భారీగా పెరిగిన బంగారం ధర- ప్రస్తుతం ఎంత ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా!

Published : June 1, 2026 at 10:32 AM IST
Gold Rate Today : అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ మారకపు విలువల్లో చోటుచేసుకుంటున్న మార్పుల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధర తాజాగా రూ.3000 ఎగబాకడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. వెండి ధరలు కూడా ఇదే దారిలో పయనిస్తూ స్వల్పంగా పెరిగాయి.
క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 10.30 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,59,800గా నమోదైంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,940గా ఉంది. ఆదివారం ట్రేడింగ్ ఉండదు కనుక, శనివారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,010గా ఉండగా, ఇప్పుడు రూ.3000కు పైగా ఒక్కసారిగా పెరగడం గమనార్హం.
వెండి ఎంత?
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. కిలో వెండి ధరపై సుమారు రూ.100 మేర పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,66,578గా ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,515 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 75.59 డాలర్లుగా నమోదైంది.
నోట్- బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసేముందు ధరలు పరిశీలించుకోవాలి.
బంగారం ధర ఎలా నిర్ణయిస్తారు? 22 క్యారెట్లు, 24 క్యారెట్ల మధ్య తేడా ఏంటి?
బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలామంది ముందుగా చూసేది ధర. అయితే బంగారం ధరతో పాటు దాని స్వచ్ఛత గురించి కూడా తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే క్యారట్ల ఆధారంగానే బంగారం నాణ్యత, విలువ నిర్ణయించబడుతుంది. బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు. క్యారట్ల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత స్వచ్ఛంగా ఉన్నట్లు భావిస్తారు. 24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనదిగా గుర్తింపు పొందింది. ఇందులో సుమారు 99.9 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా 24 క్యారెట్ల బంగారాన్ని సాధారణంగా బంగారు నాణేలు, బిస్కెట్లు, బార్ల రూపంలో విక్రయిస్తారు. పెట్టుబడుల కోసం చాలామంది ఈ రకమైన బంగారాన్నే కొనుగోలు చేస్తుంటారు.
అయితే నగల తయారీకి మాత్రం ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్నే ఉపయోగిస్తారు. దీనిలో కొంత శాతం వెండి, రాగి వంటి ఇతర లోహాలను కలుపుతారు. దీంతో బంగారానికి బలం పెరిగి ఆభరణాల రూపంలో మలచడం సులభమవుతుంది. మార్కెట్‌లో లభించే చాలా బంగారు ఆభరణాలు 22 క్యారెట్లు లేదా 916 హాల్‌మార్క్ స్వచ్ఛత ప్రమాణంతో ఉంటాయి. 24 క్యారెట్ల బంగారంతో పోలిస్తే ఇందులో స్వచ్ఛత కొద్దిగా తక్కువగా ఉండటంతో ధర కూడా కొంత తక్కువగా ఉంటుంది. భారత్‌లో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగితే ధరలు ఎగబాకుతాయి. అదే డిమాండ్ తగ్గినా లేదా ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు వచ్చినా ధరల్లో తగ్గుదల కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకునే ప్రతి మార్పు దేశీయ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుంది.
భారత్‌లో బంగారం అవసరాల్లో పెద్ద భాగం దిగుమతుల ద్వారానే తీరుతుంది. అందువల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువలో వచ్చే మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. రూపాయి బలహీనపడితే విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకునే ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు రూపాయి బలపడితే దిగుమతి వ్యయం తగ్గి ధరలపై కొంత ఉపశమనం కలగవచ్చు. ఇక బంగారం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు కొన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో లేదా కొన్ని దుకాణాల్లో బంగారం ధరలను ప్రకటించే సమయంలో జీఎస్‌టీ, ఇతర పన్నులు లేదా అదనపు సుంకాలను కలపకుండా చూపిస్తారు. దీంతో ధర తక్కువగా ఉన్నట్లు కనిపించినా, బిల్లు చెల్లించే సమయంలో అదనపు ఛార్జీలు జోడించడంతో మొత్తం ధర పెరుగుతుంది.
అలాగే ప్రతి జ్యువెలరీ షాపులో తయారీ ఛార్జీలు, తరుగు ఛార్జీలు, ఇతర సేవా రుసుములు వేర్వేరుగా ఉండవచ్చు. అందువల్ల కేవలం గ్రాము ధరను మాత్రమే చూసి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. తుది బిల్లులో ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో ముందుగానే తెలుసుకోవాలి. వివిధ దుకాణాల్లో బంగారం ధరలు, మేకింగ్ ఛార్జీలు, ఇతర ఖర్చులను పోల్చి చూసిన తర్వాత కొనుగోలు చేస్తే వినియోగదారులకు మరింత ప్రయోజనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
సుకన్య సమృద్ధి స్కీమ్ ద్వారా రూ.50 లక్షలు పొందాలా? - నెలకు ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే!
రూ.5వేలు ఉంటే చాలు- పోస్టాఫీస్ ఫ్రాంచైజీ బిజినెస్! - ఎవరైనా అప్లై చేసుకోవచ్చు!

