క్రెడిట్ స్కోర్ బాగున్నా "పర్సనల్ లోన్ రిజెక్ట్" అవుతుందా? - కారణాలు ఇవే కావొచ్చు!
- పర్సనల్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? - మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నా ఈ కారణాల వల్ల బ్యాంకులు రిజెక్ట్ చేసే అవకాశం!

Published : June 2, 2026 at 4:24 PM IST
Reasons Behind the Personal Loan Rejection: పర్సనల్ లోన్ పొందాలంటే క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉంటే చాలని మెజార్టీ పీపుల్ భావిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆ స్కోర్‌ను పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, కొన్ని సార్లు మెరుగైన క్రెడిట్ స్కోర్ ఉన్నా బ్యాంకులు లోన్ అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తుంటాయి. దీంతో చాలా మంది "క్రెడిట్ స్కోర్ మంచిగానే ఉందిగా? ఎందుకు రిజెక్ట్ అయ్యింది?" అని తెగ ఆలోచిస్తుంటారు. అయితే, ఈ విషయంలో మీరు పొరబడినట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే లోన్ మంజూరు అనేది ఒక్క క్రెడిట్ స్కోర్ మీద మాత్రమే ఆధారపడి ఉండదని చెబుతున్నారు. బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్స్ కంపెనీల వద్ద రుణాల కోసం అప్లై చేసినప్పుడు అవి రిజెక్ట్ కావడానికి క్రెడిట్ స్కోరే కాకుండా ఇతర కారణాలు కూడా ఉంటాయంటున్నారు. మరి, అవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
వయసు: లోన్ తిరస్కరణకు వయసు కూడా కొన్నిసార్లు కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే వయసు మళ్లినవారితో పోలిస్తే, ఎక్కువ కాలం ఉద్యోగం చేసే అవకాశం ఉన్న వారికే రుణం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి మరో రెండు సంవత్సరాల్లో రిటైర్ అవుతారనుకుంటే.. మరికొన్ని రోజులు మాత్రమే అతనికి మెరుగైన ఆదాయం ఉంటుందని బ్యాంకు భావిస్తుందట. దీంతో తక్కువ సర్వీస్ ఉన్న కారణంగా రుణం ఇవ్వడానికి ఆసక్తి చూపవంటున్నారు. అంతేకాకుండా, పదవీ విరమణకు ముందు ఉండే వయసును బ్యాంకులు రిస్క్ ఏజ్‌గా కూడా పరిగణిస్తాయని.. దురదృష్టవశాత్తు ఉద్యోగికి ఏమయినా అయితే, రుణ రికవరీ కష్టం అవుతుందని భావిస్తాయట. అందుకే బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు ఎక్కువ జాబ్ సర్వీసు ఉన్నవారిపై మొగ్గు చూపిస్తాయంటున్నారు.
స్థిరమైన ఆదాయం: క్రెడిట్ స్కోర్ బాగానే ఉన్నా లోన్ రిజెక్ట్ కావడానికి మరో కారణం స్థిరమైన ఆదాయం లేకపోవడం అంటున్నారు. స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల క్రెడిట్ స్కోరు బాగుండి, పర్సనల్ లోన్‌కు అర్హులైనప్పటికీ, కొన్ని అనుకోని కారణాల వల్ల వారి ఆదాయం హెచ్చుతగ్గులకు గురవుతుందంటున్నారు. అందుకే ఈ కారణం చేత బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు వెనకాడుతాయంటున్నారు.
ఒకవేళ దరఖాస్తుదారుడికి స్థిరమైన ఉద్యోగం ఉన్నాసరే అతడి నెల ఆదాయం.. లోన్ ఈఎంఐకి సమానంగా లేదా మించి ఉన్నప్పుడు కూడా బ్యాంకులు రుణ దరఖాస్తును తిరస్కరిస్తాయంటున్నారు. బ్యాంకు నిర్దేశించిన కనీస ఆదాయ అర్హత కంటే మీ ఆదాయం తక్కువగా ఉంటే, రుణ సంస్థ ఆ అభ్యర్థనను తిరస్కరిస్తుందంటున్నారు. అంటే చాలా బ్యాంకులు రుణ దరఖాస్తుదారుడి నెల నికర ఆదాయం రూ.25,000 కంటే ఎక్కువగా ఉంటే మేలని భావిస్తాయి. ఉద్యోగి ఔట్ సోర్సింగ్‌కు చెందినవారయినా కూడా బ్యాంకులు రుణం ఇవ్వడానికి వెనుకాడే అవకాశముంది. ఎందుకంటే, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సర్వీస్ ఎంత కాలం ఉంటుందో బ్యాంకులు సరిగ్గా అంచనా వేయలేవంటున్నారు.
డాక్యుమెంట్స్: లోన్ అప్లికేషన్ అఫ్రూవ్ అవ్వాలంటే సపోర్టుగా దరఖాస్తుదారుడికి చెందిన సంబంధిత పత్రాలు కూడా చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా, రుణానికి.. జీతం పే స్లిప్‌లతో పాటు, బ్యాంకు అకౌంట్ స్టేట్‌మెంట్లు, గుర్తింపు రుజువు వంటివి అవసరం పడతాయని చెబుతున్నారు. లోన్‌కు అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్ల పరిశీలన, ధ్రువీకరణ తర్వాత మాత్రమే వ్యక్తిగత రుణ దరఖాస్తు ఆమోదం జరుగుతుందని.. ఏదైనా వ్యక్తిగత డాక్యుమెంట్ లేకపోయినా లేదా వాటిలో తప్పులున్నా, పత్రాలలో పొంతన లేని సమాచారం ఉన్నా, లోన్ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుందని సూచిస్తున్నారు.
బహుళ రుణ దరఖాస్తులు: కొంతమంది రుణం అత్యవసరమైనప్పుడు ఒకేసారి అనేక బ్యాంకులకు దరఖాస్తు చేస్తారు. ఒక బ్యాంక్‌లో కాకపోతే మరొక దాంట్లో వస్తుందని ఆశపడతారు. అయితే, ఇలా ఒకటికి మించి ఎక్కవ బ్యాంకుల్లో లోన్ కోసం అప్లై చేసినప్పుడు క్రెడిట్ స్కోర్ భారీగా పడిపోతుందని.. అంతేకాకుండా మీరు బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లుగా బ్యాంకులు పరిగణిస్తాయని అంటున్నారు. దీనివల్ల మీ ఆర్థిక విశ్వసనీయతపై సందేహాలు ఏర్పడి, మీ దరఖాస్తు తిరస్కరణకు దారితీయవచ్చంటున్నారు. ఈ పరిస్థితి ఎదురుకాకూడదంటే క్రెడిట్ స్కోరును సరిగ్గా చెక్ చేసుకుని, పూర్తి నమ్మకం ఏర్పడ్డాక అనువుగా ఉండే ఒక బ్యాంక్ నుంచి మాత్రమే వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
సుకన్య సమృద్ధి స్కీమ్ ద్వారా రూ.50 లక్షలు పొందాలా? - నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే!
హెల్త్ ఇన్సూరెన్స్ - ముందస్తు ఆమోదం లభించినా, క్లెయిమ్ తిరస్కరణ!

