రోజుకు రూ.417 పొదుపుతో కోటి రూపాయల ఆదాయం - రిస్క్ కూడా ఉండదు!
- తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నారా? - ఈ స్కీమ్‌పై ఓ లుక్కేయండి!

Published : February 26, 2026 at 11:59 AM IST
Public Provident Fund Scheme: ఏ సమయానికి ఏ అవసరం వస్తుందో చెప్పడం కష్టమే. అందుకే సంపాదనలో కొంత మొత్తాన్ని కచ్చితంగా పొదుపు చేయాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం చాలా మంది సేవింగ్స్‌పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడంతో పాటు రిస్క్ లేని ఆదాయాన్ని చూసుకుంటున్నారు. మరి మీరు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారా? అయితే మీకోసం అద్భుతమైన స్కీమ్ ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. నిజానికి ఎప్పటి నుంచో ఈ స్కీమ్ ఉన్నా ఎక్కువ శాతం మందికి తెలియదు. ఇందులో తక్కువ మొత్తంలో ఎక్కువ లాభం అర్జించవచ్చు. మరి ఈ స్కీమ్‌కు అర్హులు ఎవరు? ఎలా అప్లై చేసుకోవాలి? తదితర వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
స్కీమ్ వివరాలు:
- ఈ స్కీమ్‌లో చేరేందుకు భారతీయ పౌరులు ఎవరైనా అర్హులే. బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవచ్చు. మైనర్ల పేరు మీద తల్లిదండ్రులు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. అయితే ఒక్కరి పేరు మీద ఒక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి. జాయింట్ అకౌంట్‌కు ఇందులో ఆప్షన్ లేదు.
- ఈ స్కీమ్ మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. ఆ తర్వాత డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదంటే మెచ్యూరిటీ పూర్తైన తర్వాత మరో 5 సంవత్సరాల పాటు ఖాతాను పొడిగించుకోవచ్చు. ఇలా 5 సంవత్సరాల పీరియడ్ చొప్పున ఎన్నిసార్లు అయినా స్కీమ్‌ను కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే స్కీమ్‌లో కొనసాగాలంటే మెచ్యూరిటీ పూర్తి కావడానికి సంవత్సరం ముందే సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి అప్లికేషన్ ఇవ్వాలి.
- పీపీఎఫ్ అకౌంట్లో ఒక సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500, గరిష్ఠంగా రూ.1.50 లక్షల దాకా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అయితే ఒక్కసారి మాత్రమే కాకుండా నెల వారీగా, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం కాలంలో ఎన్ని సార్లు అయినా డబ్బులు పెట్టుబడి పెట్టొచ్చు. అయితే పెట్టుబడి మాత్రం రూ.లక్షన్నర దాటకుండా ఉండాలి.
- ఈ పథకానికి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంటుంది. దీని ప్రకారం మీరు రూ. 1.5 లక్షల పెట్టుబడిపై రాయితీ పొందవచ్చు. అలాగే వడ్డీపై కూడా పన్ను ఉండదు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7.1శాతం వడ్డీ ఉంది.
- ఖాతా తెరిచిన సంవత్సరం మినహా 5 సంవత్సరాల తర్వాత ఒకసారి అమౌంట్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే స్కీమ్‌లో జాయిన్ అయిన 3వ సంవత్సరం నుంచి లోన్ తీసుకునే సౌకర్యం ఉంది.
- 15 ఏళ్లలో ఏదైనా ఒక సంవత్సరం కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. మళ్లీ తిరిగి యాక్టివ్ చేయాలనుకుంటే రూ. 50 పెనాల్టీతో కలిపి మీరు ఎన్ని సంవత్సరాలు అయితే డిపాజిట్ చేయలేదో.. అది మొత్తం, పెనాల్టీ కలిపి డిపాజిట్ చేయాలి. మీ ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత మీరు మీ డిపాజిట్లు కొనసాగించవచ్చు.
- స్కీమ్‌లో జాయిన్ అయిన 5 ఏళ్ల తర్వాత ఖాతాను క్లోజ్ చేయడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఇది పాజిబుల్ అవుతుంది. అందులో ఖాతాదారునికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, పిల్లల ఉన్నత చదువు కోసం వంటి సందర్భాల్లో మెచ్యురిటీకి ముందే క్లోజ్ చేసుకోవచ్చు.
ఎంత డిపాజిట్ చేస్తే ఎంత డబ్బు: ఈ పథకంలో నెలకు రూ.1500 అంటే సంవత్సరానికి రూ.18వేలు పెట్టుబడి పెడితే.. 15 సంవత్సరాల పాటు మొత్తం రూ. 2,70,000 జమ అవుతుంది. ప్రస్తుతమున్న వడ్డీ ప్రకారం(7.1 శాతం) మీకు ఆదాయంపై రూ.2,18,185 వడ్డీ లభిస్తుంది. అంటే అసలు, వడ్డీ కలిపి దాదాపుగా రూ. 5 లక్షలు చేతికి వస్తాయి.
అదే కోటి రూపాయలు రావాలంటే: ఈ స్కీమ్‌లో కోటి రూపాయలు రాబడి రావాలంటే రోజుకు రూ.417 పొదుపు చేయాలి. అంటే నెలకు రూ.12,500. ఇలా సంవత్సరానికి రూ.లక్షా 50వేల చొప్పున 15 సంవత్సరాల పాటు డిపాజిట్ చేస్తే మీ పెట్టుబడి మొత్తం రూ.22లక్షల 50వేలు అవుతుంది. వడ్డీతో కలిపి మీకు సుమారు రూ.40లక్షల పైనే అందుతుంది. ఒకవేళ మీరు ఈ డబ్బులు తీసుకోకుండా మరో 5 సంవత్సరాల పాటు ఆ స్కీమ్‌లోనే కొనసాగితే.. అప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం 20 సంవత్సరాలకు రూ.30 లక్షలు అవుతుంది. వడ్డీతో కలిపి మీకు రూ.66లక్షల వరకు ఉంటుంది. అప్పుడు కూడా మీరు డబ్బులు తీసుకోకుండా మరో 5 ఏళ్లు పొడిగిస్తే సంవత్సరానికి రూ.లక్షా 50వేల చొప్పున 25 సంవత్సరాలకు రూ.37లక్షల 50వేలు అవుతుంది. మీకు వడ్డీతో కలిపి వచ్చే రాబడి సుమారు కోటి రూపాయల పైనే ఉంటుంది. అంటే ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పని చేసింది.
రోజుకు రూ.7 తో నెలకు రూ.5వేల పెన్షన్ - ఈ స్కీమ్ గురించి తెలుసా?

