు లేదా అలాంటి పేరుతో మరో వెబ్‌సైట్ ఉందో లేదో చెక్ చేసుకోవడం ద్వారా ఇది చేయవచ్చని చెబుతున్నారు. ఆ సైటుకు సంబంధించిన అడ్రస్ బార్‌లో "https://" ఉన్నప్పుడు వెబ్‌సైట్ సురక్షితంగా ఉందని మీరు కన్ఫార్మ్ చేసుకోవచ్చంటున్నారు.
ఆధారాలు :
క్రెడిట్ కార్డు మోసాలను నివారించడానికి మరో సులభమైన మార్గం ఉందంటున్నారు నిపుణులు. అదేంటంటే, సాధారణంగా కార్డు బిల్లింగ్ స్టేట్‌మెంట్లపై పూర్తి క్రెడిట్ కార్డు నంబరు ప్రింట్ అయి ఉంటుంది. క్రెడిట్ కార్డు వినియోగదారుడిగా, స్టేట్‌మెంట్‌ను చూసి చెత్తబుట్టలో పడేసే ముందు దాన్ని తప్పనిసరిగా చింపేయడం ఉత్తమం అని సూచిస్తున్నారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన, రద్దయిన క్రెడిట్ కార్డులనూ ముక్కలు చేయాలంటున్నారు. ఇలా చేయడం ద్వారా మీ కార్డు డీటెయిల్స్ ఇతరులకు అందకుండా ఉంటాయని చెబుతున్నారు.
RFID బ్లాకింగ్ వాలెట్ :
కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు నార్మల్‌గా వాటిలో పొందుపరిచిన RFID చిప్‌ను కలిగి ఉంటాయి. ఇది వినియోగదారులు కార్డ్‌ను స్వైప్ చేయాల్సిన పని లేకుండా సులభమైన ట్రాన్సక్షన్‌ను అనుమతి ఇస్తుంది. అయితే, సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు వినియోగదారుడి పక్కన నిల్చొని కార్డుకు సంబంధించిన RFID డేటాను స్కాన్ చేయగలరు. అందుకే, RFID-బ్లాకింగ్ వాలెట్ వాడడం ద్వారా ఇలాంటి మోసాలకు చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు.
తక్కువ వడ్డీకే "పర్సనల్ లోన్" ఇస్తున్న బ్యాంకులివే! - ఎందులో ఎంత ఉందంటే?
కొత్తగా జాబ్‌లో చేరారా? - మీ ఆర్థిక ప్రణాళిక ఇలా ఉంటే అప్పులకు "నో" ఛాన్స్!

