ETV Bharat / business

నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుంది? ప్లాస్టిక్ నోట్లతో వేల కోట్లు ఆదా- తడిసినా పాడవవు, నకిలీ కరెన్సీకి చెక్!

ఎక్కువ కాలం మన్నిక ఉండేలా పాలిమర్/ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్న ఆర్బీఐ- భారీగా తగ్గనున్న నోట్ల ముద్రణ ఖర్చులు- నకిలీ నోట్లకు కూడా చెక్

Plastic Notes in India 2026
Plastic Notes in India 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : July 21, 2026 at 9:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

Plastic Notes in India 2026 : మన జేబుల్లో ఉండే కరెన్సీ నోట్లు నీటిలో తడిసిపోయి పాడైపోవడం లేదా నలిగిపోయి చిరిగిపోవడం, మురికిపట్టి చెల్లకుండా పోవడం మనం తరచుగా చూస్తుంటాం. కానీ త్వరలోనే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలో ప్లాస్టిక్/పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ప్రత్యేకమైన, అత్యంత బలమైన పాలిమర్ ఫిల్మ్‌తో ఈ నోట్లను తయారు చేయనున్నారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) రూ. 10, రూ. 20 విలువ గల నోట్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. తక్కువ విలువ కలిగిన ఈ కరెన్సీ నోట్లు ఎక్కువగా తరచుగా చేతులు మారడం వల్ల చాలా త్వరగా చిరిగిపోవడం లేదా మురికిపట్టి పాడవతుంటాయి. అందుకే మొదట ఈ నోట్లనే పాలిమర్ రూపంలో విడుదల చేసి, వాటి పనితీరును పరీక్షించాలని ఆర్బీఐ భావిస్తోంది.

ప్రస్తుతం మన దేశంలో చలామణిలో ఉన్న నోట్లను సాధారణ కాగితంతో కాకుండా 100 శాతం కాటన్ ఫైబర్‌తో (పత్తి) తయారు చేస్తున్నారు. అయితే ఇవి త్వరగా పాడవుతుండటంతో ఆర్బీఐ ఏటా సగటున 2 వేల కోట్లకుపైగా కొత్త నోట్లను ముద్రిస్తోంది. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో పాత నోట్ల స్థానంలో దాదాపు 1200 కోట్లకుపైగా కొత్త నోట్లను ప్రెస్‌లలో ముద్రించింది. ఇందుకోసం ఆర్బీఐ ఏకంగా రూ. 6373 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 2300 కోట్లకుపైగా పాడైపోయిన నోట్లను ఆర్బీఐ గుర్తించింది.

ఏ నోటు ముద్రించేందుకు ఎంత ఖర్చు?
నోటు విలువ ఆధారంగా (డినామినేషన్) ఒక్కో నోటు ముద్రణ ఖర్చు మారుతూ ఉంటుంది. ఆర్బీఐ డేటా ప్రకారం ఉదాహరణకు రూ. 10 నోటు ముద్రణకు 96 పైసలు ఖర్చవుతుంది. అదే విధంగా రూ. 20 నోటుకు 95 పైసలు, రూ. 50 విలువైన నోటుకు రూ. 1.13 ఖర్చవుతుంది. రూ. 100 నోటుకు రూ. 1.77, రూ. 200 కరెన్సీ నోటు ముద్రణకు రూ. 2.37, రూ. 500 నోటు ప్రింటింగ్‌కు రూ. 2.29 నుంచి రూ. 2.57 వరకు వెచ్చించాల్సి వస్తుంది.

ప్లాస్టిక్ నోట్ల ప్రయోజనాలేంటి?
కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నీటిలో తడిసినా, పొరపాటున ఉతికినా ఇవి పాడవవు. చిరిగిపోవడం లేదా మురికి పడటం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణ కాగితపు నోట్ల కంటే పాలిమర్ నోట్లు 3 నుంచి 4 రెట్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. దాదాపు 5-7 సంవత్సరాల వరకు ఉంటాయని చెబుతున్నారు. ప్లాస్టిక్ నోట్ల ముద్రణకు ప్రారంభంలో ప్రతి నోటుకు రూ. 2 నుంచి 6 రూపాయల వరకు ఖర్చయినప్పటికీ, ఇవి ఎక్కువ కాలం మన్నికగా ఉండటం వల్ల పదే పదే కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గుతుంది. దీని వల్ల ఆర్బీఐకి ఏటా సుమారు రూ. 6 వేల కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఇలా దీర్ఘకాలంలో కరెన్సీ నిర్వహణ వ్యయం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి.

నకిలీ నోట్లకు చెక్
పాలిమర్ నోట్లను ఆర్బీఐ అత్యాధునిక భద్రతా ఫీచర్లతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌పరెంట్ విండోస్, క్లిష్టమైన హోలోగ్రాఫిక్ డిజైన్లు, మైక్రో ప్రింటింగ్, ప్రత్యేక సిరా సాంకేతికతను ఉపయోగిస్తారు. వీటిని కాపీ కొట్టి నకిలీ నోట్లను సృష్టించడం కూడా కేటుగాళ్లకు దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దేశంలోని 4 ప్రధాన ప్రెస్‌లలో కరెన్సీ ముద్రిస్తుంది. మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్‌లోని దేవాస్, కర్ణాటకలోని మైసూర్, బెంగాల్‌లోని సాల్బోని ఇందులో ఉన్నాయి. వీటిల్లో నాసిక్, దేవాస్ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండగా, మైసూర్, సాల్బోని ప్రెస్‌లు ఆర్బీఐ అనుబంధ సంస్థ BRBNMPL నిర్వహిస్తోంది.

దాదాపు 60 దేశాల్లో వినియోగం
ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, రొమేనియా, వియత్నాం, మాల్దీవులు, పపువా న్యుగినియా, బ్రూనై, వనౌటు సహా దాదాపు 60 దేశాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఈ పాలిమర్ నోట్లను వినియోగిస్తున్నాయి. ఒమన్ కూడా ఇటీవల ఒక రియాల్ పాలిమర్ బ్యాంక్ నోట్లను ఇష్యూ చేసింది. ఇక మన దగ్గర 2012లోనే యూపీఏ హయాంలో ఈ నోట్లు తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. కొచ్చి, మైసూర్, భువనేశ్వర్, శిమ్లా, జైపూర్ నగరాల్లో 100 కోట్లకుపైగా రూ. 10 ప్లాస్టిక్ నోట్ల పైలట్ ప్రాజెక్టును యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఏటీఎం యంత్రాలు వీటిని గుర్తించడంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఇది అమల్లోకి రాలేదు.

త్వరలో పాలిమర్ నోట్లు విడుదల- 2027 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించే అవకాశం!

ఆగస్టు నుంచి కార్లపై రూ.30,000 వరకు రేట్ల పెంపు- వినియోగదారులకు మారుతి సుజుకీ షాక్