ETV Bharat / business

బుధవారం నుంచే భారత్​- యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు- దేశీయ మార్కెట్లకు, ఐటీ రంగానికి కొత్త ఊపు

ఈ ఒప్పందంతో భారతీయ వినియోగదారులకు భారీ ఉపశమనం- ఆటోమొబైల్ రంగాలకు సరికొత్త అడుగు- ఐటీ దిగ్గజాలకు భారీ ప్రయోజనం

UK PM Keir Starmer with PM Modi File Photo
UK PM Keir Starmer with PM Modi File Photo (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : July 14, 2026 at 3:24 PM IST

4 Min Read
Choose ETV Bharat

India UK Trade Deal : భారత్‌, యూకే మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బుధవారం నుంచే అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్‌కు భారత్‌ చేసే ఎగుమతుల్లో 99 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. బ్రిటిష్ వస్తువులకు ఒకటి నుంచి పదేళ్లలో దశల వారీగా సుంకాల మినహాయింపు లభించనుంది. ఫలితంగా దేశీయ మార్కెట్లకు, ఐటీ రంగానికి కొత్త ఊపు రానుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌-యూకే ఒప్పందం అమలు దేశీయ పారిశ్రామిక రంగానికి కొత్త శక్తిని ఇవ్వనుంది. ఈ ఒప్పందం వల్ల ఎక్కువ శ్రామికులు ఉండే రంగాలైన వస్త్రాలు, పాదరక్షలు, కార్పెట్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, మసాలా దినుసులు, మాంసం, సముద్ర ఆహార ఉత్పత్తులపై బ్రిటన్ ప్రభుత్వం సుంకాలు పూర్తిగా ఎత్తివేసింది. ప్రస్తుతం ఈ వస్తువుల దిగుమతులపై బ్రిటన్‌లో 4 నుంచి 16 శాతం వరకు కస్టమ్స్ సుంకాలు విధిస్తుండగా జులై 15 నుంచి ఇవన్నీ జీరో డ్యూటీతో బ్రిటన్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. తద్వారా భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గి అక్కడ డిమాండ్ విపరీతంగా పెరగనుంది. ఇవేకాకుండా ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, విడిభాగాలు, మెషినరీ, ఎలక్ట్రానిక్స్, సిరామిక్స్, గ్లాస్, సిమెంట్ పరిశ్రమలకు కూడా ఈ ఒప్పందం ద్వారా భారీ లబ్ధి చేకూరనుంది.

భారతీయ వినియోగదారులకు భారీ ఉపశమనం
భారత్‌- యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కేవలం ఎగుమతిదారులకే కాకుండా భారతీయ వినియోగదారులకు కూడా భారీ ఉపశమనం కలిగించనుంది. బ్రిటన్ నుంచి భారత్‌కు దిగుమతయ్యే ప్రీమియం వస్తువుల ధరలు దశల వారీగా గణనీయంగా తగ్గిపోనున్నాయి. ముఖ్యంగా బ్రిటీష్ సాల్మన్ చేపలు, గొర్రె మాంసం, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, కాస్మెటిక్స్, లగ్జరీ సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, షేవింగ్ క్రీమ్‌లు, నెయిల్ పాలిష్‌ వంటి వస్తువుల ధరలు అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్ నుంచి దిగుమతయ్యే వెండిపై సుంకాన్ని రానున్న 10 ఏళ్లలో పూర్తిగా సున్నా శాతానికి తగ్గించేందుకు భారత్ అంగీకరించింది.

ఆటోమొబైల్ రంగం చరిత్రలోనే మొదటిసారిగా
భారత ఆటోమొబైల్ రంగం చరిత్రలోనే మొదటిసారిగా బ్రిటన్ నుంచి పూర్తిగా తయారై వచ్చేకార్లు, ట్రక్కుల దిగుమతి సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ప్రస్తుతం ఉన్న 110 శాతంగా ఉన్న కార్ల దిగుమతి సుంకం విడతల వారీగా కేవలం 10 శాతానికి తగ్గించనున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల్నిరక్షించేందుకు భారత్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి దిగుమతయ్యే పెట్రోల్, డీజిల్ వాహనాలకు మొదటి ఏడాది నుంచే రాయితీలు లభిస్తుండగా బ్రిటన్ ఈవీ,హైబ్రిడ్, హైడ్రోజన్ కార్లకు ఆరో సంవత్సరం నుంచి మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయి. దీనివల్ల దేశీయ ఈవీ కంపెనీలకు 5 ఏళ్ల పాటు మార్కెట్ రక్షణ లభిస్తుంది. మొదటి 15 ఏళ్లలో రూ.3.78 లక్షల సంప్రదాయ ఇంజిన్ కార్ల దిగుమతికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. దిగుమతి సుంకం తగ్గడంతో టాటా సంస్థ తమ జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల ధరలను రూ.70 లక్షల నుంచి రూ.1.06 కోట్ల వరకూ తగ్గించింది. అలాగే బ్రిటన్ ట్రక్కులపై ఉన్న 44% సుంకం 5 ఏళ్లలో 8.8 శాతానికి తగ్గుతుంది. ప్రతిగా, బ్రిటన్ కూడా భారతీయ ఈవీ, హైబ్రిడ్ కార్లకు వార్షిక కోటా పరిధిలో పూర్తిగా సుంకం లేని ప్రవేశాన్ని కల్పించింది. దీనివల్ల భారత వాహనాలకు బ్రిటన్ మార్కెట్లో 10 శాతం ధరల ప్రయోజనం లభిస్తుంది.

ఆ కంపెనీలకు భారీ ప్రయోజనం
బ్రిటన్ నుంచి భారత్‌కు దిగుమతయ్యే ప్రీమియం మద్యం రకాలైన స్కాచ్ విస్కీ, బ్రాందీ, బోర్బన్, రమ్, జిన్, వోడ్కా, టెకిలాపై ప్రస్తుతం ఉన్న 150 శాతం సుంకం, మొదటి ఏడాది 110 శాతానికి, పదో సంవత్సరానికి 75 శాతానికి తగ్గుతుంది. అయితే ఇది కేవలం లీటరుకు 5 డాలర్లు కనీస దిగుమతి ధర ఉండే ప్రీమియం బ్రాండ్లకు మాత్రమే వర్తిస్తుంది. స్కాచ్ విస్కీపై సుంకం 150 శాతం నుంచి విడతల వారీగా 40 శాతానికి దిగిరానుంది. ఈ ఒప్పందం ద్వారా భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ప్రకారం భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులను తాత్కాలికంగా గరిష్ఠంగా 5 ఏళ్ల వరకు బ్రిటన్ బ్రాంచ్‌లకు పంపినప్పుడు, వారి తరఫున బ్రిటన్‌లో ఎలాంటి సామాజిక భద్రతా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆ వస్తువులకు మాత్రమే పన్నుమినహాయింపులు
భారత్‌లోని కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన రవాణా, గ్రీన్ ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో దాదాపు 40 వేల హైవాల్యూ ప్రభుత్వ కాంట్రాక్టుల టెండర్లలో పాల్గొనేందుకు బ్రిటన్ కంపెనీలకు భారత్ మొదటిసారి అవకాశం కల్పించింది. చైనా వంటి మూడో దేశాలు తమ వస్తువులను భారత్ లేదా బ్రిటన్ మార్గాల ద్వారా దొంగచాటుగా మార్కెట్లోకి పంపి లాభపడకుండా కఠిన నిబంధనలు రూపొందించారు. కేవలం భారత్ లేదా బ్రిటన్లలోనే వాస్తవంగా తయారైన లేదా ప్రాసెస్ చేసిన వస్తువులకు మాత్రమే పన్నుమినహాయింపులు వర్తిస్తాయి. అయితే భారత్ రైతుల రక్షణ కోసం ఆపిల్స్, వాల్‌నట్స్, బ్లూ-వీన్డ్ చీజ్, స్మార్ట్‌ఫోన్లు, బంగారం బిస్కెట్లపై ఎలాంటి పన్నులు తగ్గించడంలేదు. బ్రిటన్ కూడా బియ్యం, చక్కెర, మాంసం, గుడ్ల ఉత్పత్తులను సుంకాల తగ్గించడం లేదు.

2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్-బ్రిటన్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 8.62 శాతం వృద్ధితో 25.12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే బ్రిటన్ నుంచి వచ్చే ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు (FDI) కూడా 1 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో జులై 15 నుంచి అమల్లోకి రానున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. రానున్న రోజుల్లో భారత ఎగుమతులకు సరికొత్త గమ్యస్థానంగా బ్రిటన్‌ను మార్చనుంది.

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు- జులై 14న తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన ఫుడ్ పాడైపోయిందా? ఎక్స్పైర్ అయిపోయిందా? కంప్లైంట్ చేసేయండిలా!