ETV Bharat / business

నెలాఖరులో చిల్లిగవ్వ చేతిలో ఉండడం లేదా? - ఏం కావాలో, ఏది వదిలేయాలో ఇలా ప్లాన్ చేయండి!

లైఫ్​లాంగ్​ ఆర్థికంగా స్ట్రాంగ్​గా, సేఫ్​గా ఉండాలా? - మీకోసమే ఈ బెస్ట్ ఫైనాన్షియల్ టిప్స్!

Best Financial Planning Tips
Best Financial Planning Tips (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 29, 2026 at 4:48 PM IST

4 Min Read
Choose ETV Bharat

Best Financial Planning Tips : ఒకప్పుడు మన తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కొద్దిపాటి సంపాదనతోనే ఇల్లు నెట్టుకొచ్చేవారు. పిల్లల చదువులు, ఇంటి అవసరాలు, ఇతర ఖర్చులన్నింటినీ అప్పు చేయకుండానే చాకచక్యంగా నిర్వహించేవారు. కానీ, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఎంత సంపాదించినా నెలాఖరుకు వచ్చేసరికి అప్పులు చేయాల్సి వస్తోందనే మాట నేటితరం యువతలో ఎక్కువగా వినిపిస్తోంది. అందులో మనం కూడా ఉండొచ్చు. అయితే, ఆర్థిక సమస్యలు ఎప్పుడూ తక్కువ సంపాదించడం వల్ల రావు. ఒక స్పష్టమైన ప్రణాళిక లేకుండా డబ్బును ఇష్టానుసారం ఖర్చు చేయడం వల్లే వస్తుంటాయని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. మరి, సరైన ఆర్థిక ప్రణాళిక అంటే ఎలా ఉండాలి? పొదుపు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఉద్యోగులు శాలరీ వచ్చిన రెండు మూడు రోజులు చాలా హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత ఇంటి కిరాయి, ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డుల బిల్లులు.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. వీటన్నింటి మధ్యలో పొదుపు, ఇన్వెస్ట్​మెంట్స్, ఇవన్నీ కంప్లీట్ చేసే సరికి చివరికి మళ్లీ ఒకటో తారీఖు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆయా అవసరాల కోసం జీతాన్ని కేటాయించడాన్ని భావోద్వేగాలతో కాకుండా, ఒక క్రమబద్ధమైన వ్యవస్థలా పరిగణించాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు. అయితే, మీ సంపాదన, నివసించే ప్లేస్, కుటుంబ బాధ్యతలను బట్టి ఈ కేటాయింపుల్లో మార్పులు చేర్పులుండొచ్చు. అత్యవసర ఖర్చులు, భవిష్యత్తు లక్ష్యాలు, అత్యవసర నిధి.. ఇవన్నీ ఒకదానితో ఒకటి పోటీపడకుండా అన్నింటికీ ఒకేసారి నిధులు కేటాయించడం దీని ముఖ్య ఉద్దేశమని చెబుతున్నారు.

తప్పసరి ఖర్చులకు ప్రాధాన్యం

మీ ఆదాయంలో ముందుగా తప్పనిసరి ఖర్చులకు ఫస్ట్ ప్రియార్టీ ఇవ్వాలి. ఇంటి కిరాయి, కిరాణా సరుకులు, కరెంట్, వాటర్ బిల్లులు, పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు వంటివి ఇందులోకి వస్తాయి. ఇంటి కిరాయి లేదా హోమ్ లోన్ ఈఎంఐ శాలరీలో 25-35 శాతం మధ్యలో ఉండేలా చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే, ఆదాయంలో సగం కేవలం ఇంటి ఖర్చులకే పోతే, ఆ తర్వాత పొదుపు, పెట్టుబడులు, అత్యవసరాలకు ఏమీ మిగలదని గుర్తుంచుకోవాలంటున్నారు.

ఈఎంఐలు ఆ లిమిట్ దాటొద్దు!

లోన్ తీసుకున్న కొత్తలో వాయిదాలు చెల్లించడం మంచిగానే అనిపించవచ్చు. ఆ తర్వాత వెహికల్ లోన్, వినియోగ వస్తువుల రుణాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్స్ ఇలా ఒక్కొక్కటిగా పెరుగుతూ ఉంటాయి. నెలాఖరు రాకముందే మీ జీతం మొత్తం వీటికి అంకితమైపోవడం మొదలవుతుంది. అందుకే, చేతికొచ్చే శాలరీలో మొత్తం ఈఎంఐలు 40 శాతం కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆ లిమిట్ దాటితే చిన్నపాటి అత్యవసర పరిస్థితి వచ్చినా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురికావాల్సి వస్తుందంటున్నారు.

సిప్​ ప్రారంభించడం :

చాలా మంది యువ ఉద్యోగులు శాలరీ పెరిగాక పెట్టుబడులు మొదలుపెడదామనుకుంటారు. కానీ, క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌) అనేది సరైన టైమ్ కోసం వేచి చూడటం కంటే, నిలకడ ద్వారానే ఎక్కువ లాభాలను అందిస్తుంది. లేట్​గా చేసే పెద్ద ఇన్వెస్ట్​మెంట్స్ కంటే, ముందుగా మొదలుపెట్టే చిన్నపాటి సిప్‌ల వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. శాలరీ అకౌంట్​లో పడిన వెంటనే, సిప్‌లోకి వెళ్లేలా తేదీలను సెట్ చేసుకోవాలి. జీతం పెరిగే కొద్దీ సిప్‌ మొత్తాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. ముందుగా పెట్టుబడికి అలవాటు పడటం ముఖ్యమని సూచిస్తున్నారు.

వందలో 90 మందిది "ఉల్లిగడ్డ జీతం"! - మీది కూడానా?

పొదుపు మొదలెట్టడం :

మనలో చాలా మంది వచ్చిన జీతంలో మిగిలిందే పొదుపు చేద్దాం అనే ఆలోచనలో ఉంటారు. కానీ, ఆ పద్ధతిని మార్చుకోవాలంటున్నారు. పొదుపు నెలాఖరులో అనుకోకుండా చేసేది కాదు. ఇతర ఖర్చులు మొదలుపెట్టే ముందు, మీకు మీరు చెల్లించుకునే నిర్ణీత మొత్తంగా దీన్ని పరిగణించినప్పుడు, ఇది మరింత మెరుగ్గా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఎమర్జెన్సీ ఫండ్, రికరింగ్‌ డిపాజిట్‌ లేదా ప్రత్యేక సేవింగ్ అకౌంట్స్​కు ఆటోమేటిక్‌గా చిన్న మొత్తంలో డబ్బు ట్రాన్స్​ఫర్ అయ్యేలా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాలక్రమేణా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుందని సూచిస్తున్నారు. ఇలా చేయకపోతే, మనం గమనించకుండానే పొదుపు చేయాల్సిన డబ్బు జీవనశైలి ఖర్చుల్లో కలిసిపోయి కనుమరుగవుతుందంటున్నారు. పొదుపు స్థిరంగా కొనసాగాలంటే, బ్యాంకు అకౌంట్​లో జీతం పడిన వెంటనే నిర్ణీత పొదుపు పథకాలకు ఆటోమేటిక్​గా కట్ అయ్యేలా చూసుకోవాలంటున్నారు.

బీమా పాలసీల్లో చేరడం

చాలా మంది ఉద్యోగులు అనుకోని పరిస్థితుల్లో ఆర్థికంగా అండగా ఉండే బీమా పాలసీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. ఏళ్ల తరబడి కూడబెట్టిన డబ్బు ఒక్క ఆపద వల్ల ఆవిరైపోకుండా, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ రక్షణ ఇస్తాయంటున్నారు నిపుణులు. లేకపోతే, అనారోగ్యం పాలైనా, ఆదాయం ఆగిపోయినా కుటుంబ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. అందుకే, కుటుంబ సభ్యుల బాధ్యత ఉన్న ఎంప్లాయిస్, బీమా ప్రీమియాన్ని చెల్లించడం ఒక తప్పనిసరి ఆర్థిక బాధ్యతగా భావించాలని సూచిస్తున్నారు.

అందరికీ సరిపోయే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటూ ఏమీ ఉండదు. సోషల్ మీడియాలో నిపుణుల పేర్లతో ఎన్నో ఆర్థిక సూత్రాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, వాటన్నింటినీ ఫాలో అవ్వడం ఎవరికీ సాధ్యం కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. నిజ జీవితంలో అవి పనిచేయవని గమనించాలి. ఇంటి కిరాయి ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో ఫ్యామిలీతో కలిసి ఉండే వ్యక్తి బడ్జెట్.. ఒంటరిగా ఉండే వ్యక్తి సంపాదనతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. అందుకే, ఇతరులు పాటించే వాటిని ఫాలో అవ్వకూడదు. మీ ఆదాయాన్ని నెల నెలా ఇష్టానుసారంగా కాకుండా, ఒక ప్లాన్​తో ఖర్చు చేసేలా చూసుకోండి. మీకు ఏదీ భారం అనిపించని విధంగా మీ ఖర్చులు, పెట్టుబడుల కేటాయింపులు ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడే మీ సంపాదనకు సరైన విలువ లభిస్తుందని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.

ముఖ్య గమనిక : ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. కీలకమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

పర్సనల్​ లోన్ కోసం అప్లై చేస్తున్నారా? - ఇలా చేస్తే ఇబ్బందులు ఉండవట!

ఫస్ట్ టైమ్​ క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారా?- ఈ తప్పు చేస్తే ఆర్థిక ఇబ్బందులు కొనితెచ్చుకున్నట్లే!