బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు- జులై 3న తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు వివరాలు మీకోసం- కొనుగోలు ముందు హాల్‌మార్క్, మేకింగ్ ఛార్జీలు తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణుల సూచన

Published : July 3, 2026 at 9:42 AM IST
Gold Rate Today : దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న పరిణామాలు, డిమాండ్ పెరుగుదల, పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో సిల్వర్ రేట్లు కూడా పెరిగాయి.
క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,50,680గా నమోదైంది. గురువారం ఈ ధర రూ.1,47,330గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.3,350 మేర పెరిగింది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు, ముంబయి మార్కెట్లలో కూడా 24 క్యారెట్ల బంగారం ఇదే ధర వద్ద కొనసాగుతోంది. నగల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,31,810గా నమోదైంది.
వెండి ధరలోనూ భారీ జంప్
బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,41,400కు చేరుకుంది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.2,36,986గా ఉన్న వెండి ధర ఒక్కరోజులోనే రూ.4,414 మేర పెరిగింది. పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్‌లోని అనిశ్చిత పరిస్థితులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు వెండి ధరల పెరుగుదలకు కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ధరల మార్పులు, అమెరికా డాలర్ మారకం విలువలో హెచ్చుతగ్గులు, దిగుమతి సుంకాలు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల కొనుగోలు ధోరణి వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అలాగే నగరాలను బట్టి రవాణా వ్యయం, స్థానిక పన్నులు, డీలర్ల విధానాల కారణంగా స్వల్ప ధరల తేడా కనిపించవచ్చు. అందువల్ల బంగారం కొనుగోలు చేసే ముందు తాజా మార్కెట్ ధరలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నగల తయారీలో 22కార్యెట్ల బంగారమే ఎందుకు?
24 క్యారెట్ల బంగారం దాదాపు 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. ఇది అత్యంత స్వచ్ఛమైన బంగారంగా పరిగణించబడుతుంది. అయితే చాలా మెత్తగా ఉండటంతో సాధారణంగా ఆభరణాల తయారీలో ఉపయోగించరు. బంగారు నాణేలు, బార్లు, బిస్కెట్లు వంటి పెట్టుబడి ఉత్పత్తుల తయారీలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. 22 క్యారెట్ల బంగారం 91.6 శాతం స్వచ్ఛత కలిగి ఉంటుంది. దీనినే సాధారణంగా 916 బంగారం అని పిలుస్తారు. ఇందులో రాగి, వెండి వంటి ఇతర లోహాలను కలపడం వల్ల బలం పెరిగి నగల తయారీకి అనువుగా మారుతుంది. అందుకే భారతీయ మార్కెట్‌లో విక్రయించే అధిక శాతం బంగారు ఆభరణాలు 22 క్యారెట్ల బంగారంతోనే తయారవుతాయి.
916 హాల్‌మార్క్ తనిఖీ తప్పనిసరి
బంగారం కొనుగోలు సమయంలో 916 హాల్‌మార్క్, బీఐఎస్ ధ్రువీకరణ గుర్తులు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. హాల్‌మార్క్ ఉన్న బంగారం కొనుగోలు చేయడం ద్వారా నాణ్యతపై నమ్మకం ఉండటమే కాకుండా భవిష్యత్తులో విక్రయించినప్పుడు కూడా మెరుగైన విలువ పొందే అవకాశం ఉంటుంది.
మార్కెట్‌లో ప్రకటించే బంగారం ధరే తుది ధర కాదు. బంగారం ప్రాథమిక ధరకు అదనంగా జీఎస్‌టీ, మేకింగ్ ఛార్జీలు, హాల్‌మార్కింగ్ ఫీజులు, ఇతర పన్నులు కూడా యాడ్ చేస్తారు. సాధారణంగా నగ డిజైన్‌ను ఆధారంగా మేకింగ్ ఛార్జీలు 6 శాతం నుంచి 20 శాతం వరకు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల కొనుగోలు చేసే ముందు వేర్వేరు నగల దుకాణాల్లో ధరలు, నాణ్యత, మేకింగ్ ఛార్జీలు, అందుబాటులో ఉన్న ఆఫర్లను పోల్చి చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పండుగలు, ప్రత్యేక ఆఫర్ల సమయంలో మేకింగ్ ఛార్జీలపై రాయితీలు లభించే అవకాశాలను కూడా వినియోగించుకుంటే అదనపు ఖర్చును తగ్గించుకోవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఆన్‌లైన్ పేమెంట్స్ చేసే వారికి అలర్ట్- OTPలకు బదులుగా కొత్త పేమెంట్ పాస్‌కీ- VISA కొత్త సేవలు

