ఆధార్ PVC కార్డు ధరలు పెంపు- పైగా పన్నులు కూడా!- జనవరి నుంచే అమల్లోకి
ఆధార్ పీవీసీ కార్డు ధరలు పెంచిన యూఐడీఏఐ- పూర్తి వివరాలు మీ కోసం!

Published : January 6, 2026 at 4:16 PM IST
Aadhaar PVC Card Price Hiked : ఆధార్ పీవీసీ కార్డు ధర పెంచుతూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మైఆధార్ పోర్టల్ లేదా ఎంఆధార్ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే ఆధార్ పీవీసీ కార్డులకు ఈ ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సవరించిన ధరలు 2026 జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
ఆధార్ పీవీసీ కార్డు ఉపయోగాలు ఏంటి?
ఆధార్ పీవీసీ కార్డు అనేది మెరుగైన భద్రతా ఫీచర్లు కలిగి ఉంటుంది. అయితే దీని ధరను ప్రస్తుతమున్న రూ.50ల నుంచి రూ.75లకు (పన్నులతో సహా) పెంచారు. యూఐడీఏఐ సర్క్యులర్ ప్రకారం, గత కొన్నేళ్లుగా ఆధార్ పీవీసీ కార్డు తయారీకి, పంపిణీకి అవసరమైన ముడి పదార్థాలు, ప్రింటింగ్, సురక్షిత డెలివరీ, సంబంధిత లాజిస్టిక్స్ ఖర్చులు బాగా పెరిగాయి. అందుకే పెరుగుతున్న నిర్వహణ వ్యయాలను దృష్టిలో ఉంచుకొని, నాణ్యమైన సేవలను అందించే లక్ష్యంతో, ఆధార్ పీవీసీ కార్డు రుసుమును పెంచడం జరిగింది.
అసలు ఆధార్‌కు, పీవీసీ కార్డుకు ఏమైనా తేడాలు ఉంటాయా?
లేదు. ఆధార్ పీవీసీ కార్డు కేవలం ఒక మన్నికైన, కాంపాక్ట్ కార్డు మాత్రమే. ఇది ఈ-ఆధార్, పేపర్ ఆధార్ల లానే ఉంటుంది. వాటితో సమానంగా చెల్లుబాటు అవుతుంది. ఈ ఆధార్ పీవీసీ కార్డు సర్వీస్‌ను 2020లో ప్రారంభించారు.
కొత్త కార్డు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది?
యూజర్లు కనుక కొత్త ఆధార్ పీవీసీ కార్డు కోసం ఆర్డర్ చేస్తే, యూఐడీఏఐ దాన్ని 5 పని దినాల్లోపు ముద్రించి పోస్టల్ డిపార్ట్మెంట్కు అందిస్తుంది. ఆధార్ పీవీసీ కార్డు, ఆధార్ డేటాబేస్‌లో నమోదు చేసిన చిరునామాకు ఇండియా పోస్టు- స్పీడ్ పోస్టు ద్వారా డెలివరీ చేస్తుంది.
UIDAI ఎప్పుడు ప్రారంభమైంది?
యూఐడీఏఐ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నలజీ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. దీనిని 2009లో స్థాపించారు. భారతీయులకు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య అయిన ఆధార్‌ను ఇది జారీ చేస్తుంది. ఈ ఆధార్ వ్యక్తుల గుర్తింపు, చిరునామా రుజువుగా పనిచేస్తుంది. ప్రభుత్వ సబ్సిడీలు, బ్యాంకింగ్, పన్నులు, మొబైల్ కనెక్షన్లతో సహా అన్ని రకారల ప్రభుత్వ, ప్రైవేటు సేవలకు ఉపయోగపడుతుంది. ఈ ఆధార్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద బయోమెట్రిక్ ఐడీ వ్యవస్థగా ఉంది. వినియోగదారుల భద్రత, సౌలభ్యాన్ని పెంచడానికి యూఐడీఏఐ ఎప్పటికప్పుడు తన సేవలను నవీకరిస్తూనే ఉంది.
కొత్త ఆధార్ పీవీసీ కార్డు కోసం ఎలా అప్లై చేయాలి?
- ముందుగా మీరు యూఐడీఏఐ అధికారిక పోర్టల్ https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
- 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు' సర్వీస్‌పై క్లిక్ చేయాలి
- తరువాత మీ 12 అంకెల ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- తరువాత సెక్యూరిటీ కోడ్‌ను/ క్యాప్చాను ఎంటర్ చేయాలి.
- అప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి.
- ఒక వేళ మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కాకపోయి ఉంటే, మీ మొబైల్‌ను ఓటీపీ ద్వారా వ్యాలిడేట్ చేయాలి.
- నియమ, నిబంధనలు అన్నీ చదివిన తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి
- తరువాత రూ.75 రుసుమును యూపీఐ లేదా కార్డు లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.
- పేమెంట్ సక్సెస్ అయిన తరువాత, కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
- అందుల మీకు ఒక 'సర్వీస్ రిక్వెస్ట్ నంబర్' (SRN) వస్తుంది. దాన్ని నోట్ చేసుకోవాలి. అంతే సింపుల్!
- తరువాత మీకు ఎస్ఎంఎస్ ద్వారా AWB నంబర్ వస్తుంది.
- ఈ నంబర్ ద్వారా మీ డెలివరీ స్టేటస్‌ను ఇండియా పోస్ట్ వెబ్సైట్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
- మీకు నిర్దేశిత సమయంలోపు స్పీడ్ పోస్టు ద్వారా ఆధార్ పీవీసీ కార్డు వస్తుంది.
ఇకపై రూపాయిల్లోనే భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం : ఎస్బీఐ
అమెరికా-వెనెజువెలా ఉద్రిక్తతలు - భారత చమురు దిగుమతులపై ప్రభావమెంత?

