రోజుకు రూ.7 తో నెలకు రూ.5వేల పెన్షన్ - ఈ స్కీమ్ గురించి తెలుసా?
- ఉద్యోగం లేకపోయినా 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ కావాలనుకుంటున్నారా? - పోస్టాఫీస్, బ్యాంకులు అందించే ఈ స్కీమ్‌లో అప్లై చేస్తే సరి!

Published : February 25, 2026 at 10:54 AM IST
Atal Pension Yojana Scheme: ఉద్యోగం చేసేవారు రిటైర్ అయితే వారికి పెన్షన్ అందుతుంది. దీంతో ఎటువంటి ఆర్థిక సమస్యలూ లేకుండా జీవితం ఆనందంగా గడుస్తుంది. కానీ ఉద్యోగం లేని, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల పరిస్థితి ఏంటి? అందుకే వీరిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అనే పథకం తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా వృద్ధాప్యంలో ఎవరి సహాయమూ లేకుండానే కేంద్రం నుంచి వచ్చే పెన్షన్‌తో జీవితాన్ని హాయిగా ముందుకు సాగించవచ్చు. మరి, ఈ స్కీమ్‌కు అప్లై చేసేందుకు ఎవరు అర్హులు? ఎంత చెల్లించాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం 2015లో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు, తక్కువ ఆదాయ వర్గ వ్యక్తులకు పదవి విరమణ తర్వాత ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అటల్ పెన్షన్ యోజన(APY) అనే స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో చేరిన వారి వయసు 60 సంవత్సరాలు పూర్తైన తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుంచి గరిష్ఠంగా రూ. 5వేల వరకు పెన్షన్ తీసుకోవచ్చు.
ఎవరు అర్హులు
- పద్దెనిమిది(18) నుంచి నలభై(40) సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. 40 దాటితే ఈ పథకంలో చేరేందుకు అర్హత ఉండదు.
- ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ప్రభుత్వ రంగ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది.
- NPS పరిధిలోకి వచ్చే వారు ఈ పథకానికి అర్హులు కారు. అదే విధంగా 2022లో వచ్చిన నిబంధనల ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు దీనికి అనర్హులు.
ఎంత చెల్లించాలి? : ఈ స్కీమ్‌లో చేరిన వారు ఎంత కట్టాలి అనేది ఆ వ్యక్తి వయసు మీద ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్లకే ఈ పథకంలో చేరితే కట్టాల్సిన అమౌంట్ తక్కువ ఉంటుంది. అంటే సుమారు నెలకు రూ.42 నుంచి రూ.210 వరకు ఉంటుంది. అదే 40 ఏళ్ల వయసులో చేరితే 20 సంవత్సరాల పాటు కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి.. వీరికి నెలకు రూ.291 నుంచి రూ.1,454 వరకు ఉంటుంది.
పెన్షన్ ఎంత లభిస్తుంది: ఏపీవై స్కీమ్‌లో చేరిన సభ్యులు వారి కాంట్రీబ్యూషన్‌కు తగట్టు 60 సంవత్సరాలు పూర్తైన తర్వాత నెలవారీగా పెన్షన్ పొందుతారు. నెల నెలా చేసే కాంట్రిబ్యూషన్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ అందుతుంది. మీ వయసు 18 సంవత్సరావు ఉండి.. 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.5 వేల పెన్షన్ పొందాలనుకుంటే.. నెలకు రూ.210 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అదే మీ వయసు పెరిగితే కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది.
ఆటో డెబిట్: ఈ స్కీమ్‌లో చేరే సమయంలోనే ఆటోడెబిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అయితే ఇలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతినెలా బ్యాంకు అకౌంట్లో తగిన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. లేదంటే పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు.
కాంట్రిబ్యూషన్ పెంచుకునే అవకాశం: స్కీమ్‌లో చేరేటప్పుడు తక్కువ అమౌంట్ ఎంచుకున్నప్పటికీ.. భవిష్యత్‌లో పెన్షన్ పెంచుకోవాలనుకుంటే దానికి తగినట్లుగా వెసులుబాటు కూడా ఉంది. అలాగే తగ్గించుకోవాలనుకున్నా తగ్గించుకునే ఆప్షన్ కూడా ఉంది. అయితే ఈ ఆప్షన్ ఏడాదికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే కాంట్రిబ్యూషన్ పెంచుకోవాలనుకుంటే ఆ సమయంలో మీ వయసును బట్టి చెల్లింపులు పెరుగుతాయి.
దరఖాస్తు ఎలా?: పోస్టాఫీసు సహా అన్ని జాతీయ బ్యాంకుల్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఖాతాను తెరవాలంటే అప్లికేషన్ ఫారంను బ్యాంక్‌కు అందించాలి. వీటిని ఆన్‌లైన్‌లోనైనా లేదా బ్యాంక్‌కు వెళ్లి తీసుకోవచ్చు. అందులో అడిగిన వివరాలన్నింటినీ పొందుపరిచి బ్యాంక్‌లో అందించాలి. మీ దరఖాస్తును స్వీకరించగానే మీ మొబైల్‌కు మెసేజ్ అందుతుంది.
ఉపసంహరణ నియమాలు: మీకు ఈ పథకం వద్దనుకుంటే 60 ఏళ్లకు ముందే పెన్షన్ పథకం నుంచి వైదొలగొచ్చు. అయితే, అప్పటివరకు కాంట్రిబ్యూట్ చేసిన మొత్తంపై వచ్చిన రాబడిపై వర్తించే ఛార్జీలను తీసివేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే అధికారులు చెల్లిస్తారు. ఒకవేళ పాలసీ తీసుకున్న వ్యక్తి అనారోగ్యం బారినపడినప్పుడు పథకం నుంచి తొలగవచ్చు. అయితే, కొన్ని నిర్ధిష్ట అనారోగ్యాలకు, కొన్ని ప్రత్యేక పరిస్థితులల్లో మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
మరణించినప్పుడు: పాలసీ తీసుకున్న వ్యక్తి 60 సంవత్సరాల కంటే ముందే మరణిస్తే.. ఆ వ్యక్తి ఖాతా కొనసాగుతుంది. కానీ, ఈ ఆప్షన్ జీవిత భాగస్వామికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరణించిన చందాదారుని వయసు 60 ఏళ్లు దాటే వరకు జీవితభాగస్వామి పేరుపై ఆ ఖాతాను కంటిన్యూ చేయవచ్చు. వయసు లిమిట్ దాటిన తర్వాత నుంచి మరణం వరకు లైఫ్ పార్టనర్ పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ ఈ స్కీమ్‌లో జాయిన్ అయిన తర్వాత చందాదారుడు, వారి భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత నామినీకి సుమారు. 1.7 లక్షల నుంచి రూ. 8.5 లక్షల కార్పస్ తిరిగి వస్తుంది. అయితే ఈ అమౌంట్ అనేది మీరు చెల్లించే డబ్బును బట్టి ఉంటుంది.
పెనాల్టీ: కొన్ని పరిస్థితుల కారణంగా ఒక్కోసారి కాంట్రిబ్యూషన్ చేయడం ఆలస్యం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో జరిమానా ఉంటుంది. ఒకవేళ వరుసగా ఆరు నెలల పాటు తమ వాటా చెల్లించకపోతే సదరు ఫించను ఖాతా ఫ్రీజ్ అవుతుంది. అదేవిధంగా సంవత్సరం పాటు చెల్లించనట్లయితే ఆ ఖాతాను డీయాక్టివేట్ చేస్తారు. 24 నెలలు పూర్తైన తర్వాత ఖాతాను మూసివేసి అంతవరకు సేకరించిన మొత్తాన్ని చందాదారునికి అందజేస్తారు.
గ్రామీణులను లక్షాధికారులను చేసే "పథకం" - తక్కువ టైమ్, మనీ బ్యాక్ సౌకర్యం కూడా!
మీ "ఆధార్ కార్డు" పోయిందా? - వెంటనే ఇలా చేయండి! - పొరపాటు జరిగిందంటే ఇబ్బందులు తప్పవు!

