అమెరికా 500% సుంకాల ప్రభావం అంతంతే- భారత్‌కు దన్నుగా దేశీయ మార్కెట్: వ్యాపార్ మండల్
రాజస్థాన్‌లో భారత్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ ఆధ్వర్యంలో వాణిజ్య, పరిశ్రమల సదస్సు- యూఎస్ సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేసిన వ్యాపార వర్గాల ప్రతినిధులు

Published : January 11, 2026 at 2:11 PM IST
Bharat Udyog Vyapar Mandal on US Tariffs : రష్యా చమురును కొనే దేశాలపై అమెరికా 500 శాతం సుంకాల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సుంకాల వల్ల భారత్‌పై ప్రభావం పెద్దగా ఉండదని భారత్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ (బీహెచ్‌యూవీఎం) తేల్చి చెప్పింది. ఈ తరహా సవాళ్లను ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని స్పష్టం చేసింది. ఇలాంటి వాణిజ్య సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవడానికి దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. దేశంలో తయారయ్యే వస్తు, ఉత్పత్తులకు మెరుగైన వేదికలను కల్పిస్తే, ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే సామర్థ్యం దేశీయ మార్కెట్‌కు లభిస్తుందని సూచించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ‘భారత్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్’ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ వాణిజ్య, పరిశ్రమల సదస్సు (ఎన్‌సీటీఐ)లో వ్యాపార వర్గాల ప్రతినిధులు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
500 శాతం సుంకాలు VS ఎన్‌సీటీఐ సదస్సు
భారతదేశపు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో అమెరికా ఒకటి. మన దేశం నుంచి ఏటా భారీగా అమెరికాకు వస్తు, ఉత్పత్తుల ఎగుమతులు జరుగుతుండేవి. అమెరికాలోని డొనాల్డ్ ట్రంప్ సర్కారు భారత్‌పై గతేడాది 50 శాతం అదనపు దిగుమతి సుంకాలను విధించడంతో ఈ వ్యాపారం తగ్గిపోయింది. భారత్, చైనా, బ్రెజిల్‌లు రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తుండటంపై ట్రంప్ సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈనేపథ్యంలో రష్యా నుంచి చమురును కొనే దేశాలపై 500 శాతం సుంకాలను విధించే ప్రతిపాదనతో కూడిన 'యూఎస్ సాంక్షనింగ్ రష్యా చట్టం 2025'ను జనవరి 8న ప్రెసిడెంట్ ట్రంప్ ఆమోదించారు. ఈనేపథ్యంలో రాజస్థాన్‌లోని జైపూర్ నగరం వేదికగా 'భారత్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్' ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వాణిజ్య, పరిశ్రమల సదస్సు (ఎన్‌సీటీఐ) ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఎన్‌సీటీఐ సదస్సులో వ్యాపార వర్గాలు చర్చించే అంశాలివీ
- వోకల్ ఫర్ లోకల్, దేశీయ ఉత్పత్తులు, వాణిజ్యం, పర్యాటక రంగంపై చర్చ
- దేశంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం
- గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పనులను ప్రోత్సహించడం, ఆర్థిక మద్దతు అందించడం
- చిన్న, మధ్య తరహా సంస్థలకు స్థిరమైన మార్కెట్ లభించేలా ఏర్పాట్లు
- ఈ-కామర్స్ మార్కెట్‌తో పోటీపడేలా సంప్రదాయ వ్యాపారాలకు సాంకేతిక, డిజిటల్ చేదోడును అందించడం
- కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక, వాణిజ్య చట్టాలలో సవరణలకు ప్రతిపాదనల రూపకల్పన
కొన్ని దిద్దుబాటులతో అమెరికా సుంకాలను ఎదుర్కోవచ్చు
'అమెరికా 500 శాతం సుంకాలను ఎదుర్కొనే సత్తా మన దేశానికి ఉంది. ఎందుకంటే మన దేశీయ మార్కెట్ చాలా పెద్దది. దేశ జనాభా చాలా ఎక్కువ. భారత ప్రజల కొనుగోలు శక్తి, తలసరి ఆదాయాలు తక్కువగానే ఉన్నా, జనాభా ఎక్కువగా ఉండటం మన అడ్వాంటేజీ. అమెరికా సుంకాలను మనం ధీటుగా ఎదుర్కోవాలంటే, భారత ప్రభుత్వం పారిశ్రామిక, వాణిజ్య చట్టాలలో కొన్ని సంస్కరణలు చేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ మార్కెట్‌తో పోటీపడేలా సంప్రదాయ వ్యాపారాలకు సాంకేతిక, డిజిటల్ చేదోడును అందించాలి. చిన్న, మధ్య తరహా సంస్థలకు స్థిరమైన మార్కెట్ లభించేలా ఏర్పాట్లు చేయాలి. మనదేశంలో గ్రామాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి పనులు చేసుకునే వారిని ప్రోత్సహించాలి. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఫలితంగా అక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. పర్యవసానంగా గ్రామీణ ప్రాంతాల్లో వస్తు, ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతాయి' అని భారత్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ జాతీయ అధ్యక్షుడు బాబులాల్ గుప్తా పేర్కొన్నారు.
చట్టాలకు సవరణలను ప్రతిపాదిస్తాం
'మన దేశ ఆర్థిక వృద్ధి కోసం సంస్కృతి, వారసత్వం, వాణిజ్యాన్ని సమన్వయం చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జానపద సంస్కృతి, హస్తకళలు, పర్యాటక ప్రదేశాల ద్వారా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలి. జీఎస్‌టీ, వినియోగదారుల వ్యవహారాల సమస్యలతో పాటు మార్కెట్ రుసుములపై జాతీయ విధానాన్ని రూపొందించాలి. పరిశ్రమ, వాణిజ్య విధానాలతో ముడిపడిన వివిధ అంశాలను చర్చించడానికి భారత్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల సమావేశాన్ని నిర్వహించాం. ఈ సమావేశంలో మేం చర్చించే అంశాల ప్రాతిపదికన, పలు కేంద్ర ప్రభుత్వ వాణిజ్య, పారిశ్రామిక చట్టాలకు మేం సవరణలను ప్రతిపాదిస్తాం. వాటిని ప్రభుత్వానికి అందిస్తాం' అని భారత్ ఉద్యోగ్ వ్యాపార్ మండల్ జాతీయ అధ్యక్షుడు బాబులాల్ గుప్తా తెలిపారు.
భారత్, అమెరికా సంబంధాలు పట్టాలు తప్పాయ్
'భారత్, అమెరికా సంబంధాలు పట్టాలు తప్పినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య పరిస్థితులు సరిగ్గా లేవని స్పష్టంగా తెలుస్తోంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన కొత్తలో భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ట్రంప్ భారత్ వ్యతిరేక వైఖరిని తీసుకున్నారు. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఇరుదేశాలలో పరస్పర విశ్వాస లేమి కనిపిస్తోంది' అని అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ప్రాక్టీస్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న జోషువా టి వైట్ విశ్లేషించారు.
ఆశలన్నీ ఆవిరి, అంచనాలన్నీ తారుమారు
'ప్రెసిడెంట్ ట్రంప్‌పై భారత్ పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. భారత్‌కు అమెరికా నుంచి పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. అమెరికా మార్కెట్లో భారత ఎగుమతుల పోటీతత్వం తగ్గింది. వస్త్రాలు, ఔషధాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆభరణాల తయారీతో ముడిపడిన భారతీయ పరిశ్రమలపై దీని ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందాలు ఆగిపోయాయి. పెట్టుబడిదారుల విశ్వాసానికి విఘాతం కలిగింది. వెరసి భారతదేశానికి ఆర్థికపరమైన చిక్కులు ఏర్పడ్డాయి' అని దక్షిణాసియా వ్యవహారాల నిపుణుడైన మాజీ వైట్ హౌస్ అధికారి ఒకరు పేర్కొన్నారు.

