దేశంలో తగ్గిన విదేశీ మారకపు నిల్వలు: ఆర్‌బీఐ
దేశంలో విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు తగ్గినట్లు వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- జనవరి 2తో ముగిసిన వారంలో 686.801 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఫారెక్స్ నిల్వలు

Published : January 9, 2026 at 6:35 PM IST
Forex Reserves In India : భారతదేశ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలపై శుక్రవారం కీలక ప్రకటన చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ). జనవరి 2తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారకపు నిల్వలు 9.809 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 686.801 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని వెల్లడించింది. అంత క్రితం వారం అంటే డిసెంబరు 26తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 3.293 బిలియన్ డాలర్లు పెరిగి 696.61 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని పేర్కొంది.
తగ్గిన ఫారిన్ కరెన్సీ అసెట్స్
అలాగే విదేశీ మారకపు నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఫారిన్ కరెన్సీ అసెట్స్) 7.622 బిలియన్ డాలర్లు తగ్గిపోయి 551.99 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. విదేశీ మారకపు నిల్వల్లో 'ఫారిన్ కరెన్సీ అసెట్స్'ను అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. విదేశీ ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, విదేశీ బ్యాంకుల్లోని డిపాజిట్లను ఫారిన్ కరెన్సీ అసెట్స్ అని పిలుస్తారు. వీటిపై ప్రధానంగా యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర దేశాల కరెన్సీల ప్రభావం కనిపిస్తుంది.
తగ్గిన పసిడి నిల్వలు
జనవరి 2తో ముగిసిన వారంలో పసిడి నిల్వల విలువ 2.058 బిలియన్ డాలర్లు మేర తగ్గిపోయి 111.262 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్‌బీఐ తెలిపింది. దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు (ఎస్‌డీఆర్ లు) 25 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 18.778 బిలియన్ డాలర్లకు చేరాయని పేర్కొంది. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వద్ద దేశ నిల్వల స్థానం 105 మిలియన్ డాలర్లు తగ్గి 4.771 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ తెలిపింది.
స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే ఏమిటి?
సభ్య దేశాల్లో తగినంత నగదు లభ్యతను ఉంచేందుకు ఐఎంఎఫ్ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ రిజర్వ్ నిధినే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటారు. ఇందులో అమెరికా డాలర్, యూరో, చైనీస్ రెన్ మిన్బి, జపనీస్ యెన్, బ్రిటీష్ పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీలు ఉంటాయి. అత్యవసరాల్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ నిధి నుంచి ఐఎంఎఫ్ సభ్య దేశాలన్నీ ఈ ఐదు కరెన్సీల్లో నిధులను విత్ డ్రా చేసుకోవచ్చు.
పటిష్ఠంగా భారత్ ఎకానమీ
ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ అనిశ్చితులు, సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ తన పటిష్టమైన వృద్ధిని కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన నివేదికలో ఇటీవలే స్పష్టం చేసింది. బలమైన దేశీయ డిమాండ్ కు తోడు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, సమర్థవంతమైన స్థూల ఆర్థిక విధానాలే ఇందుకు కారణమని తెలిపింది. ప్రస్తుతం దేశంలోని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు అత్యంత పటిష్టంగా ఉన్నాయని వెల్లడించింది. మెరుగైన ఆస్తుల నాణ్యత, తగినంత మూలధన నిల్వలు, లాభదాయకతతో బ్యాంకుల ఆర్థిక స్థితులు ఆశాజనంగా ఉన్నాయని పేర్కొంది. బలమైన బ్యాలెన్స్ షీట్లు, సరళమైన ఆర్థిక పరిస్థితులకు తోడు, మార్కెట్ లో అస్థిరత తక్కువగా ఉండడం వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను తట్టుకొని నిలబడగలుగుతోందని వెల్లడించింది.
తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ బ్యాంకులు నష్టాలను తట్టుకుని, నిర్దేశిత కనీస మూలధనాన్ని కొనసాగించగలవని, 'మ్యాక్రో స్ట్రెస్ టెస్ట్' లో తేలిందని ఆర్‌బీఐ రిపోర్ట్ స్పష్టం చేసింది. మ్యూచువల్ ఫండ్స్ , క్లియరింగ్ కార్పొరేషన్ లు కూడా పటిష్టంగా ఉన్నాయని తెలిపింది. ఇక నాన్ -బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మెరుగైన లాభదాయకతతో బలంగా ఉన్నాయని పేర్కొంది. బీమా రంగం కూడా అవసరమైన 'సాల్వెన్సీ రేషియో' కలిగి స్థిరంగా ఉందని వెల్లడించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్యపరమైన అనిశ్చితుల వల్ల స్వల్పకాలిక ముప్పులు పొంచి ఉన్నాయని అభిప్రాయపడింది.
75శాతం సంపాదనను విరాళంగా ఇచ్చేస్తా : వేదాంతా ఛైర్మన్
రష్యా నుంచి భారత్కు- రూ.15లక్షల కోట్ల విలువైన చమురు దిగుమతులు: CREA

