ETV Bharat / business

ఈ20 పెట్రోల్ తర్వాత- డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ కలపడంపై కేంద్రం దృష్టి

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని పూర్తి చేసిన భారత్- ఇప్పుడు డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్ కలిపేందుకు సిద్ధం- కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

Isobutanol Blend In Diesel
Isobutanol Blend In Diesel (IANS (Representative Image))
author img

By ETV Bharat Telugu Team

Published : July 4, 2026 at 6:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Isobutanol Blend In Diesel : పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ (E20) మిశ్రమ లక్ష్యాన్ని నిర్దేశిత గడువు కంటే ముందుగానే విజయవంతంగా పూర్తి చేసిన భారత్ ఇప్పుడు బయోఫ్యూయెల్ రంగంలో మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని కలిపే దిశగా, దీనిని అనుమతించే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశాన్ని ఇంధన రంగంలో స్వయం సమృద్ధిగా మార్చడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం సహా కాలుష్యాన్ని నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

ఇథనాల్‌తో సాధ్యం కాదు అందుకే ఐసోబ్యూటనాల్
ప్రత్యామ్నాయ ఇంధనాల అభివృద్ధిపై ప్రభుత్వం రూపొందించిన వ్యూహాన్ని వివరిస్తూ గడ్కరీ కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలపడం కుదిరినా, డీజిల్‌లో నేరుగా ఇథనాల్‌ను కలపడం సాంకేతికంగా సాధ్యపడదని స్పష్టం చేశారు. అందుకే ఇథనాల్‌ను ఆధారంగా చేసుకొని ఐసోబ్యూటనాల్ తయారు చేస్తున్నట్లు వివరించారు. 'ఇథనాల్‌ను డీజిల్‌లో నేరుగా కలపలేం. అందుకే ఇథనాల్ నుంచి ఐసోబ్యూటనాల్‌ను తయారు చేస్తున్నాం. ఇది డీజిల్‌కు మంచి ప్రత్యామ్నాయంగా మారుతుంది' అని గడ్కరీ పేర్కొన్నారు. డీజిల్‌లో గరిష్ఠంగా 15 శాతం ఐసోబ్యూటనాల్ మిశ్రమాన్ని అనుమతించే దిశగా ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

ఇది అమల్లోకి వస్తే విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయ బయోఫ్యూయెల్ ఉత్పత్తికి ప్రోత్సాహం లభిస్తుంది. కాలుష్య ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంటుంది. రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. ఈ సరికొత్త టెక్నాలజీకి సంబంధించి ఇప్పటికే జరిపిన పైలట్ ప్రాజెక్టులు ప్రోత్సాహకరమైన ఫలితాల్ని ఇచ్చాయని కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడించారు. 100 శాతం ఇథనాల్, 100 శాతం ఐసోబ్యూటనాల్‌తో పనిచేసే రెండు జెనరేటర్ సెట్లను తాము విజయవంతంగా నడిపి చూయించామని, ఈ ఇంధనాలతో పనిచేసేలా ఇంజిన్లను సులభంగా అభివృద్ధి చేయొచ్చని ఇది నిరూపించిందని గడ్కరీ స్పష్టం చేశారు.

ఐసోబ్యూటనాల్ అంటే ఏంటి?
ఐసోబ్యూటనాల్‌ను తదుపరి తరం (నెక్ట్స్ జెనరేషన్) బయోఫ్యూయెల్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. దీని ప్రత్యేకతల విషయానికి వస్తే సాధారణ బయోఫ్యూయెల్స్‌తో పోలిస్తే అధిక శక్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఇంజిన్లకు పూర్తి అనుకూలంగా ఉండటమే కాకుండా, చాలా తక్కువ ఉద్గారాల్ని విడుదల చేస్తుంది. నిల్వ, రవాణాకు కూడా అనుకూలంగా ఉంది. డీజిల్‌కు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. దీని వాడకం వల్ల భారత ముడి చమురు దిగుమతి భారం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఇంకా దేశీయంగా రైతులు ఉత్పత్తి చేసే బయోఫ్యూయెల్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రవాణా రంగంలో ఐసోబ్యూటనాల్ కీలక ఇంధనంగా మారే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.

E20పై వస్తున్న అపోహలపై కేంద్రం క్లారిటీ
ఇథనాల్ బ్లెండింగ్‌పై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాల్ని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో తాజాగా నితిన్ గడ్కరీ ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్‌‌పై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇథనాల్ తయారీకి అధికంగా నీరు అవసరం అవుతుందని, వాహనాల ఇంజిన్లు దెబ్బతింటాయని, వాహనాల వారంటీ, ఇన్సూరెన్స్ రద్దవుతాయని, పర్యావరణానికి హాని జరుగుతుందనే ప్రచారం జరుగుతుందని పేర్కొంది. అయితే ఇవన్నీ ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేని వాదనలేనని, ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న ప్రమాణాలు, శాస్త్రీయ అధ్యయనాలు, నియంత్రణ వ్యవస్థల ఆధారంగానే అమలు చేస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది.

ఇక కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం- భారత్ 2025 డిసెంబరులోనే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ (E20) లక్ష్యాన్ని గడువు కంటే ముందుగానే సాధించింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ కార్యక్రమం ద్వారా రూ. 1.9 లక్షల కోట్లకుపైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయింది. ఇక పెట్రోల్‌లో E20 విజయవంతంగా అమలైన తర్వాత ఇప్పుడు డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యూటనాల్ మిశ్రమం అమల్లోకి వస్తే, భారత ఇంధన రంగంలో మరో పెద్ద మార్పుకు నాంది పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.

'3 నెలల తర్వాత'- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్రం కీలక ప్రకటన

బండిలో "పెట్రోల్/డీజిల్" పోయిస్తున్నారా? - బంకుల్లో నెంబర్ చూసి నాణ్యత చెప్పొచ్చు!