ETV Bharat / business

రూ.1 లక్షకు 5 నిమిషాల్లో రూ.44 లక్షల లాభం- ట్రేడర్ పోస్ట్ నెట్టింట వైరల్!

5 నిమిషాల వ్యవధిలో 2 వేల పాయింట్లకుపైగా హెచ్చుతగ్గులకు గురైన సెన్సెక్స్- కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ సిస్టమ్ వల్ల గందరగోళం!

Stock Market
ప్రతీకాత్మక చిత్రం (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : August 28, 2026 at 8:06 PM IST

3 Min Read
Choose ETV Bharat

Sensex Wild Swing 5 Minutes : భారత స్టాక్ మార్కెట్లో గురువారం జరిగిన అనూహ్య పరిణామం ట్రేడర్లలో తీవ్ర చర్చకు దారితీసింది. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ రోజున సెన్సెక్స్ క్లోజింగ్ సమయంలో ఒక్కసారిగా భారీగా పడిపోవడం, వెంటనే అంతే వేగంగా కోలుకోవడం మార్కెట్ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలోనే ఓ ట్రేడర్ దీని గురించి సోషల్ మీడియాలో ఊహాత్మక లెక్కలతో ఒక పోస్ట్ చేయగా ఇది నెట్టింట చక్కర్లు కొడుతోంది. క్షణాల్లో వైరల్ అయింది. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే కేవలం 5 నిమిషాల్లోనే అది రూ.44 లక్షలుగా మారే అవకాశం ఉందని ఆ వ్యక్తి తన పోస్ట్‌లో పేర్కొనడం గమనార్హం. అయితే ఇది వాస్తవంగా జరిగిన ట్రేడ్ వివరాలు కాకపోయినా, సెన్సెక్స్ ఆప్షన్ ధరల కదలికల ఆధారంగా చేసిన ఊహాత్మక లెక్కలు.

రూ.1 లక్షతో రూ.44 లక్షలు ఎలా?
విభోర్ వర్ష్‌నీ పేరుతో ఉన్న ఎక్స్ అకౌంట్‌లో ఈ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ప్రకారం- 'ఎవరైనా సెన్సెక్స్ 76500 పుట్ ఆప్షన్‌లో (76000 PE) రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి, మధ్యాహ్నం 3.15 గంటలకు కొనుగోలు చేసి 3.20 గంటలకు విక్రయించి ఉంటే సుమారు రూ.44 లక్షల లాభం వచ్చి ఉండేదని ట్రేడర్ పేర్కొన్నారు. అయితే అసలు పోస్ట్‌లో 3.15 AM అని తప్పుగా పేర్కొనగా, మార్కెట్ సమయాన్ని బట్టి అది 3.15 PM గా ఉండాల్సి ఉంటుందని సమాచారం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, రూ.1 లక్ష నుంచి రూ.44 లక్షలకు వాల్యూ నిజంగా పెరిగిందని కాదు. వాస్తవంగా ఇలాంటి ట్రేడ్ జరిగిందని అర్థం కాదు. సెన్సెక్స్ భారీ కదలకలను ఆధారంగా చేసుకొని చేసిన ఒక హైపోతెటికల్ కాలిక్యులేషన్ మాత్రమే.

5-6 నిమిషాల్లోనే 2 వేల పాయింట్లకుపైగా స్వింగ్
ఈ చర్చకు కారణం సెన్సెక్స్‌లో ఆ సమయంలో నమోదైన అసాధారణ కదలికనే. నెలవారీ డెరివేటివ్స్ ఎక్స్‌పైరీ రోజున సాధారణంగా సెన్సెక్స్ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవ్వొచ్చు. కానీ ఇటీవల స్టాక్ మార్కెట్లో ప్రవేశపెట్టిన కొత్త క్లోజింగ్ ఆక్షన్ సెషన్ (CAS) విధానం వల్ల ఇటీవల క్లోజింగ్ సమయాల్లో ఇండెక్స్‌లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే గురువారం ఇది కాస్త అసాధారణంగా, ఎవరూ ఊహించలేని రీతిలో జరిగింది. CAS సమయంలో సెన్సెక్స్ కొన్ని నిమిషాల్లోనే భారీగా పడిపోయింది. మధ్యాహ్నం 3.17 గంటల సమయంలో 77200 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ 3.23 గంటలకు చూస్తే అంటే కేవలం మరో 5-6 నిమిషాల్లోనే 74,983కు పడిపోయింది. ఇక్కడ 6 నిమిషాల్లో ఏకంగా 2 వేల పాయింట్లకుపైగా తగ్గిందని చెప్పొచ్చు.

అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే పడిపోయింది అలానే ఉండలేదు. మళ్లీ అంతే వేగంగా పుంజుకుంది. 3.23 గంటల నుంచి 3.30 గంటల మధ్య దాదాపు మళ్లీ 2 వేల పాయింట్ల మేర పుంజుకుంది. చివరికి చూస్తే సెన్సెక్స్ తిరిగి 76934 వద్ద ముగిసింది. బుధవారం ముగింపు స్థాయి కంటే 539 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఈ ఊహించని స్వింగ్ కేవలం సెన్సెక్స్ ఇండెక్స్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సెన్సెక్స్‌లో అత్యధిక వెయిటేజీ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కూడా కొన్ని నిమిషాల్లో భారీ హెచ్చుతగ్గులకు గురైంది. రిలయన్స్ షేర్లు సుమారు రూ.1289 నుంచి రూ.1250 కి పడిపోయి, తర్వాత వేగంగా కోలుకొని మళ్లీ రూ.1286 వద్ద ముగిసింది. రిలయన్స్‌‌తో పాటు ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్ వంటి పలు హెవీ వెయిట్ స్టాక్స్ షేర్లలోనూ క్లోజింగ్ సమయంలో భారీ మార్పులు కనిపించాయి.

క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌పై అనుమానాలు, ప్రశ్నలు?
ఈ పరిణామం నేపథ్యంలోనే బీఎస్ఈ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ క్లోజింగ్ ఆక్షన్ సెషన్‌పై (CAS) మళ్లీ చర్చ మొదలైంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ఆగస్ట్ 3 నుంచి క్లోజింగ్ ధరల్ని మరింత కచ్చితత్వంతో నిర్ణయించే కొత్త విధానంగా సీఏఎస్‌ను తీసుకొచ్చింది. మార్కెట్ ముగింపు సమయంలో ధరల మానిప్యులేషన్ అవకాశాల్ని తగ్గించడమే దీని లక్ష్యమని ఎక్స్చేంజీ పేర్కొంది. ఈ విధానం ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ జరిగే సుమారు 200 షేర్లకు వర్తిస్తుంది. ఇతర షేర్లకు మాత్రం గతంలో ఉన్న వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ విధానమే కొనసాగుతుంది. సీఏఎస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సెన్సెక్స్, నిఫ్టీల్లో మార్కెట్ ముగింపునకు ముందు 3.15 గంటల నుంచి 3.30 గంటల వరకు అసాధారణ ధరల కదలికలు కనిపించడంపై ట్రేడర్లు దృష్టి సారించారు. దీనిపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు, ప్రశ్నలున్నాయి.

ఆరోగ్య బీమాలో 'OPD కవరేజ్' తీసుకున్నారా? - లేదంటే ఈ ప్రయోజనాలు మిస్ అవుతారట!

'ఇల్లు/ప్లాట్​/భూమి' కొనుగోలు చేయాలనుకుంటున్నారా? - ఈ మోసాల గురించి అవగాన తప్పనిసరట!