ETV Bharat / business

పర్సనల్​ లోన్​ ముందే చెల్లిస్తే "క్రెడిట్​ స్కోర్​" పెరుగుతుందా? - నిపుణుల సమాధానమిదే!

-అధిక వడ్డీ రేట్ల కారణంగా గడువు కంటే ముందే పర్సనల్​ లోన్​ చెల్లించేందుకు ముందుకొస్తున్న ప్రజలు - అయితే లోన్​ క్లోజ్​ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలని సూచన!

Personal Loan
Personal Loan (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : September 1, 2026 at 12:58 PM IST

3 Min Read
Choose ETV Bharat

Personal Loan: ప్రస్తుత రోజుల్లో వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకోవడం కామన్​ అయ్యింది. ముఖ్యంగా ఈజీగా లభించే పర్సనల్​ లోన్​ను చాలా మంది తీసుకుంటున్నారు. అయితే ఈ లోన్​ తీసుకున్నాక చేతిలో డబ్బు ఉంటే వెంటనే ఈ లోన్​ తీర్చేయాలని భావిస్తారు. ఎందుకంటే ఈ రుణాలకు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అయితే అసలు వ్యక్తిగత రుణాన్ని ముందే తీరిస్తే మంచిదేనా? ఇలా​ తీర్చడం వల్ల క్రెడిట్​ స్కోర్​ వెంటనే పెరుగుతుందా?అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండే వ్యక్తిగత రుణాల విషయంలో "ముందస్తు చెల్లింపు" ఆర్థికంగా మంచి నిర్ణయమే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల వడ్డీ భారం తగ్గడమే కాకుండా, ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల ఒత్తిడి నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందంటున్నారు.

క్రెడిట్​ స్కోర్​ పెరుగుతుందా?: రుణాన్ని తీర్చగానే క్రెడిట్‌ స్కోరు ఒక్కసారిగా పెరిగిపోతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ, వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటుందంటున్నారు. అప్పు తీర్చడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడినా, క్రెడిట్‌ స్కోరుపై దాని ప్రభావం వెంటనే కనిపించకపోవచ్చని వివరిస్తున్నారు. ఎందుకంటే క్రెడిట్‌ స్కోరు కేవలం అప్పులు లేకపోవడంపైనే ఆధారపడి ఉండదని, గతంలో మీరు అప్పులు ఎలా చెల్లించారు? ప్రస్తుతం ఎంత అప్పు ఉంది? ఎన్ని సంవత్సరాలుగా క్రెడిట్‌ కార్డు వాడుతున్నారు? మీ వద్ద ఎన్ని రకాల రుణాలు ఉన్నాయి? వంటి అనేక అంశాలను క్రెడిట్‌ బ్యూరోలు లెక్కిస్తాయని వివరిస్తున్నారు.

ఒక వ్యక్తిగత రుణాన్ని ముందే తీర్చేసినప్పుడు, క్రెడిట్‌ హిస్టరీ నుంచి ఒక లోన్​ ఖాతా తగ్గిపోతుందంటున్నారు. తక్కువ క్రెడిట్‌ చరిత్ర ఉన్నవారికి, ఉన్న ఒక్క అప్పూ తీరిపోతే.. క్రెడిట్‌ బ్యూరోల వద్ద విశ్లేషించేందుకు తగినంత సమాచారం ఉండదని, దీనివల్ల స్వల్పకాలంలో స్కోరు పెరగకుండా అలాగే ఉండటమో, లేదా కొద్దిగా తగ్గడమో జరగొచ్చంటున్నారు. రుణ సమాచారాన్ని బ్యాంకులు ప్రతి 15 రోజులకు ఒకసారి క్రెడిట్‌ బ్యూరోలకు నివేదించాలని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మార్గదర్శకాలు చెబుతున్నాయని, బ్యాంకుల అంతర్గత ప్రక్రియల వల్ల క్రెడిట్‌ నివేదికలో మార్పులు కనిపించేందుకు కొంత సమయం పట్టొచ్చంటున్నారు.

తేడాలు గమనించండి:

  • రుణాన్ని ముగించే క్రమంలో "క్లోజ్డ్‌", "సెటిల్డ్‌" అనే రెండు పదాలు చాలా కీలమైనవని, వీటి మధ్య తేడా తెలియకపోతే భవిష్యత్తులో కొత్త రుణాలు పొందడం కష్టమవుతుందంటున్నారు.
  • అసలు, వడ్డీ కలిపి బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం బాకీని పైసా వదలకుండా చెల్లిస్తే, ఆ రుణాన్ని "క్లోజ్డ్‌"గా పరిగణిస్తారని, ఇది మీ క్రెడిట్‌ రిపోర్టులో సానుకూలంగా కనిపిస్తుందంటున్నారు.
  • ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి అప్పు కట్టలేక, బ్యాంకుతో రాజీపడి కొంత మొత్తం తగ్గించుకొని, బాకీ చెల్లిస్తే, దానిని "సెటిల్డ్‌"గా నమోదు చేస్తారంటున్నారు. అంటే మీరు తీసుకున్న అప్పును పూర్తిగా తిరిగి చెల్లించలేదని దీని అర్థం. ఇలాంటి రిపోర్టు ఉంటే, భవిష్యత్తులో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చంటున్నారు.

ఇవి చూసుకోండి: రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత బాధ్యతాయుతమైన రుణగ్రహీతగా మరికొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు అవేంటంటే..

  • లోన్​ తీర్చేసిన వెంటనే బ్యాంకు నుంచి "నో డ్యూ సర్టిఫికెట్‌" లేదా "క్లోజర్‌ లెటర్‌" తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటున్నారు. అప్పు పూర్తయిందని చెప్పేందుకు ఇదే ప్రధాన ఆధారం అంటున్నారు.
  • అప్పు చెల్లించిన కొన్ని వారాల తర్వాత క్రెడిట్‌ నివేదికను వెరిఫై చేయాలని, అందులో సదరు రుణ ఖాతా "క్లోజ్డ్‌" అని ఉందో లేదో గమనించమంటున్నారు. ఒకవేళ అది ఇంకా "యాక్టివ్‌"గా ఉన్నా లేదా పొరపాటున "సెటిల్డ్‌" అని కనిపించినా వెంటనే క్రెడిట్‌ బ్యూరోకు ఫిర్యాదు చేయాలంటున్నారు.
  • కేవలం స్కోరు పెరుగుతుందన్న ఆశతో, అధిక వడ్డీ భారం మోస్తూ రుణాన్ని కొనసాగించడం సరైనది కాదని, వడ్డీ భారం తగ్గించుకోవడమే మొదటి ప్రాధాన్యం కావాలంటున్నారు.
  • రుణాన్ని తొందరగా తీరిస్తే, భారం తగ్గి, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుందని, స్కోరులో చిన్నపాటి మార్పులు సహజమే అయినా, దీర్ఘకాలంలో మీరు చూపే క్రమశిక్షణే మీ క్రెడిట్‌ స్కోరును పెంచుతుందని వివరిస్తున్నారు.

'EMI' ఆలస్యమైతే ఏమవుతుంది? - ఇలా చేస్తే క్రెడిట్ స్కోర్​పై ప్రభావం ఉండదు!

ఉద్యోగం పోయిందా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఫైనాన్షియల్​గా నో ప్రాబ్లమ్​!