ETV Bharat / business

WEF అధ్యక్షుడు, సీఈఓ రాజీనామా- ఎప్​స్టీన్ ఫైల్స్ ఎఫెక్ట్​?

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారంలో బోర్జ్‌పై వెల్లువెత్తిన ఆరోపణలు- డబ్ల్యూఈఎఫ్‌ సీఈఓ పదవికి రాజీనామా చేసిన బోర్జ్‌ బ్రెండే

World Economic Forum CEO Borge Brende
World Economic Forum CEO Borge Brende (X/Borge Brende)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 8:54 PM IST

3 Min Read
Choose ETV Bharat

World Economic Forum CEO Resigns : అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వర్గాల్లో సంచలనం రేపుతున్న ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. సెక్స్‌ నేరాలకు కేంద్రమైన అమెరికన్‌ వ్యాపారవేత్త ఎప్​స్టీన్​తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు, సీఈవో బోర్జ్‌ బ్రెండే తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

డబ్ల్యూఈఎఫ్‌ ప్రతి ఏడాది స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం దావోస్​ నిర్వహించే వార్షిక సదస్సుతో ప్రపంచ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, విధాన నిర్ణేతలను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు నేతృత్వం వహిస్తున్న బ్రెండేపై వచ్చిన ఆరోపణలు ఫోరమ్‌ ప్రతిష్ఠకు దెబ్బతీశాయి. అమెరికా న్యాయ శాఖ ఇటీవల విడుదల చేసిన ఎప్‌స్టీన్‌ ఫైళ్లలో బ్రెండే పేరు ప్రస్తావనకు రావడం వివాదానికి దారితీసింది. అందులో ఎప్‌స్టీన్‌తో ఆయన పలుమార్లు భేటీ అయినట్లు, పరస్పరం మెయిల్స్‌, టెక్స్ట్‌ సందేశాలు మార్పిడి చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ వర్గాలు వివరణ కోరాయి. దీంతో డబ్ల్యూఈఎఫ్‌ స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించింది.

ఈ పరిణామాల నడుమ బ్రెండే స్వయంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. "చాలా ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాను. ఫోరమ్‌ పనితీరుకు ఎలాంటి ఆటంకం కలగకూడదని భావిస్తున్నాను. ఇక్కడ గడిపిన ఎనిమిదిన్నరేళ్లు నాకు ఎంతో విలువైనవి" అని ఆయన అధికారిక ప్రకటనలో తెలిపారు. అయితే తన ప్రకటనలో ఎప్‌స్టీన్‌ అంశాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు. గతంలో నార్వే విదేశాంగ మంత్రిగా పనిచేసిన బ్రెండే, 2017 నుంచి డబ్ల్యూఈఎఫ్‌కు అధ్యక్షుడు, సీఈవోగా ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన ముందే స్పందిస్తూ, ఎప్‌స్టీన్‌ను వ్యాపార సమావేశాల కోసమే కలిశానని, అతని నేరచరిత్ర గురించి తెలియదని పేర్కొన్నారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని కూడా చెప్పారు.

ఇక ఫోరమ్‌ తరఫున సంయుక్త ప్రకటన విడుదల చేసిన సహాధ్యక్షులు ఆండ్రే హోఫ్​మ్యాన్​, లార్రీ ఫింక్ తెలిపారు. స్వతంత్ర న్యాయ నిపుణులు నిర్వహించిన సమీక్ష పూర్తైందని, ఇప్పటికే వెల్లడించిన విషయాలకతీతంగా కొత్త ఆందోళనలు లేవని వారు స్పష్టం చేశారు. అయినప్పటికీ, సంస్థ పనితీరు నిరంతరంగా కొనసాగాలనే ఉద్దేశంతో నాయకత్వ మార్పు అవసరమైందని చెప్పారు. బ్రెండే రాజీనామా అనంతరం ఫోరమ్‌ తాత్కాలిక అధ్యక్షుడు, సీఈవోగా మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలియోస్ జ్వింగ్గీ బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త శాశ్వత అధినేత ఎంపిక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని డబ్ల్యూఈఎఫ్‌ వెల్లడించింది.

ఎప్‌స్టీన్‌ వ్యవహారం గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులను చిక్కుల్లోకి నెట్టింది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఆయనతో సంబంధాలపై విచారణలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే బ్రిటన్‌ రాజ కుటుంబ సభ్యుడు ప్రిన్స్ అండ్రూ, డ్యూక్ ఆఫ్ యార్క్​పై కూడా ఆరోపణలు వెల్లువెత్తగా, ఆ వ్యవహారం బ్రిటన్‌ రాజవంశానికే ఇబ్బందికరంగా మారింది. ఆయన సోదరుడు ఛార్లెస్ 3 పాలనలోకి వచ్చిన తర్వాత ఈ వివాదాలు మరింత చర్చనీయాంశమయ్యాయి.

ఇలాంటి నేపథ్యంలో డబ్ల్యూఈఎఫ్‌ అధినేత రాజీనామా అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ప్రపంచ ఆర్థిక విధానాలపై ప్రభావం చూపే సంస్థలో నాయకత్వ మార్పు చోటుచేసుకోవడం వల్ల భవిష్యత్‌ సమావేశాలు, కార్యక్రమాలపై ప్రభావం ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు, పారదర్శకతకు కట్టుబడి ఉన్నామనే సంకేతాన్ని ఇవ్వడానికే బ్రెండే ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రముఖులపై వరుసగా వెలువడుతున్న ఆరోపణలు అంతర్జాతీయ వేదికల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.