సొంతింటి కోసం 'PF డబ్బులు' - లాభమా? నష్టమా?
PF డబ్బుతో ఇంటి కొనుగోలు/నిర్మాణం - ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 1:27 PM IST
PF Withdrawal for Home Purchase : ఇల్లు కొనుగోలు చేయాలన్నా, నిర్మించాలన్నా పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయి. ఈ క్రమంలోనే ఎక్కువ మంది బ్యాంకుల నుంచి హోమ్ లోన్స్ తీసుకుంటుంటారు. మరికొందరు మాత్రం వడ్డీ రేటు ఎక్కువ, దీర్ఘకాలం చెల్లించాల్సి ఉంటుందని భావిస్తారు. దాంతో పీఎఫ్ ఖాతా ఉన్న చాలా మంది దాని నుంచి రుణం తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇల్లు కొనడానికి లేదా నిర్మించడానికి, లేదా ఇంటి డౌన్ పేమెంట్ కోసం తీసుకున్న లోన్‌ను తిరిగి కట్టడానికి EPF అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవడానికి అనుమతి ఉంది. అయితే, హౌసింగ్ లోన్ డౌన్ పేమెంట్ కోసం PF నుంచి డబ్బు తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుందా? అవ్వదా? అనే విషయాన్ని పీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఇంటి కోసం పీఎఫ్ బ్యాలెన్స్ ఉపయోగించడం మంచిదో కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరైనా ఉద్యోగి ఇల్లు కొనడానికి లేదా స్థలంపై ఇల్లు నిర్మించడానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ స్కీం, 1952(EPF పథకం)లోని సెక్షన్ 68B ప్రకారం, నిర్దిష్ట షరతులకు లోబడి తన EPF అకౌంట్లోని బ్యాలెన్స్‌ను తీసుకోవచ్చు. ఇంటి కొనుగోలుకు పీఎఫ్ డబ్బులు ఉపయోగిస్తున్నట్లయితే, మీ PF నిల్వలో 90 శాతాన్ని తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.
'రుణమో రామచంద్రా!' - లోన్లు ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారో తెలుసా?
ఇల్లు మీ పేరు మీద, మీ జీవిత భాగస్వామి పేరు మీద లేదా ఉమ్మడి యాజమాన్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు హోమ్ లోన్ కోసం ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చంటున్నారు. హోమ్ లోన్ కోసం పీఎఫ్ డబ్బును విడతల వారీగా తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే, ఆరు నెలల్లోపు ఇంటి నిర్మాణం కంప్లీట్ అవ్వాలి. గృహ నిర్మాణం కోసం పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేయడంలో లాభ, నష్టాలు లేకపోలేదని సూచిస్తున్నారు. వీటిని తెలుసుకోవడం ద్వారా మీరు మెరుగైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చంటున్నారు.
బెనిఫిట్స్ :
ఉదాహరణకు, మీ PF పొదుపును ఉపయోగించడం ద్వారా మీ లోన్ మొత్తాన్ని లేదా నెలవారీ EMIలను తగ్గించుకోవడానికి నిధులు తీసుకోవచ్చు. పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలలో ఇది ఒకటి. మీరు త్వరగా ఇల్లు కొనడానికి, మీ ఫ్యామిలీకి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కల్పించడానికి కూడా ఈ నిర్ణయం సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
మీరు ఇంటికి సంబంధించిన దానిలో ఇన్వెస్ట్ చేయడానికి మీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఉపయోగిస్తున్నందున, ఇది మీకు ఆస్తులను, భద్రతను సృష్టించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. PF మొత్తంపై పొందే రాబడితో పోలిస్తే ఆస్తి ధరల్లో పెరుగుదల శాతం అధికంగా ఉంటే, ఈ విత్‌డ్రా నిర్ణయం లాభదాయకమే అని చెప్పవచ్చంటున్నారు. అన్నిటికన్నా, PFలో ఉండేది మీ డబ్బే కాబట్టి, దాని విత్‌డ్రాకు ఎలాంటి రుసుములు/వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని గుర్తుంచుకోవాలి.
నష్టాలు :
మీ PF అకౌంట్ నుంచి ముందుగానే డబ్బు తీసుకోవడం వల్ల మీ పదవీ విరమణ నిధి తగ్గిపోతుంది, చక్రవడ్డీ కోల్పోతారంటున్నారు నిపుణులు. మీరు తీసుకునే టైమ్‌ను బట్టి, TDS వంటి పన్ను కోతలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా, PF నుంచి డబ్బు తీసుకోవడానికి నిర్దిష్ట నియమాలు/పరిమితులు ఉన్నందున, అవి ప్రతి రుణగ్రహీతకు సరిపోకపోవచ్చని చెబుతున్నారు. మీ రిటైర్మెంట్ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ మీకు భద్రతను అందిస్తుంది. అందుకే, దాన్ని ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఉంచి, దాని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆస్వాదించడం ఉత్తమం. సరైన నిర్ణయం తీసుకోవడానికి, మీరు ఒక ఆర్థిక సలహాదారు నుంచి సలహాను పొందడం మంచిదని సూచిస్తున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాలు :
ప్రస్తుతం EPF మీకు పన్ను రహిత వడ్డీ(8.25%)ని అందిస్తుంది. ఇది ప్రస్తుతమున్న ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేటు(సుమారు 8%) కంటే ఎక్కువ. మీ పీఎఫ్(పదవీ విరమణ పొదుపు)ను తాకకుండా మీ హోమ్ లోన్ డౌన్ పేమెంట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే, అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని సూచిస్తున్నారు నిపుణులు.
ఉదాహరణకు, మీరు ఈ PF విత్‌డ్రా ప్రత్యామ్నాయాలను ఫాలో అవ్వవచ్చు. ఎఫ్డీ లేదా మ్యూచువల్ ఫండ్ల లోన్స్‌పై తక్కువ వడ్డీ రేట్లు ఉంటాయి. కాబట్టి, వీటిపై లోన్ కానీ, ఖాతాలను ఉపసంహరించుకుని కానీ, ఇంటి కొనుగోలుకు ఉపయోగించవచ్చంటున్నారు. కానీ, దీన్ని ఒక వ్యూహంగా కాకుండా, కేవలం ఒక ఆప్షన్‌గా మాత్రమే పరిగణించాలని సూచిస్తున్నారు. మరోవైపు, ఎఫ్డీలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) వంటి ఇతర పెట్టుబడి మార్గాలతో పోలిస్తే EPF రాబడి ఎక్కువగా ఉన్నట్లయితే, డౌన్ పేమెంట్ కోసం ఇతర మార్గాల ద్వారా నిధులను సమకూర్చుకోవడం బెటర్ అంటున్నారు.
చివరిగా :
ఇంటి కొనుగోలు కోసం PF విత్‌డ్రా నిధులను సమకూర్చుకోవడానికి ఒక శీఘ్ర మార్గం అయినప్పటికీ, దీన్ని చాలా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని చెబుతున్నారు నిపుణులు. అందుకే, డౌన్ పేమెంట్ వంటి అవసరాల కోసం ఇతర ఆర్థిక వనరుల లభ్యతను పరిశీలించిన తర్వాతే పీఎఫ్ నుంచి డబ్బు తీసుకోవడాన్ని ఆఖరి ప్రత్యామ్నాయంగా పరిగణించడం మంచిదని సూచిస్తున్నారు.
బంగారం క్వాలిటీ మీరే స్వయంగా తెలుసుకోవచ్చు! - 'గోల్డ్ యాప్' వచ్చేసింది!
యువత పెళ్లికి భయపడడానికి కారణాలివే! - సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!

