ETV Bharat / business

రష్యాకు పెట్రోల్ సరఫరా చేసే కీలక దేశంగా భారత్​- ఆగస్టులో రికార్డు స్థాయి ఎగుమతులు

ఆగస్టులో రికార్డు స్థాయిలో 1,25,000 బ్యారెళ్ల రష్యా సముద్ర మార్గ గ్యాసోలిన్ దిగుమతులు- ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతినడంతో ఇంధన కొరత

India Supplying Gasoline to Russia
ప్రతీకాత్మక చిత్రం ((IANS))
author img

By ETV Bharat Telugu Team

Published : August 30, 2026 at 1:28 PM IST

3 Min Read
Choose ETV Bharat

India Supplying Gasoline to Russia : రష్యాకు గ్యాసోలిన్ (పెట్రోల్) సరఫరా చేసే కీలక దేశంగా భారతదేశం అవతరించింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు (రిఫైనరీలు) తీవ్రంగా దెబ్బతినడంతో ఆ దేశంలో ఇంధన కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత్ కీలక దేశంగా మారిందని​ షిప్ ట్రాకింగ్ డేటాలో వెల్లడైంది. ఎనర్జీ అనలిటిక్స్ సంస్థ 'వోర్టెక్సా' అందించిన వివరాల ప్రకారం ఆగస్టు నెలలో రష్యా సముద్ర మార్గ గ్యాసోలిన్ దిగుమతులు రోజుకు రికార్డు స్థాయిలో 1,25,000 బ్యారెళ్లకు చేరాయి. రష్యా ఇంధన మౌలిక సదుపాయాలపై నిరంతరం జరుగుతున్న దాడుల వల్ల అక్కడి దేశీయ ఇంధన ఉత్పత్తి ఏకంగా 70 శాతం వరకు పడిపోవడమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది.

గడిచిన రెండు నెలల్లో భారతీయ రిఫైనరీలు రష్యాకు సుమారు 10 లక్షల (1 మిలియన్) బ్యారెళ్ల పెట్రోల్‌ను సరఫరా చేసినట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఈ ఇంధన సరఫరా మొత్తం గుజరాత్‌లోని వడినార్ రిఫైనరీ నుంచి జరిగింది. దీనిని నయారా ఎనర్జీ నిర్వహిస్తోండగా, ఇందులో రష్యాకు చెందిన రోస్నెఫ్ట్‌కు సగం వాటా ఉంది. ఇది దేశ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా వాటాను కలిగి ఉంది.

కాగా, 2022 నుంచి భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల జూన్, జూలై నెలల్లో రష్యా నుంచి భారత్ రోజుకు రికార్డు స్థాయిలో 26 లక్షల బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది ఫిబ్రవరి నాటి (10 లక్షల బ్యారెళ్లు) సరఫరాతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రస్తుతం రష్యాకు ఎగుమతి చేసిన ఇంధనం రష్యా ముడి చమురు నుంచే తయారై ఉండవచ్చని భావిస్తున్నారు.

రష్యాకు ఆగస్టులో అందిన గ్యాసోలిన్ దిగుమతుల్లో సుమారు 55 శాతం (2,60,000 టన్నులు) అంతర్జాతీయ ఆంక్షల పరిధిలో ఉన్న నౌకల ద్వారానే జరిగాయని వోర్టెక్సా పేర్కొంది. భారత్ నుంచి వెళ్లిన పెట్రోల్ కార్గోలు అన్నీ ఆంక్షల పరిధిలోని నౌకల ద్వారా, మధ్యధరా సముద్రంలో అత్యంత రహస్యంగా 'డార్క్ షిప్-టు-షిప్ (STS)' బదిలీ పద్ధతిలో జరిగాయని తెలిపింది. ఇందులో పాల్గొన్న నౌకలు తమ గుర్తింపును దాచడానికి 'ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)' సిగ్నల్స్‌ను కూడా నిలిపివేసి ప్రయాణించాయి. మొత్తంగా, రష్యా ఆగస్టు గ్యాసోలిన్ దిగుమతుల్లో సుమారు 40 శాతం షిప్-టు-షిప్ బదిలీల ద్వారానే జరిగాయని చెప్పింది.

ఆగస్టు 25తో ముగిసిన ఆగస్టు నెలలో రష్యా సముద్ర మార్గ డీజిల్/ గ్యాసోయిల్ ఎగుమతులు రోజుకు సుమారు 150,000 బ్యారెళ్లుగా ఉన్నాయి. ఇది నెలవారీగా స్థిరంగా ఉన్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే రోజుకు 610,000 బ్యారెళ్లు తక్కువగా ఉందని వోర్టెక్సా తెలిపింది. ఐదేళ్ల కాలానుగుణ సగటు కంటే 81 శాతం తక్కువగా ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే సమీప భవిష్యత్తులో రష్యా కొంత గ్యాసోలిన్‌ను దిగుమతి చేసుకోవడం కొనసాగించే అవకాశం ఉందని అంచనా వేసింది.

అతిపెద్ద ముడి చమురు ఎగుమతిదారుల్లో ఒకటైన రష్యా, తన ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా దేశీయ ఉత్పత్తి 70 శాతం వరకు పడిపోవడంతో గ్యాసోలిన్‌ను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇది ఇంధన సరఫరా కొరతను సృష్టించింది. రష్యా తన దేశీయ మార్కెట్లో ఇంధన కొరతను నివారించడానికి పెట్రోల్ ఎగుమతులపై పూర్తి నిషేధాన్ని 2027 జనవరి చివరి వరకు పొడిగించింది. అలాగే డీజిల్ ఎగుమతులపై నిషేధాన్ని 2026 సెప్టెంబర్ 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై, ఆగస్టు నెలల్లో రష్యా రిఫైనరీలపై 32 దాడులు జరిగాయని, అంటే దాదాపు ప్రతి రెండు రోజులకు ఒకటి చొప్పున జరిగిందని వోర్టెక్సా తెలిపింది. ఫలితంగా రష్యా సముద్ర మార్గ డీజిల్ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 610,000 బ్యారెళ్లు తగ్గిపోయాయి. భారత్‌తో పాటు తుర్కియే, మొరాకో దేశాలు కూడా రష్యాకు పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నాయి.

వాహనదారులకు షాక్- భారీగా పెరిగిన CNG ధర- ఎంతంటే?

రూ.1 లక్షకు 5 నిమిషాల్లో రూ.44 లక్షల లాభం- ట్రేడర్ పోస్ట్ నెట్టింట వైరల్!