ETV Bharat / business

స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్​ చేస్తున్నారా? - "ఈ ప్రకటనల" పట్ల అప్రమత్తంగా ఉండాలట!

"పంప్‌ అండ్‌ డంప్‌" వంటి మోసపూరిత వ్యూహాలతో సామాన్యులను బురిడీ కొట్టిస్తోన్న మోసగాళ్లు - అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచనలు!

How to Avoid Investment Frauds
How to Avoid Investment Frauds (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 3, 2026 at 12:30 PM IST

|

Updated : July 3, 2026 at 12:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

How to Avoid Investment Frauds: ప్రస్తుతం చాలా మంది స్టాక్​ మార్కెట్లో ఇన్వెస్ట్​ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కారణం తమ కష్టార్జితాన్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడిగా పెట్టి, సంపదను వృద్ధి చేసుకోవాలనుకోవడమే. అయితే నేటి రోజుల్లో ఎక్కడ చూసినా సైబర్​ నేరగాళ్లు రాజ్యం ఏలుతున్నారు. స్టాక్​ మార్కెట్లో కూడా అమాయక మదుపరుల బలహీనతలను క్యాష్​ చేసుకుని "పంప్‌ అండ్‌ డంప్‌" స్కామ్​లతో ముంచేస్తున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఇలాంటి ముఠాలపై కొరడా ఝుళిపిస్తున్నా ఫలితం మాత్రం లేకుండా పోతుంది. అయితే అధికారులు తీసుకునే చర్యలతో పాటు ఇన్వెస్టర్ల సొంత అప్రమత్తతే వారి పెట్టుబడులకు రక్ష అంటున్నారు నిపుణులు. ఇంతకీ చిన్న మదుపరులు ఈ మోసాల వలలో ఎందుకు చిక్కుకుంటున్నారు? వారి పెట్టుబడులను భద్రంగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

మోసగాళ్లకు చిన్న మదుపరులే ఎప్పుడూ అత్యంత సులువైన లక్ష్యంగా మారుతుంటారని నిపుణులు చెబుతున్నారు. దీని వెనుక ప్రధాన కారణం.. భావోద్వేగం, అవగాహనా లోపమే అంటున్నారు. ఈ క్రమంలోనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు.

ఉచిత సలహాలు నమ్మొద్దు: ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్, టెలిగ్రామ్‌ సహా ఇతర సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్​లో ఉచితంగా లభించే స్టాక్‌ చిట్కాలను చిన్న మదుపరులు నిజమైన సిఫార్సులుగా భావించి సులభంగా నమ్ముతుంటారని.. ఇది పెద్ద పొరపాటు అంటున్నారు. ఈ క్రమంలోనే మొబైల్‌ ఫోన్లకు వచ్చే తెలియని వ్యక్తుల ఎస్‌ఎంఎస్‌లు, సోషల్‌ మీడియా గ్రూపులలో ప్రచారమయ్యే షేర్ల సిఫార్సుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా, అతి తక్కువ కాలంలో గ్యారంటీ లాభాలు అంటూ ఆశ చూపే సలహాలు, సూచనల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని.. అప్పుడే మీ డబ్బు సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు.

సరిచూసుకోవడం ముఖ్యం: చాలా మంది ఇన్వెస్టర్లకు మార్కెట్‌ విశ్లేషణపై సరైన అవగాహన ఉండదని.. కంపెనీ ఆర్థిక పరిస్థితులు, నివేదికలు, అధికారిక సమాచారాన్ని స్వయంగా సరిచూసుకోకుండా కేవలం ఎవరో చెప్పారనే ఉద్దేశంతో పెట్టుబడి పెడతారంటున్నారు. కానీ ఇది కూడా సరైన పద్ధతి కాదంటున్నారు. పెట్టుబడి పెట్టడం అనేది ఒక నిరంతర అవగాహన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. మంచి పుస్తకాలు, పత్రికల్లో వచ్చే వ్యాసాలు చదవడం, నిపుణుల సలహాలు తీసుకోవడం, ఓర్పుగా వ్యవహరించడం వంటి పద్ధతుల ద్వారా మాత్రమే దీర్ఘకాలంలో సంపదను సృష్టించే వ్యూహాలు తెలుస్తాయంటున్నారు. అందుకే ఇన్వెస్ట్​ చేసే ముందు సదరు కంపెనీ ఆర్థిక స్థితిగతులు, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్స్, అధికారిక ప్రకటనలను స్వయంగా చదివి వెరిఫై చేసుకోవాలంటున్నారు. కేవలం వైరల్‌ సందేశాల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు ఎప్పడూ తీసుకోవద్దని చెబుతున్నారు.

అవకాశం పోతుందని: "ఈ షేరు ఇప్పుడు కొనుగోలు చేయకపోతే భారీ లాభాలు పొందే సువర్ణావకాశం చేజారిపోతుంది" అనే ఆర్టిఫిషీయల్​ అత్యవసర వాతావరణాన్ని మోసగాళ్లు సృష్టిస్తారని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చిన్న మదుపరులు తక్కువ ధరకే షేర్లు వస్తున్నాయని హడావుడిగా, తొందరపాటుతో నిర్ణయాలు తీసుకుంటారని.. ఈ పద్ధతి సరికాదంటున్నారు. పెట్టుబడి పెట్టేందుకు తగిన సమయం తీసుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న మార్గాల్లో విశ్లేషించమంటున్నారు. చిన్న లేదా అంతగా పరిచయం లేని కంపెనీ షేరు ఎలాంటి వ్యాపార పురోగతి లేకపోయినా, ఒకేసారి ధర లేదా ట్రాన్సాక్షన్​ పెరగడం జరిగితే దాన్ని ఒక హెచ్చరికలా భావించాలని సూచిస్తున్నారు.

ఒకే షేరులో మొత్తం పెట్టుబడి: మంచి కంపెనీల జోలికి వెళ్లకుండా, ఎక్కువగా గుర్తింపు లేని చిన్న కంపెనీలు లేదా పెన్నీ స్టాక్స్‌ను మోసగాళ్లు ఎంచుకుంటారని అంటున్నారు. ఎందుకుంటే వీటి మార్కెట్‌ ధరలను తారుమారు చేయడం చాలా సులభమని.. పైగా, వీటి గురించి నిజమైన సమాచారాన్ని సామాన్యులు సులభంగా ధ్రువీకరించుకోలేరంటున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. ఎప్పుడూ ఒకే షేరు లేదా ఒకే రంగంపై ఆధారపడకూడదని.. ఈక్విటీలు, బంగారం, ఎఫ్‌డీ వంటి వివిధ పథకాల్లో పెట్టుబడులను విస్తరించాలంటున్నారు. ఇలా ఎక్కువ వాటిలో పెట్టుబడి పెట్టినప్పుడు అనుకోకుండా ఏదైనా ఒక షేరులో అవకతవకలు జరిగినా, మొత్తం పెట్టుబడి తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందంటున్నారు.

ఐటీఆర్​ ఫైల్​ చేస్తున్నారా? - ఈ తప్పులు చేస్తే "నోటీసులు" వచ్చే అవకాశం​!

డిజిటల్​ అరెస్ట్​ నుంచి పెళ్లిపత్రికల వరకు - ఈ సైబర్​ మోసాల గురించి తెలుసుకోవాల్సిందే!

Last Updated : July 3, 2026 at 12:40 PM IST