వార్ ఎఫెక్ట్- భారత పరిశ్రమలకు గ్యాస్ సరఫరాలో ఖతార్ భారీ కోత
ఖతార్ 'ఫోర్స్ మెజ్యూర్'- భారత పరిశ్రమలకు గ్యాస్ సరఫరాలో భారీగా కోత విధింపు

Published : March 3, 2026 at 8:53 PM IST
Qatar Cut Gas Supply To India : భారతదేశానికి ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ)ను సరఫరా చేసే అతిపెద్ద దేశమైన ఖతార్, గ్యాస్ సరఫరాలపై 'ఫోర్స్ మెజ్యూర్' (అనివార్య కారణాల వల్ల సరఫరా నిలిపివేత) ప్రకటించింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడి కారణంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంతరాయం కారణంగా భారతీయ పరిశ్రమలకు అందుతున్న గ్యాస్ సరఫరాలో 40 శాతం వరకు కోత పడిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
భారతదేశం తన అవసరాల కోసం ఏటా దిగుమతి చేసుకునే సుమారు 27 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీలో 40 శాతం వాటా ఖతార్‌దే. విద్యుత్ ఉత్పాదన, ఎరువుల తయారీ నుండి సీఎన్జీ పంపిణీ, వంట గ్యాస్ (పీఎన్జీ) నెట్‌వర్క్‌ల వరకు వివిధ రంగాలకు ఈ గ్యాస్ అత్యంత కీలకం.
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై నిరంతరాయంగా దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే ఖతార్ తన ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసినట్లు గ్యాస్ దిగుమతి సంస్థ 'పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ లిమిటెడ్' గ్యాస్ మార్కెటింగ్ సంస్థలకు సమాచారం అందించింది.
ఇరాన్ దాడుల ప్రభావంతో హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు, ఎల్‌ఎన్‌జీ రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడమే కాకుండా, వార్-రిస్క్ ఇన్సూరెన్స్, షిప్పింగ్ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. భారతదేశానికి వచ్చే ముడి చమురు దిగుమతుల్లో సుమారు 50 శాతం, ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో 54 శాతం ఈ జలసంధి గుండానే సాగుతాయి. ఖతార్‌తో పాటు యూఏఈ నుంచి వచ్చే గ్యాస్ రవాణాకు కూడా ఇదే ప్రధాన మార్గం.
ఖతార్ నుంచి సరఫరా నిలిచిపోయిన విషయాన్ని పెట్రోనెట్ సంస్థ తన గ్యాస్ కొనుగోలుదారులైన గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)లకు తెలియజేసింది. దీనితో, ఈ గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు సీఎన్జీ రిటైలింగ్ కోసం సరఫరాను యథాతథంగా ఉంచుతూనే, పరిశ్రమలకు ఇచ్చే గ్యాస్‌లో కోత విధించాయి. ఈ కోతలు 10-40 శాతం వరకు ఉన్నట్లు సమాచారం.
ఖతార్ నుంచి ఏటా 8.5 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేసేందుకు పెట్రోనెట్ దీర్ఘకాలిక ఒప్పందాన్ని కలిగి ఉంది. దీనికి అదనంగా స్పాట్ మార్కెట్ నుంచి కూడా ఖతార్ గ్యాస్‌ను కొనుగోలు చేస్తుంది. పెట్రోనెట్‌తో పాటు ఐఓసీ లాంటి సంస్థలకు యూఏఈతో కూడా దిగుమతి ఒప్పందాలు ఉన్నాయి. సరఫరాలో ఏర్పడిన ఈ లోటును పూడ్చుకోవడానికి గెయిల్, ఐఓసీ సంస్థలు ప్రస్తుతం 'స్పాట్ మార్కెట్' వైపు చూస్తున్నాయి. అయితే అక్కడ ఇప్పటికే ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ మార్కెట్‌లో ఎల్‌ఎన్‌జీ ధర ప్రస్తుతం ప్రతి మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్‌కు (mmBtu) 25 డాలర్లకు చేరుకుంది. ఇది దీర్ఘకాలిక ఒప్పంద ధరల కంటే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం.
ధరలు పెంచే ఆలోచన లేదు : కేంద్రం
ఇరాన్ యుద్ధంతో ఇంధన భద్రతా ఆందోళనలు నెలకొన్న వేళ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టంచేసింది. దేశంలో చమురు, శుద్ధిచేసిన చమురు నిల్వలు 25రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది. చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పెట్రోలియం, సహజ వాయువుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు. చమురు, ఎల్‌పీజీ సరఫరాపై కేంద్రం సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. దేశంలో ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, అందుబాటు ధరల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి, తర్వాత ఆ దేశంతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించింది. అయితే ఇరాన్ యుద్ధంతో నెలకొన్న ఇంధన అస్థిరతను భర్తీ చేయడానికి రష్యన్ ముడిచమురు కొనుగోలును పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. కానీ ఈ చర్య మళ్లీ అమెరికాతో దౌత్యపరమైన సమస్యలు పెంచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్‌కు రోజుకు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు హోర్ముజ్ జలసంధి గుండా వస్తోంది. ఆ జలసంధిని ఇప్పుడు ఇరాన్ సైన్యం మూసేసింది.

