యుద్ధం ఎఫెక్ట్- 10శాతం పెరిగిన ముడి చమురు ధర- బ్యారెల్ ధర రూ.13వేలకు చేరుతుందనే హెచ్చరికలు
హార్ముజ్ మూసివేతతో స్తంభించిన చమురు రవాణా- పెరిగిన ముడి చమురు ధరలు- ఇరాన్ vs అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగితే రేట్లు మరింత పైకి


Published : March 2, 2026 at 10:20 AM IST
Oil Prices Increase Due to War : ఇరాన్, ఇజ్రాయెల్ - అమెరికా యుద్ధం ప్రభావంతో ముడి చమురు ధరలు దాదాపు 10 శాతం పెరిగాయి. ఒక బ్యారెల్ ముడి చమురు ధర రూ.7,169 (78.52 డాలర్ల)కి చేరింది. ఈ సైనిక ఘర్షణ పరిమిత స్థాయిలోనే కొనసాగినా, త్వరలోనే బ్యారెల్ ముడి చమురు ధర రూ.9,100 - రూ.10,500 రేంజుకు పెరగొచ్చని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ సముద్ర మార్గంలో ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలకు అవాంతరం వాటిల్లే స్థాయికి సైనిక ఘర్షణ తీవ్రతరమైతే, బ్యారెల్ ముడి చమురు ధర రూ.11,000 - రూ.13,000 రేంజుకు పెరుగుతుందని అంటున్నారు. ఈ యుద్ధంలోకి మరిన్ని దేశాలు దిగి, దీర్ఘకాలం పాటు సైనిక ఘర్షణ కొనసాగే పరిస్థితులు ఏర్పడితే బ్యారెల్ ముడి చమురు రేటు రూ.14వేలు దాటే ముప్పు ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
హార్ముజ్ జలసంధి మూసివేత ఎఫెక్ట్
ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ దాడులు, ప్రతిఘటిస్తూ ఇరాన్ చేస్తున్న ఎటాక్స్‌తో మిడిల్ ఈస్ట్ ప్రాంతం అట్టుడుకుతోంది. చాలా అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైనా ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈనేపథ్యంలో ఆయా అరబ్ దేశాల నుంచి సముద్ర మార్గంలో ముడి చమురు సప్లైలకు విఘాతం కలుగుతోంది. కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ జలసంధి మీదుగా వెళ్లేందుకు యత్నించిన రెండు ముడి చమురు ట్యాంకర్లపై ఇరాన్ సైన్యం దాడి కూడా చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు సప్లై అయ్యే ముడి చమురులో 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగానే వెళ్తుంది. ఈ ఇరుకైన జలసంధి ఇరాన్ పరిధిలో ఉంది. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతర్, బహ్రయిన్, యూఏఈ దేశాల నుంచి ముడి చమురు సప్లై కోసం ఈ జలసంధి కీలకమైంది. ప్రస్తుతం హార్ముజ్ మీదుగా ఆసియా దేశాలకు ముడి చమురును అరబ్ దేశాలు రవాణా చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు ముడి చమురు ధరలు పెరిగాయి. ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ సైనిక ఘర్షణ కొనసాగినన్ని నాళ్లు క్రూడ్ ఆయిల్ రేట్లు పైపైకే వెళ్తాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ప్రజలపై పెరగనున్న భారం
గత శుక్రవారం (ఫిబ్రవరి 27) నాటికి ఒక బ్యారెల్ ముడి చమురు ధర రూ.6,121 (67 డాలర్లు) మాత్రమే ఉంది. రెండు రోజుల్లోనే అది 7.3 శాతం పెరిగి రూ.7,169కి చేరింది. ఈ పెరిగిన ధరల ప్రభావం వాహనదారులపై పడనుంది. ప్రత్యేకించి సరుకు రవాణా రంగంపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. సరుకు రవాణా ఛార్జీలు పెరిగితే, నిత్యావసరాల రేట్లు కూడా పెరిగిపోతాయి. చివరకు ఈ ధరాభారాన్ని సామాన్య ప్రజలే భరించాల్సి వస్తుంది. వెరసి, దేశంలో మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది.
రంగంలోకి ఒపెక్ కీలక ప్రకటన
ఇరాన్ సైతం ప్రతిరోజూ 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తుంటుంది. ఇందులో సింహభాగం చైనాకే చేరుతుంటుంది. ప్రస్తుతం యుద్ధంలో ఉన్నందున ఇరాన్ నుంచి చైనాకు చమురు సప్లై స్తంభించింది. ఈ పరిస్థితుల్లో చమురు అవసరాల కోసం అరబ్ దేశాల వైపు చైనా చూస్తోంది. తమకు చమురు కావాలంటూ భారీ ఆర్డర్లు ఇస్తోంది. ఈనేపథ్యంలో ముడి చమురును సప్లై చేసే ఒపెక్ కూటమిలోని 8 దేశాలు ఆదివారం రోజు (మార్చి 1న) కీలకమైన ప్రకటన చేశాయి. ప్రపంచ మార్కెట్ చమురు అవసరాలను తీర్చేందుకు తాము ఏప్రిల్ నెలలో ప్రతిరోజు 2.06 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేస్తామని వెల్లడించాయి. ఒపెక్ కూటమిలో సౌదీ అరేబియా, రష్యా, ఇరాక్, యూఏఈ, కువైట్, కజకిస్తాన్, అల్జీరియా, ఒమన్ ఉన్నాయి.
ఒపెక్ ఉత్పత్తిని పెంచనుండటం సానుకూల అంశం
‘‘ఒపెక్ దేశాలు ముడి చమురు ఉత్పత్తిని పెంచనుండటం సానుకూల అంశం. అవి ఉత్పత్తిని పెంచాక, ప్రత్యామ్నాయ మార్గాల్లో అన్ని దేశాలకు ఆయిల్‌ను సప్లై చేస్తాయి. దీనివల్ల మళ్లీ చమురు రేట్లు తగ్గిపోతాయి. ఇది ప్రజలకు ఉపశమనం కలిగించే అంశం’’ అని నార్వేకు చెందిన ఇంధన రంగ విశ్లేషకులు జార్జ్ లియోన్ పేర్కొన్నారు.
ఏ రంగాలకు లాభం ? ఏ రంగాలకు నష్టం ?
‘‘ఇరాన్ - అమెరికా సైనిక ఘర్షణ మొదలయ్యాక ముడి చమురును సప్లై చేసే ఆయిల్ ట్యాంకర్ల బీమా ప్రీమియంలను భారీగా పెంచారు. దీంతో చమురు రవాణా ఛార్జీలు చుక్కలను అంటాయి. ఇక హార్ముజ్ మీదుగా ముడి చమురు ట్యాంకర్లు రాకపోకలు సాగించే పరిస్థితి ప్రస్తుతం లేదు. దీంతో సైనిక ఘర్షణ ముగిసే వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో చమురును రవాణా చేయడంపై అరబ్ దేశాలు ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగిపోయి, రవాణా ఛార్జీలు పెరుగుతాయి. ఎలాగైనా సరే ఈ సైనిక ఘర్షణ ముగిసేదాకా రేట్లు తప్పక పెరుగుతాయి. ఒపెక్ కూటమిలోని సౌదీ అరేబియా, యూఏఈలకు ప్రతిరోజు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును సప్లై చేసే కెపాసిటీ ఉంది. ఈ దేశాలు చమురు ఉత్పత్తిని పెంచినా, సప్లై చేసే రూట్లు సురక్షితంగా ఉండటం అత్యవసరం. మొత్తం మీద ఈ ప్రభావం ముడి చమురును సప్లై చేసుకునే భారత్ లాంటి దేశాలపై ఎక్కువగా పడుతుంది. దీనివల్ల భారత్‌లోని విమానయాన రంగం, రసాయనాలు, వాహన రంగం, పెయింట్స్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయి. చాలా వస్తు ఉత్పత్తులు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. చమురు ఉత్పత్తి కంపెనీలు, రక్షణ రంగ సంస్థలు, ఐటీ కంపెనీలు ఈ పరిణామాలతో ప్రయోజనాన్ని పొందుతాయి’’ అని బ్యాంకింగ్, మార్కెట్ నిపుణుడు అజయ్ బగ్గా విశ్లేషించారు.

