ఆగస్టు నుంచి కార్లపై రూ.30,000 వరకు రేట్ల పెంపు- వినియోగదారులకు మారుతి సుజుకీ షాక్
వినియోగదారులకు షాక్ ఇచ్చిన మారుతి సుజుకీ- ఆగస్టు నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటన- ముడి సరుకులు, ఇతర ఉత్పాదక వ్యయాలు భర్తీ చేయడానికే ఈ నిర్ణయమని వెల్లడి

Published : July 21, 2026 at 6:05 PM IST
Maruti Suzuki Cars Price Hike : ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ వినియోగదారులకు షాకిచ్చింది. ముడి సరుకులు, ఇతర ఉత్పాదక వ్యయాలు నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో వాటి భారాన్ని కొంతమేర భర్తీ చేయడానికి ఆగస్టు నుంచి తమ అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ. 30,000 వరకు పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ధరల పెంపు మోడల్‌ను బట్టి మారుతుందని స్పష్టం చేసింది. ఈ ధరల పెంపు 2026 ఆగస్టు నెల నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
మోడల్‌ను బట్టి ధరల పెంపు : మారుతి సుజుకీ
"ఉత్పాదక వ్యయాలు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా కంపెనీ అన్ని మోడళ్ల కార్ల ధరలను రూ. 30,000 వరకు పెంచాలని నిర్ణయించాం. గత కొన్ని నెలలుగా వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఖర్చుల ప్రభావాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాం. అయితే ద్రవ్యోల్బణ భారం అధిక స్థాయిలో ఉండటం, ప్రతికూల వ్యయ పరిస్థితులు కొనసాగుతుండటంతో, పెరిగిన ఖర్చుల్లో కొంత భాగాన్ని వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో వినియోగదారులపై పడే భారాన్ని సాధ్యమైనంత తక్కువగా ఉంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నాం. ధరల పెంపు మోడల్‌ను బట్టి మారుతుంది." అని మారుతి సుజుకీ పేర్కొంది.
2నెలల్లో రెండో సారి
అయితే మారుతి సుజుకీ తమ కంపెనీ కార్ల రేట్లను పెంచడం గత రెండు నెలల్లో రెండోసారి. ఈ ఏడాది జూన్‌లో తమ కార్ల రేట్లను రూ. 30,000 వరకు పెంచింది. అయితే అప్పుడు కొన్ని ఎంట్రీ లెవల్ కార్లకు ప్రైస్ ప్రొటెక్షన్ (ధరల పెంపు నుంచి మినహాయింపు) కల్పించింది. ఈ సారి అన్ని మోడళ్లపై ఆగస్టు నుంచి ధరల పెంపు ఉంటుందని ప్రకటించింది. కాగా, పశ్చిమాసియాలో మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్య మార్గాలకు, ఇంధన మార్కెట్లకు అంతరాయం కలిగించాయి. దీనివల్ల కీలకమైన ముడి పదార్థాల ధరలు పెరిగాయి. ఈ పెరిగిన వ్యయ భారాన్ని వినియోగదారులపై మోపాల్సిన అనివార్య పరిస్థితి వాహన తయారీ కంపెనీలకు ఏర్పడింది. ఈ క్రమంలో మారుతి సుజుకీ ధరల పెంపు నిర్ణయం తీసుకుంది.
మారుతి సుజుకీ ప్రస్తుతం ఎస్-ప్రెస్సో వంటి ఎంట్రీ లెవల్ మోడళ్ల నుంచి ప్రీమియం యుటిలిటీ వెహికల్ అయిన ఇన్విక్టో వరకు వివిధ మోడళ్లను అమ్ముతోంది. వీటి ధరలు రూ.3.50 లక్షల నుంచి ప్రారంభమై రూ.28.7 లక్షల వరకు ఉంటాయి. అయితే గతేడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ 2.0 నిర్ణయం కారణంగా ఆయా కార్ల ధరలు భారీగానే తగ్గాయి. ఎస్-ప్రెస్సో రూ.1.29 లక్షలు, ఆల్టో కే10పై రూ.1.07 లక్షలు, సెలిరియో రూ.94వేలు, వ్యాగనార్‌పై రూ.79 వేల చొప్పున రేట్లు తగ్గాయి. జూన్‌లో ధరల పెంపుతో వాటి ధరలు గరిష్ఠంగా రూ.30వేల వరకు పెరిగాయి. మళ్లీ ఆగస్టు నుంచి వీటి ధరలు అదనంగా మరో రూ.30 వేలు పెరగనున్నాయి.
పెరిగిన మహీంద్రా, హ్యూందాయ్, టాటా కార్ల ధరలు
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తమ ఎస్‌యూవీలు, కమర్షియల్ వెహికల్స్ ధరలను పెంచింది. పెరుగుతున్న ముడిసరుకు, నిర్వహణ వ్యయాలను కారణంగా చూపుతూ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని కార్ల మోడళ్లపై గరిష్ఠంగా 2.5 శాతం, ఇంకొన్ని మోడళ్లపై సగటున సుమారు 1.6 శాతం పెంచుతూ నిర్ణయం తీసుంది. అలాగే ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యూందాయ్ తమ కార్ల ధరలను పెంచింది. వేరియంట్‌ను బట్టి రూ.12,800 వరకు పెంచుతున్నట్లు హ్యూందాయ్ వెల్లడించింది. వినియోగదారులపై భారం మోపాలనే ఉద్దేశం సంస్థకు లేదని, మార్కెట్ ధరల ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. కియా ఇండియా కూడా తమ కార్ల రేట్లను పెంచింది. మోడల్‌ను బట్టి ధరల పెంపులో వ్యత్యాసాలుంటాయని తెలిపింది. ఇటీవలే టాటా కంపెనీ సైతం తమ వాణిజ్య వాహనాల ధరలను 2.5శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఐటీఆర్ 1 vs ఐటీఆర్ 2: ఎవరు ఏది ఫైల్ చేయాలి? - ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఏమవుతుంది?
పీఎఫ్ ఖాతాకు "నామినీ" యాడ్ చేశారా? - లేదంటే ప్రయోజనాలు నష్టపోతారు!

