వడ్డీరేట్లలో మార్పుల్లేవ్- యథాతథంగా ఉంచిన రిజర్వ్ బ్యాంక్
రెపో రేటు 5.25% వద్ద కొనసాగింపు- ఎంఫీసీ నిర్ణయం- 2026-27లో వృద్ధి 6.9% అంచనా- ద్రవ్యోల్బణం 4.6% ఉండొచ్చని అంచనా- గ్లోబల్ టెన్షన్లు, చమురు ధరలపై ఆందోళన

Published : April 8, 2026 at 10:12 AM IST
RBI Interest Rate Decision : భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ పరిస్థితుల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ఈ వివరాలను వెల్లడించారు.
మానిటరీ పాలసీ కమిటీ (ఎంఫీసీ) సమావేశం ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో జరిగింది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా సమీక్షించిన తర్వాత కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఎంఫీసీ సభ్యులందరూ ఏకగ్రీవంగా రెపో రేటును 5.25 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనితో పాటు ఇతర వడ్డీ రేట్లను కూడా యథాతథంగా ఉంచినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్) రేటు 5 శాతం వద్ద కొనసాగుతుండగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) రేటు, బ్యాంక్ రేటు 5.5 శాతంగా కొనసాగుతున్నాయి.
గతంలో ఫిబ్రవరి నెలలో జరిగిన సమీక్షలో కూడా ఆర్‌బీఐ ఇదే విధమైన నిర్ణయం తీసుకుంది. అయితే, 2025 సంవత్సరంలో పలు దఫాలుగా వడ్డీ రేట్లలో కోతలు పెట్టింది. ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్‌బీఐ, జూన్‌లో 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అనంతరం డిసెంబర్‌లో మరో 25 బేసిస్ పాయింట్ల కోత విధించింది. ఈ చర్యలతో మొత్తం మీద గత ఏడాది రెపో రేటు 1.25 శాతం మేర తగ్గింది.
ప్రస్తుత నిర్ణయంపై గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సరఫరా గొలుసుల్లో అంతరాయాలు గ్లోబల్ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతుండటం ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం ఉండొచ్చని పేర్కొంది.
అయితే, ఈ సవాళ్ల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని ఆర్‌బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. గత సంక్షోభాల కాలంతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా ఉందన్నారు. గ్లోబల్ షాక్స్‌ను తట్టుకునే సామర్థ్యం ఉన్నదని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధిపై కూడా ఆర్‌బీఐ ఆశాజనక అంచనాలు వ్యక్తం చేసింది. 2026-27లో దేశ జీడీపీ వృద్ధి రేటు 6.9 శాతం వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇది గ్లోబల్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే మంచి సూచికగా భావిస్తున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులపై కూడా ఆర్‌బీఐ దృష్టి సారించింది. గ్లోబల్ అస్థిరతల కారణంగా అమెరికా డాలర్ బలపడుతుండగా, ఇతర దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొంది. దీనివల్ల ఆర్థిక మార్కెట్లలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపింది. బంగారం, లోహాల ధరలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ, ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ద్రవ్యోల్బణ భయాలు, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలతో ప్రభుత్వ బాండ్ల యీల్డ్స్ పెరుగుతున్నాయని పేర్కొంది.
దేశ ఫారెక్స్ నిల్వల విషయానికొస్తే, ఏప్రిల్ 3 నాటికి అవి 696.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఇది దేశ ఆర్థిక స్థితికి బలాన్ని ఇస్తోందని నిపుణులు భావిస్తున్నారు.మొత్తం మీద, గ్లోబల్ అనిశ్చితి పరిస్థితుల్లో ఆర్‌బీఐ జాగ్రత్త వైఖరిని అవలంబిస్తూ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినట్లు స్పష్టమవుతోంది. పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ భవిష్యత్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

