ETV Bharat / business

రష్యా నుంచి భారత్​కు- రూ.15లక్షల కోట్ల విలువైన చమురు దిగుమతులు: CREA

ఉక్రెయిన్​ యుద్ధం ప్రారంభమైన తరువాత- రష్యా నుంచి భారీగా పెరిగిన భారత్​ చమురు దిగుమతులు

India Oil Imports From Russia
India Oil Imports From Russia (Eenadu)
author img

By ETV Bharat Telugu Team

Published : January 7, 2026 at 3:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

India Oil Imports From Russia : రష్యా నుంచి భారత్​ చేసుకుంటున్న చమురు దిగుమతుల గురించి ఐరోపాకు చెందిన ప్రముఖ థింక్ ట్యాంక్​ 'సెంటర్​ ఫర్ రీసెర్చ్ ఆన్​ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్​' (CREA) తాజాగా వెల్లడించింది. ఉక్రెయిన్​పై రష్యా దాడి ప్రారంభించిన నాటి నుంచి భారత్​ సుమారు 144 బిలియన్ యూరోలు (రూ.15 లక్షల కోట్లు) విలువైన ముడి చమురును దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. అంతేకాదు 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా చమురు విక్రయాల ద్వారా రష్యా దాదాపు 1 ట్రిలియన్ యూరోల ఆదాయాన్ని ఆర్జించినట్లు ఆ సంస్థ అంచనా వేసింది.

రెండో స్థానంలో భారత్​
సీఆర్​ఈఏ నివేదిక ప్రకారం, రష్యా నుంచి చమురు కనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్​ రెండో స్థానంలో ఉంది. ఉక్రెయిన్​ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 2026 జనవరి 3 వరకు చైనా మొత్తంగా 293.7 బిలియన్​ యూరోల విలువైన శిలాజ ఇంధనాలను రష్యా నుంచి కొనుగోలు చేసింది. ఇందులో 21.3 బిలియన్ యూరోల చమురు, 42.7 బిలియన్ యూరోల బొగ్గు, 40.6 బిలియన్ యూరోల విలువైన గ్యాస్​ ఉంది. భారతదేశం 162.5 బిలియన్ యూరోల విలువైన ఇంధనాలకు కొనుగోలు చేసింది. అందులో 143.88 బిలియన్ యూరోల చమురు, 18.18 బిలియన్ యూరోల విలువైన బొగ్గు ఉన్నాయి. ఇక యూరోపియన్ యూనియన్​ (ఈయూ) మొత్తం 21.81 బిలియన్ యూరోల విలువైన శిలాజ ఇంధనాలను కొనుగోలు చేసింది. అందులో చమురు (106.3 బిలియన్ యూరోలు), గ్యాస్​ (108.2 బిలియన్ యూరోలు), బొగ్గు (3.5 బిలియన్ యూరోలు) ఉన్నాయి.

యుద్ధానికి నిధులు అలా వస్తున్యాయ్​!
"2026 జనవరి నాటికి రష్యా శిలాజ ఇంధనాల అమ్మకం ద్వారా ఏకంగా 1 ట్రిలియన్​ యూరోలను సంపాదించింది. ఈ ఆదాయం ఉక్రెయిన్​తో చేస్తున్న యుద్ధానికి నిధులుగా మారుతోంది" అని సీఆర్​ఈఏ పేర్కొంది.

ఆంక్షలు ఉన్నా డోంట్ కేర్​!
ఉక్రెయిన్​తో యుద్ధం ప్రారంభమయ్యాక, రష్యాపై అమెరికా, బ్రిటన్​, కెనడా, జపాన్​ మొదలైన జీ7 దేశాలు, ఈయూ కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా చేసినవి కావు. దీనితో చైనా, భారత్​, ఇరాన్​, యూఏఈ, సౌదీ అరేబియా మొదలైన దేశాలు రష్యా నుంచి చమురును, ఇతర శిలాజ ఇంధనాలను కొనుగోలు చేస్తున్నాయి. అంతేకాదు నాటో సభ్య దేశమైన టర్కీ, ఈయూకు చెందిన సెర్బియా కూడా అమెరికా తదితర దేశాలు పెట్టిన ఆంక్షలను అమలు చేయడానికి నిరాకరించాయి.

దిగుమతులు తగ్గించిన భారత్​
గతంలో భారత్​ తన ముడి చమురు అవసరాల కోసం ఎక్కువగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ ఉక్రెయిన్​తో యుద్ధం మొదలయ్యాక రష్యా చాలా తక్కువ ధరకే చమురు ఎగుమతి చేస్తామని ఆఫర్ ఇచ్చింది. దీనితో భారత్​ తన దిగుమతులను 1 శాతం నుంచి ఏకంగా 40 శాతానికి పెంచింది. అయితే 2025 నవంబర్​ 22న రష్యా చమురు సంస్థలైన రోస్నెఫ్ట్​, లుకోయిల్​పై అమెరికా ఆంక్షలు విధించడంతో, భారత్​ తప్పని పరిస్థితుల్లో తన దిగుమతులను తగ్గించుకుంది. ప్రస్తుతం భారత్ చమురు​ కొనుగోళ్లలో రష్యా వాటా 25 శాతానికి పడిపోయింది. ప్రధానంగా యూరోప్​కు చమురును ఎగుమతి చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్​ తప్పనిసరి పరిస్థితుల్లో రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసింది. వాస్తవానికి 2023 జులై నాటికి 189.07 మిలియన్ యూరోల ఉన్న భారత్​ చమురు దిగుమతులు, 2026 నాటికి 72.92 మిలియన్ యూరోలకు తగ్గిపోయాయి.

అమెరికా ఆంక్షల ఎఫెక్ట్​
అమెరికా ఆంక్షల నేపథ్యంలో రిలయన్స్​, హిందూస్థాన్ పెట్రోలియం (హెచ్​పీసీఎల్​), మంగళూరు రిఫైనరీ (ఎంఆర్​పీఎల్​) లాంటి సంస్థలు రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేశాయి. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్) లాంటి సంస్థలు ఆంక్షలు లేని రష్యా సంస్థల నుంచి ఇంకా చమురు కొనుగోళ్లు చేస్తున్నాయి. రష్యా సపోర్ట్ ఉన్న నయారా ఎనర్జీ మాత్రం ఇంకా గణనీయమైన స్థాయిలో చమురు దిగుమతులు చేసుకుంటోంది.

నోట్​ : 2026 జనవరి 7 నాటికి ఒక యూరో = 105.09 రూపాయలు. దీని ఆధారంగా యూరోలను భారత్​ కరెన్సీలోకి మార్చుకోవాలి.

వెండికి హాల్​మార్కింగ్​-​ త్వరలో తప్పనిసరి చేసే ఛాన్స్​!

అమెరికా-వెనెజువెలా ఉద్రిక్తతలు - భారత చమురు దిగుమతులపై ప్రభావమెంత?