త్వరలో పాలిమర్ నోట్లు విడుదల- 2027 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించే అవకాశం!
తొలుత రూ.10, రూ.20 నోట్లు- కొత్త పాలిమర్ నోట్లనూ దశలవారీగా ప్రవేశపెట్టనున్న RBI

Published : July 17, 2026 at 3:12 PM IST
Polymer Currency Notes India : త్వరలో పాలిమర్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అధికారిక వర్గాలు తెలిపాయి. కొత్త తరం కరెన్సీని ప్రవేశపెట్టాలన్న కేంద్ర బ్యాంకు ప్రణాళికలో తదుపరి దశగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి. వీటిని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రూ.10, రూ.20 నోట్లను తొలుత తీసుకురానున్నారు. వీటి ఫలితం ఆధారంగా, 2027 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది. ప్రస్తుత కాగితపు నోట్లు చలామణిలో కొనసాగుతుండగానే కొత్త పాలిమర్ నోట్లనూ దశలవారీగా ప్రవేశపెట్టనున్నారు. పాలిమర్ నోట్లు వచ్చినప్పటికీ, పేపర్ కరెన్సీ ఎప్పటిలానే కొనసాగుతాయని, దశలవారీగా పాలిమర్ నోట్లు మార్కెట్‌లోకి చలామణీకి రానున్నాయని వర్గాలు తెలిపాయి. అయితే, కాగితపు కరెన్సీతో పోలిస్తే ఇవి ఎక్కువ మన్నికగా ఉంటాయి. చలామణిలో ఉన్న కరెన్సీ నాణ్యతను, మన్నికను మెరుగుపరిచే విస్తృత వ్యూహంలో భాగంగా పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలనే తన ఉద్దేశాన్ని ఆర్‌బీఐ గతంలోనే ప్రకటించింది.
ఈ నోట్లతో ఎక్కవ కాలం మన్నిక
కరెన్సీ నోట్ల మన్నికను పెంచడం, అలాగే, నకిలీ నోట్లను అరికట్టడం ఈ పాలిమర్ నోట్ల ముఖ్య ఉద్దేశం. అయితే, అధునాతన భద్రతా లక్షణాలతో కూడిన పాలిమర్ సబ్‌స్ట్రేట్‌ను సరఫరా చేయడానికి ప్రపంచవ్యాప్త తయారీదారులను ఆహ్వానించారు. బిడ్లను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 18. ఇక, పాలిమర్ నోట్ల విషయానికొస్తే, ఇవి తడిని తట్టుకోగలవు, అలాగే, చిరిగి పోవడం, నల్లగా మారడం వంటి సమస్యలు ఉండవు. అంతేకాదు, ఈ నోట్లు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా నీరు, మురికి వంటి వాటికి త్వరగా పాడవవు. పలుచని, రక్షిత అల్ట్రా వయొలెట్ క్యూర్‌డ్ వార్నిష్ పూత పూసిన కాగితపు నోట్లనే వార్నిష్ కరెన్సీగా పిలుస్తారు. తరచూ నోట్లు పాడైపోయి, కొత్తవి ముద్రించేందుకు అవుతున్న ఖర్చు తగ్గించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటికే, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పాలిమర్ నోట్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు.
డిజిటల్ చెల్లింపులు వచ్చినప్పటికీ
డిజిటల్ చెల్లింపులు వచ్చినప్పటికీ, కాగితపు కరెన్సీకి ఉన్న గిరాకీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ఆలోచనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదేళ్ల క్రితమే ప్రతిపాదించింది. కాగితపు కరెన్సీని ముద్రించడానికి అయ్యే ఖర్చు, నోట్లు చేతులు మారే క్రమంలో అవి పాడైపోవడం వంటి వాటిని దృష్టిలోఉంచుకొని గతంలో ఆర్‌బీఐ ఆ ప్రతిపాదన చేసింది. కాటన్‌తో తయారు చేసే కాగితపు నోట్లకు బదులు, ప్లాస్టిక్ ఆధారిత పాలిమర్ నోట్లను తీసుకురావడం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చని ఆర్బీఐ భావిస్తోంది.
అయితే, దేశవ్యాప్తంగా ట్రయల్ పద్ధతిలో రూ.10 విలువైన ఒక బిలియన్ ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆ సమయంలో పార్లమెంట్‌కు కేంద్రం తెలియజేసింది. అందుకు కొచ్చి, మైసూర్, జైపుర్, శిమ్లా నగరాలను ఎంచుకుంది. అయితే సాంకేతిక, కార్యాచరణ సమస్యల కారణంగా ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ అంశంపై దృష్టి సారించిన కేంద్ర బ్యాంక్, ఏటీఎంలలో వీటి అనుకూలత వంటి సాంకేతిక అంశాలను పరిశీలిస్తూ పైలట్ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. అయితే, దీనిపై ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక, నకిలీ నోట్ల విషయానికొస్తే, బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.500 నోట్లు కూడా పెద్ద సంఖ్యలో చలామణిలో ఉన్నట్లు ఆర్‌బీఐ కొద్దిరోజుల క్రితం గుర్తించింది. అంతేకాదు, గతేడాదితో పోలిస్తే ఈ నకిలీల బెడద 20 శాతం పెరిగినట్లు పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 రూ.500 నోట్లను గుర్తించగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1,41,907 నోట్లకు పెరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 30,591 నకిలీ రూ.200 నోట్లను గుర్తించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది.
నెలవారీ బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నారా? - ఇలా పాటిస్తేనే సక్సెస్ అవుతుందట!
గుడ్ న్యూస్, తగ్గిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో రేట్లు ఎలా ఉన్నాయంటే?

