డిజిటల్ అరెస్ట్ నుంచి పెళ్లిపత్రికల వరకు - ఈ సైబర్ మోసాల గురించి తెలుసుకోవాల్సిందే!
రోజురోజుకీ పెరుగుతోన్న సైబర్ మోసాలు - రకరకాల స్కామ్‌లతో ప్రజలను బురిడీ కొట్టిస్తోన్న నేరగాళ్లు - స్కామ్‌లపై అవగాహన తప్పనిసరి అంటున్న బ్యాంక్ ఆఫ్ బరోడా!

Published : June 28, 2026 at 5:13 PM IST
Cyber Crime Types : టెక్నాలజీ పెరుగుతుందని సంతోషపడేలోపు మేమున్నామంటూ సైబర్ నేరగాళ్లు సాంతం దోచేస్తున్నారు. మాయమాటలు చెప్పి రోజుకో కొత్త మార్గంలో ఖాతాదారులను బురిడీ కొట్టిస్తున్నారు. ఓటీపీలు, బ్యాంక్ అలర్ట్‌లు అంటూ అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ లక్షలకు లక్షలు దోపిడీ చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలబారిన పడకుండా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ ఖాతాదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా.. బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు సైబర్ మోసాల గురించి అప్రమత్తంగా ఉండాలంటోంది. ఈ క్రమంలోనే కొన్ని రకాల సైబర్ మోసాలా గురించి వివరిస్తోంది. ఈ మోసాల పట్ల అవగాహన పెంచుకోవడం ద్వారా మన కష్టార్జితాన్ని కాపాడుకోవచ్చని సూచించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
డిజిటల్ అరెస్ట్ స్కామ్: ప్రస్తుతం దేశంలో ఈ తరహా మోసాలు తీవ్రంగా పెరుగుతున్నాయని అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇందులో సైబర్ నేరగాళ్లు పోలీసు అధికారుల్లా నటిస్తూ ఫోన్ చేస్తారని.. ఏదో నేరంలో చిక్కుకున్నారని ఆరోపిస్తూ, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరిస్తారంటున్నారు. అయితే నిజానికి పోలీసులు ఎప్పుడూ డిజిటల్ అరెస్టు చేయరనే విషయాన్ని ఖాతాదారులు గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే, వెంటనే కట్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
నకిలీ పార్శిల్, బిల్లు చెల్లింపులు: ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువైంది. నచ్చిన ఐటమ్‌ను ఎక్కడినుంచైనా ఆర్డర్ పెట్టుకునే సౌలభ్యం ఉండటంతో చాలా మంది ఈజీగా షాపింగ్‌లు చేస్తున్నారు. దీన్నే సైబర్ నేరగాళ్లు ఆసరగా చేసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ స్కాములో భాగంగా మీ పేరు మీద వచ్చిన పార్శిల్ కస్టమ్స్ వద్ద ఆగిపోయిందని, వెంటనే స్పందించకపోతే అరెస్ట్ చేస్తామని భయపెడతారట. అంతేకాకుండా పేమెంట్స్ చేయాలని నకిలీ బిల్లు చెల్లింపు లింకులనూ పంపిస్తారట. అయితే ఇలాంటి ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకూడదంటున్నారు. ఒకవేళ అనుమానం వస్తే మరో ఆలోచన లేకుండా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
ఫోన్ సర్వీసు నిలిపివేత: టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) నుంచి లేదా సైబర్ క్రైమ్ విభాగం అధికారులమంటూ ఫోన్ చేస్తారని.. మీరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున మొబైల్ నంబరుపై సేవలను నిలిపివేస్తున్నట్లు బెదిరిస్తారంటున్నారు. అంతేకాకుండా డబ్బులు కట్టాలని లేదా ఓటీపీలు చెప్పాలని అడుగుతుంటారట. అయితే మొబైల్ సేవలు నిలిపివేస్తామని చెప్పగానే బెదిరిపోయి ఓటీపీలు వంటివి చెప్పకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మొబైల్ కనెక్షన్‌ను నిలిపివేసే అధికారం కేవలం టెలికాం సంస్థలకు మాత్రమే ఉంటుందని, ట్రాయ్‌కు కాదనే విషయాన్ని ఖాతాదారులు గుర్తించుకోవాలని చెబుతున్నారు.
కుటుంబ సభ్యుల అరెస్టు: ప్రస్తుతం ఏఐ వినియోగం ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైబర్ నేరగాళ్లు కూడా కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగిస్తున్నారని.. ముఖ్యంగా వాయిస్ క్లోనింగ్ ద్వారా తెలిసిన వారి గొంతును అచ్చుగుద్దినట్లు సృష్టించి ఫోన్ చేస్తారని చెబుతున్నారు. అంటే మీ బంధువులు లేదా కుటుంబ సభ్యులు అరెస్ట్ అవ్వబోతున్నారంటూ చెబుతూ.. వెంటనే డబ్బు పంపాలని అడుగుతారట. అయితే ఇలాంటి ఆందోళనకరమైన డిమాండ్లపై స్పందించే ముందు, వెంటనే కుటుంబ సభ్యులకు నేరుగా ఫోన్ చేసి వివరాలను నిర్ధారించుకోవాలని చెబుతున్నారు.
స్టాక్ ట్రేడింగ్, పెట్టుబడులు: నేటి రోజుల్లో చాలా మంది రిస్క్‌లేని స్కీమ్‌లలో పెట్టుబడి పెట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే దీనిని సైబర్ నేరగాళ్లు ఆసరాగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. అంటే తక్కువ డబ్బుతో ఎక్కువ లాభాలు అంటూ సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలతో ప్రజలను ఆకట్టుకుని అకౌంట్లు ఖాళీ చేస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని, అధికారిక స్కీములు కాని వాటిలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడులు పెట్టకూడదని హెచ్చరిస్తున్నారు.
ఆన్‌లైన్ ఉద్యోగాలు, లాటరీలు: ఆఫీసులకు వెళ్లే కన్నా ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎక్కువయ్యాయి. చాలా మంది కూడా వీటికే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంట్లో కూర్చొని సులభంగా డబ్బు సంపాదించొచ్చు, ఆన్‌లైన్ ఉద్యోగాలు అంటూ చెప్పేవారి మాటలు నమ్మొద్దంటున్నారు. జాబ్ ఆఫర్స్ పేరిట రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ రకరకాల అవసరాల కోసం డబ్బు అడుగుతారని అంటున్నారు. ఇలాంటి జాబ్ ఆఫర్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాక మాత్రమే మిగిలిన ప్రొసీడింగ్స్ చూసుకోవాలని చెబుతున్నారు.
శుభలేఖల పేరుతో: పెళ్లి శుభలేఖల పేరుతో కూడా సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేస్తున్నారని చెబుతున్నారు. అంటే పెళ్లి శుభలేఖల ముసుగులో మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రమాదకరమైన ఆండ్రాయిడ్ ఫైల్స్ పంపిస్తారని.. అయితే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఇలాంటి ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు.
పన్ను రిఫండు: ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల పేరుతో నేరగాళ్లు ఫోన్ చేస్తారని.. ఆదాయపు పన్ను రిఫండ్‌ను త్వరగా ప్రాసెస్ చేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ అడుగుతారని చెబుతున్నారు. ట్యాక్స్ రిఫండ్ కోసం ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఎప్పుడూ ఫోన్లు, సందేశాలు, ఇ-మెయిల్ ద్వారా బ్యాంకు వివరాలు అడగరనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలంటున్నారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే అప్రమత్తం కావాల్సిందే అని సూచిస్తున్నారు.
నకిలీ ఎల్‌పీజీ డీలర్లు: ఎల్‌పీజీ లేదా గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ల పేరుతో పేమెంట్ లేదా వెరిఫికేషన్ లింకులు పంపిస్తారని.. ఇకేవైసీ, గ్యాస్ బుకింగ్‌కు డబ్బు చెల్లించమంటూ సందేశాలు వస్తుంటాయంటున్నారు. అయితే ఇలాంటి అన్నీ నిజమైనవి కావని.. ఇందులో మోసపూరితమైన లింక్‌లు ఉండొచ్చంటున్నారు. కాబట్టి వినియోగదారులు ఎప్పుడూ అధికారిక, ధ్రువీకరించిన మార్గాల ద్వారానే చెల్లింపులు చేయాలని సూచిస్తున్నారు.
YUVA : సైబర్ మోసంలో డబ్బుపోగొట్టుకున్నారా? - బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా 'డీజీ రక్ష'

