ETV Bharat / business

ఒరాకిల్ ఉద్యోగుల్లో '6AM' భయం- 3వేల మందిపై వేటుకు సిద్ధం! మైక్రోసాఫ్ట్‌లోనూ నోటీసులు

భారత్‌లో 2,000- 3,000 మంది ఒరాకిల్‌ ఉద్యోగులపై వేటు? సెప్టెంబర్‌ 1న ఉదయం 6 గంటలకే లేఆఫ్స్‌ మెయిల్స్‌ వస్తాయని ఆందోళన పడ్డ ఉద్యోగులు- మైక్రోసాఫ్ట్‌ ఇండియాలో 400–500 మందికి పీఐపీ నోటీసులు

Oracle Microsoft Layoffs
ప్రతీకాత్మక చిత్రం (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : September 1, 2026 at 11:04 AM IST

3 Min Read
Choose ETV Bharat

Oracle Microsoft Layoffs : భారత్‌లో ఐటీ ఉద్యోగులకు మరోసారి లేఆఫ్స్‌ భయం వెంటాడుతోంది. ప్రముఖ టెక్‌ దిగ్గజం ఒరాకిల్‌ మరో విడత ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. భారత్‌లో దాదాపు 2,000 నుంచి 3,000 మంది ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 2026 సెప్టెంబర్‌ 1 నుంచి ఉద్యోగులకు తొలగింపు మెయిల్స్‌ పంపే అవకాశం ఉందన్న ప్రచారం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అయితే లేఆఫ్స్‌పై ఒరాకిల్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

30 వేల మందిలో 3 వేల మందిపై వేటు?
భారత్‌లో ఒరాకిల్‌కు భారీ స్థాయిలో ఉద్యోగులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సంస్థలో దాదాపు 30 వేల మంది పనిచేస్తున్నట్లు సమాచారం. వీరిలో సుమారు 2,000 నుంచి 3,000 మందిని తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంటే భారత కార్యకలాపాల్లో దాదాపు 10 శాతం వరకు ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. కంపెనీలోని వివిధ విభాగాల మేనేజర్లను తమ టీమ్‌ల్లో తొలగించగల ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. కొన్ని విభాగాల్లో ఉద్యోగుల కోత రెండంకెల శాతంలో ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఈ వార్తలపై ఒరాకిల్‌ అధికారికంగా స్పందించలేదు.

సెప్టెంబర్‌ 1- ఉద్యోగుల్లో టెన్షన్‌
ఒరాకిల్‌ ఉద్యోగుల్లో తాజాగా ఎక్కువగా చర్చ జరిగిన తేదీ సెప్టెంబర్‌ 1. ఒరాకిల్‌ ఆర్థిక సంవత్సరంలోని రెండో త్రైమాసికం (Q2 FY2027) ఈ తేదీ నుంచే ప్రారంభమవుతుంది. అదే రోజు లేఆఫ్స్‌కు సంబంధించిన మెయిల్స్‌ వచ్చే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన చెందారు. ముఖ్యంగా సెప్టెంబర్‌ 1న ఉదయం 6 గంటల ప్రాంతంలోనే ఈమెయిల్స్‌ రావచ్చన్న భయం ఉద్యోగుల్లో నెలకొంది. దీనికి గత అనుభవమే కారణం. 2026 మార్చి 31న అమెరికా, భారత్‌, కెనడా, మెక్సికోలోని వేలాది ఒరాకిల్‌ ఉద్యోగులకు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం సుమారు 6 గంటలకే తొలగింపు మెయిల్స్‌ వచ్చాయి!

కంపెనీ పేరుతో పంపిన ఆ మెయిల్స్‌లో సంస్థాగత మార్పుల్లో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు తెలియజేసినట్లు తెలుస్తోంది. చాలా మంది ఉద్యోగులకు అదే రోజు చివరి పని దినమని కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వారి సిస్టమ్‌ యాక్సెస్‌ను నిలిపివేసినట్లు ఉద్యోగులు వెల్లడించారు. దీంతో ఈసారి కూడా సెప్టెంబర్‌ 1న ఉదయం 6 గంటల సమయంలో తమ ఇన్‌బాక్స్‌లను ఉద్యోగులు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 6 గంటలకే లేఆఫ్స్‌ జరుగుతాయని ఒరాకిల్‌ అధికారికంగా ప్రకటించలేదు. ఇది గత అనుభవం ఆధారంగా ఉద్యోగుల్లో నెలకొన్న అంచనా మాత్రమే.

రెడిట్‌లోనూ లేఆఫ్స్‌పై చర్చ
ఒరాకిల్‌ ఉద్యోగుల ఆన్‌లైన్‌ కమ్యూనిటీల్లోనూ లేఆఫ్స్‌పై విస్తృతంగా చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 1న తొలగింపు జరగనప్పటికీ కొందరు సెప్టెంబర్‌ 15న లేదా ఆ తర్వాత ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు మేనేజర్ల సెలవులు, బడ్జెట్‌ కేటాయింపుల తేదీలను కూడా లేఆఫ్స్‌తో ముడిపెడుతున్నారు. అయితే వీటిలో ఏదీ కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఉద్యోగుల ఆందోళనకు మరో కారణం స్టాక్‌ ప్రయోజనాలు. ఒరాకిల్‌లో పనిచేసే పలువురు ఉద్యోగుల వేతనంలో రిస్ట్రిక్టెడ్‌ స్టాక్‌ యూనిట్లు (RSUs) కూడా కీలక భాగంగా ఉంటాయి. ఉద్యోగం కోల్పోతే వెస్ట్‌ కాని ఆర్‌ఎస్‌యూలను కోల్పోయే అవకాశం ఉండటంతో పలువురు తమ వెస్టింగ్‌ తేదీలను కూడా లెక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్‌లోనూ కలకలం
ఇదే సమయంలో మరో టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లోనూ ఉద్యోగులపై పనితీరు ఒత్తిడి పెరిగినట్లు సమాచారం. 2026లో భారత్‌లో సుమారు 400 నుంచి 500 మంది ఉద్యోగులను పెర్ఫార్మెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్లాన్‌ (PIP)లో చేర్చినట్లు మార్కెట్‌ పరిశోధనా సంస్థకు చెందిన నిపుణులు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్‌ ఇండియాలోని మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2 శాతం మందిపై ఈ ప్రక్రియ ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. అయితే ఇది నేరుగా ఉద్యోగాల తొలగింపు కాదని మైక్రోసాఫ్ట్‌ స్పష్టం చేసింది. ఉద్యోగుల పనితీరు సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టుగా లేనప్పుడు సాధారణంగా తీసుకునే చర్యల్లో భాగంగానే పీఐపీని అమలు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఉద్యోగులకు పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశమని పేర్కొంది.

లీవ్‌లో ఉంటే ఉద్యోగం పోతుందా? మెటా లేఆఫ్స్​పై సంచలన ఆరోపణలు

ఐటీ రంగంలో మళ్లీ లేఆఫ్స్ కలకలం: 4,800 ఉద్యోగాలకు ఎసరు- ఎక్స్‌బాక్స్‌పై తీవ్ర ప్రభావం!