ETV Bharat / business

"EMI" ఆలస్యమైతే ఏం జరగుతుంది? - క్రెడిట్‌ స్కోరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

రుణ వాయిదా చెల్లింపులో విఫలమైతే ఏంటి పరిస్థితి? - ఒక్క పొరపాటు భవిష్యత్​లో ఇబ్బంది పెడుతుందా?

EMI Defaults Impacts Credit Score
EMI Defaults Impacts Credit Score (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 26, 2026 at 11:39 AM IST

2 Min Read
Choose ETV Bharat

EMI Defaults Impacts Credit Score : ఈ రోజుల్లో పర్సనల్​ లోన్లు తీసుకోవడం చాలా సులభమైంది. బ్యాంక్‌ లేదా ఆర్థిక సంస్థ వెళ్లే అవసరం లేకుండానే చాలా సందర్భాల్లో అవే మనల్ని సంప్రదించి లోన్లు మంజూరు చేస్తున్నాయి. రుణం తీసుకున్నప్పుడు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలి. కానీ, అనుకోని పరిస్థితుల్లో రుణ వాయిదా (ఈఎంఐ) చెల్లింపులో విఫలమైతే ఏంటి పరిస్థితి? ఈ ఒక్క పొరపాటు భవిష్యత్​లో ఇబ్బంది పెడుతుందా? అనేది చాలామందికి ఆందోళన కలిగిస్తుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈఎంఐని చెల్లించకపోతే ఏం జరుగుతుంది? క్రెడిట్‌ స్కోరుపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

మన దేశంలో చాలామందికి డబ్బు ప్రవాహం మారుతూ ఉంటుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. జీతం పడటం ఆలస్యం కావడం, అనుకోని వైద్య ఖర్చులు లేదా ఇతర అత్యవసరాలు వల్ల నెలవారీ చెల్లింపుల చక్రం దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. రుణ వాయిదా (ఈఎంఐ)ను నిర్ణీత తేదీనాడు చెల్లించనప్పుడు, ఆ తర్వాత రుణదాత ఎంత వేగంగా, బాధ్యతగా స్పందించారన్నదే దీర్ఘకాలిక ప్రభావాన్ని నిర్ణయిస్తుందని అంటున్నారు.

  • ఒక్కసారి వాయిదాను తప్పినంత మాత్రాన బ్యాంకులు రుణగ్రహీత సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయవని చెబుతున్నారు. క్రెడిట్‌ బ్యూరోలు ఒక వ్యక్తి దీర్ఘకాలిక చెల్లింపు ప్రవర్తనను గమనిస్తాయని పేర్కొంటున్నారు. కానీ అప్పుడప్పుడు జరిగే పొరపాట్లను ప్రామాణికంగా తీసుకోవని అంటున్నారు.
  • ఒక ఈఎంఐ ఆలస్యమైనప్పటికీ, 30 రోజుల్లోపు దాన్ని చెల్లించిన వారి క్రెడిట్‌ స్కోరుపై పెద్దగా ప్రభావం ఉండదని పేర్కొంటున్నారు. లేదంటే ఇది తాత్కాలికం మాత్రమేనని అంటున్నారు. అదే పనిగా ఆలస్యం చేయడం లేదా స్పందించకుండా మౌనంగా ఉండిపోవడం వల్ల జరిమానా పడుతుందని హెచ్చరిస్తున్నారు. రికవరీ చర్యలు, క్రెడిట్‌ స్కోరు శాశ్వతంగా పతనం కావడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు.

ఏం చేయాలి? : ఈఎంఐ తప్పిన సందర్భంలో బ్యాంకును సంప్రదించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు.

  • రుణగ్రహీతలు వెంటనే తమ రుణదాతను సంప్రదించి, తమ పరిస్థితిని వివరించాలని సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని తెలియజేస్తున్నారు.
  • మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రుణగ్రహీతలకు చెల్లింపు తేదీని మార్చడం, పాక్షిక చెల్లింపులు లేదా తాత్కాలిక ఉపశమన పద్ధతుల ద్వారా బ్యాంకులు వెసులుబాటు కల్పిస్తాయని అంటున్నారు.
  • చాలామంది సరైన సమాచారం లేక లేదంటే భయంతోనో బ్యాంకులను సంప్రదించరని అంటున్నారు. ఒక్క ఈఎంఐ చెల్లించకపోతే క్రెడిట్‌ చరిత్ర దెబ్బతింటుందని భావిస్తారని చెబుతున్నారు. కానీ ఇది అపోహేనని పేర్కొంటున్నారు.
  • మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వాయిదాలను చెల్లించకపోతే, అపరాధ రుసుములు, వడ్డీలతో భారం పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు. దీనివల్ల వచ్చే నెల మరింత ఒత్తిడి ఎదురవుతుందని అంటున్నారు. ఆదాయంలో అనిశ్చితి ఉండే గిగ్‌ వర్కర్లు, తొలిసారి రుణం తీసుకున్న వారికి ఇది పెద్ద సవాల్​గా మారుతుందని చెబుతున్నారు. కాబట్టి వాయిదాలను చెల్లించకపోవడం ఆర్థిక ఇబ్బందిగా కాకుండా, ఒక హెచ్చరికగా భావించాలని వివరిస్తున్నారు. సరైన సమయంలో స్పందించడం, పారదర్శకంగా ఉండటం ఎప్పుడూ అవసరమని పేర్కొంటున్నారు.

ఇలా చేశారంటే "క్రెడిట్ కార్డు క్లోజ్" - ఖాతాదారుల అకౌంట్లపై బ్యాంకుల ఫోకస్!

బ్యాంకు అకౌంట్ ఫ్రీజ్‌ అయిందా? - ఇలా చేస్తే మళ్లీ యాక్టివేట్!