PAN ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు!- డిపాజిట్లు, ఆస్తులు, వాహనాల కొనుగోలుకు ఊరట!- ఏప్రిల్ 1 నుంచే అమలు!
న్యూ ట్యాక్స్ రూల్స్ 2026తో మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు ఊరట- ఏప్రిల్ 1 నుంచే అమలు

Published : February 10, 2026 at 7:34 PM IST
PAN Limits May Rise : సామాన్యులు, చిరువ్యాపారులకు గుడ్ న్యూస్. పాన్ ట్రాన్సాక్షన్స్ లిమిట్ పెంచుతూ ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం దశాబ్దాల కాలం నాటి నిబంధనల స్థానంలో 'ఆదాయపు పన్ను నిబంధనలు, 2026' పేరుతో కొత్త ముసాయిదాను ప్రవేశపెట్టింది. మధ్యతరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు ఊరట కలిగించడంతోపాటు, బ్యాంకింగ్, వ్యాపార లావాదేవీలు మరింత సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ ముసాయిదా ప్రతిపాదనలు చేసింది.
బ్యాంకింగ్ లావాదేవీలు- పరిమితి పెంపు
ప్రస్తుత నిబంధనల ప్రకారం, బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో ఒక రోజుకు రూ.50వేలు కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే పాన్ కార్డు ఇవ్వడం తప్పనిసరి. అయితే కొత్త ముసాయిదాలో ఈ రోజు వారీ పరిమితిని తొలగించి, వార్షిక పరిమితిని ప్రవేశపెట్టారు. అంటే ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్/ విత్‌డ్రా చేసినప్పుడు మాత్రమే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఇది తరచూ చిన్నచిన్న నగదు లావాదేవీలు చేసేవారికి ఊరట కలిగిస్తుంది.
వాహనాల కొనుగోలు- రూల్స్ ఛేంజ్
ఇప్పటి వరకు ధరతో సంబంధం లేకుండా ఏదైనా నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చేయాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. కానీ కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం, రూ.5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు పాన్ కార్డు సమర్పించాల్సిన పనిలేదు. అయితే తొలిసారి రూ.5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న టూవీలర్ (బైక్/స్కూటర్) కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు.
హోటల్ బిల్లులకు కూడా
పర్యాటక, ఆతిథ్య రంగాలను ప్రోత్సహించేందుకు హోటల్, రెస్టారెంట్ బిల్లు చెల్లింపు పరిమితిని రెట్టింపు చేశారు. గతంలో రూ.50వేలకు పైన బిల్లు చెల్లించాలంటే పాన్ ఇవ్వాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిమితిని రూ.1 లక్షలకు పెంచారు. ఈ నిబంధన బాంక్వెట్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలకు కూడా వర్తిస్తుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
రియల్ ఎస్టేట్ మార్కెట్లో పారదర్శకతను పెంచుతూనే, రాతపనిని తగ్గించేందుకు ఈ ముసాయిదాలో పలు నిబంధనలు మార్చారు. ఆస్తుల కొనుగోలు, విక్రయం లేదా కానుక (గిఫ్ట్) కింద జరిగే లావాదేవీలకు ఉన్న పాన్ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. అంటే రూ.20 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి లావాదేవీలకు మాత్రమే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది.
ఇన్సూరెన్స్ సేవలకు
ఇక బీమా కంపెనీల నుంచి ఏదైనా పాలసీ కొనుగోలు చేయాలంటే, పాన్ కార్డు తప్పనిసరి చేయాలనే కొత్త నిబంధనలు ప్రతిపాదిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి, పన్ను చెల్లింపుదారులకు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి ఈ మార్పులు బాగా ఉపకరిస్తాయని చెప్పవచ్చు. ఆదాయ పన్ను శాఖ 2026 ఫిబ్రవరి 22 నుంచి ఈ ముసాయిదా నిబంధనలపై అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయాలని ప్రజలను కోరింది. ఒక వేళ ఈ ముసాయిదాకు ఆమోదం లభిస్తే, ఈ 2026 ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి
న్యూ ఇన్‌కంట్యాక్స్ యాక్ట్ -2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. సామాన్యులు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఫారమ్‌లను సరళతరం చేసామని తెలిపారు. ఎన్ఆర్ఎస్ కింద టీసీఎస్ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించామన్నారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలు ఎదురుచూసిన ఆదాయపు పన్ను మినహాయింపులు ఏమీ లేవు. ఈసారి పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయనప్పటికీ, దశాబ్దాల కాలం నాటి పాత చట్టానికి స్వస్తి పలుకుతూ కొత్త అధ్యాయానికి తెరలేపారు. 60 ఏళ్ల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి తెస్తామని చెప్పారు. సంక్లిష్టంగా ఉన్న సెక్షన్లను 819 నుంచి 536కి తగ్గించి, సామాన్యులకు సైతం సులభంగా అర్థమయ్యేలా దీనిని రూపొందించామని చెప్పారు. గతేడాది ప్రకటించిన విధంగానే పన్ను శ్లాబులను ఉంచారు. అయితే సెక్షన్ 87A కింద లభించే పన్ను రిబేట్ వల్ల రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను పడదు. దీనికి అదనంగా రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే, రూ.12.75 లక్షల వరకు ఆదాయం ఉన్న శాలరీడ్ ఎంప్లాయిస్‌కు జీరో పన్ను వర్తిస్తుంది.
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్- ఇక UPIతోనే డబ్బులు విత్ డ్రా- త్వరలోనే కొత్త యాప్

