ETV Bharat / business

భారత ఆర్థిక వ్యవస్థ జోరు- ఇంకా బలమైన వృద్ధిని కొనసాగించే అవకాశం: ఆర్​బీఐ రిపోర్ట్​

ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక (FSR)లోని కీలక అంశాలు ఇవే!

RBI Governor Sanjay Malhotra
RBI Governor Sanjay Malhotra (RBI)
author img

By ETV Bharat Telugu Team

Published : December 31, 2025 at 4:21 PM IST

3 Min Read
Choose ETV Bharat

RBI Report On Indian Economy : "అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిర, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని, బలమైన దేశీయ వినియోగం, పెట్టుబడుల ఆధారంగా భారత ఆర్థిక వ్యవస్థ అత్యధిక వృద్ధిని నమోదు చేస్తుందని ఆర్​బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా స్పష్టం చేశారు. బుధవారం విడుదలైన ఆర్​బీఐ 'ఆర్థిక స్థిరత్వ నివేదిక' (ఎఫ్​ఎస్​ఆర్​) తాజా సంచికకు రాసిన ముందుమాటలో మల్హోత్రా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్థిక స్థిరత్వమే ప్రధాన లక్ష్యం
'ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడమే మా ప్రధాన లక్ష్యం. అయితే ఆర్థిక స్థిరత్వం మాత్రమే మా అంతిమ లక్ష్యం కాదు. ఆవిష్కరణలను, వృద్ధిని ప్రోత్సహించడం, నియంత్రణ, పర్యవేక్షణలో ఆచరణాత్మక విధానాలను అవలంభించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం కూడా చాలా ముఖ్యం' అని ఆర్​బీఐ గవర్నర్ పేర్కొన్నారు.

'ఆర్థిక వ్యవస్థను షాక్​లకు తట్టుకునేలా చేయాలి. ఆర్థిక సేవలను సమర్థవంతంగా అందించాలి. బాధ్యతాయుతమైన ఆవిష్కరణలను ప్రోత్సహించేలా చేయాలి. ఇవన్నీ విధాన నిర్ణేతలుగా మేము చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పనులు' అని మల్హోత్రా అన్నారు. 'ప్రస్తుతం దేశం ఆర్థిక వృద్ధి పటిష్టంగా ఉంది. ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలో ఉంది. ఆర్థిక, ఆర్థికేతర సంస్థలు హెల్దీ బ్యాలెన్స్ షీట్లును మెయింటైన్ చేస్తున్నాయి. వివేకవంతమైన విధాన సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంది' అని ఆయన పునరుద్ఘాటించారు. ఏది ఏమైనప్పటికీ బాహ్య ప్రభావాల వల్ల స్వల్పకాలిక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కానీ వాటిని తట్టుకుని దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి బలమైన రక్షణ కవచాలను నిర్మించడం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆర్​బీఐ నివేదికలో ఏముంది?
ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ అనిశ్చితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ తన పటిష్టమైన వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) తెలిపింది. బలమైన దేశీయ డిమాండ్​కు తోడు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, సమర్థవంతమైన స్థూల ఆర్థిక విధానాలే ఇందుకు కారణమని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలోని షెడ్యూల్డ్​ కమర్షియల్ బ్యాంకులు అత్యంత పటిష్టంగా ఉన్నాయని ఆర్​బీఐ తన నివేదికలో పేర్కొంది. మెరుగైన ఆస్తుల నాణ్యత, తగినంత మూలధన నిల్వలు, లాభదాయకతతో బ్యాంకుల ఆర్థిక స్థితులు ఆశాజనంగా ఉన్నాయని తెలిపింది. బలమైన బ్యాలెన్స్​ షీట్లు, సరళమైన ఆర్థిక పరిస్థితులకు తోడు, మార్కెట్​లో అస్థిరత తక్కువగా ఉండడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకొని నిలబడగలుగుతోందని స్పష్టం చేసింది.

'మ్యాక్రో స్ట్రెస్​ టెస్ట్'​లో పాస్​
తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాంకులు నష్టాలను తట్టుకుని, నిర్దేశిత కనీస మూలధనాన్ని కొనసాగించగలవని, 'మ్యాక్రో స్ట్రెస్​ టెస్ట్'​లో తేలిందని ఆర్​బీఐ రిపోర్ట్ తేల్చి చెప్పింది. మ్యూచువల్ ఫండ్స్​, క్లియరింగ్​ కార్పొరేషన్​లు కూడా పటిష్టంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది. ఇక నాన్​-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC) మెరుగైన లాభదాయకతతో బలంగా ఉన్నాయని వెల్లడించింది. బీమారంగం కూడా అవసరమైన 'సాల్వెన్సీ రేషియో' కలిగి, స్థిరంగా ఉన్నాయంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఉద్రిక్తతులు, అంతర్జాతీయ వాణిజ్యపరమైన అనిశ్చితుల వల్ల స్వల్పకాలిక ముప్పులు పొంచి ఉన్నాయని ఆర్​బీఐ హెచ్చరించింది.

కీలక వడ్డీ రేట్లు తగ్గింపు : ఆర్​బీఐ డిసెంబర్​ 5వ తేదీన కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపననిచ్చేందుకు రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రికార్డు స్థాయి కనిష్ట ద్రవ్యోల్బణం, రూపాయి క్షీణత నేపథ్యంలో రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గించిన రెపోరేటు తక్షణమే అమలులోకి వచ్చింది. తాజా తగ్గింపుతో రెపో రేటు 5.25 శాతానికి చేరింది.