భారత్‌లోకి భారీగా పెట్టుబడులు- 'AI డిక్లరేషన్'కు 88 దేశాల సంతకాలు: అశ్వినీ వైష్ణవ్
దిల్లీ వేదికగా జరిగిన 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో దిల్లీ డిక్లరేషన్‌కు ఏకగ్రీవ ఆమోదం

Published : February 21, 2026 at 8:35 PM IST
Ashwini Vaishnaw On AI Summit : కృత్రిమ మేధ భవిష్యత్తుపై అంతర్జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది. భారత్ నేతృత్వంలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో రూపొందించిన 'దిల్లీ డిక్లరేషన్' కు ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యాతో సహా మొత్తం 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు తమ మద్దతును తెలిపినట్లు కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏఐ లక్ష్యాల సహకారంలో ఇదొక మైలురాయిగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు దిల్లీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
ప్రధాని మోదీ ప్రతిపాదించిన "హ్యూమన్-సెంట్రిక్ ఏఐ" విజన్‌ను ప్రపంచ దేశాలు స్వీకరించాయని కేంద్ర మంత్రి వివరించారు. ఏఐ సాంకేతికత ప్రయోజనాలు కేవలం కొద్ది దేశాలకు లేదా సంస్థలకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అందేలా చేయాలని అన్ని దేశాలు అంగీకరించాయని ఆయన తెలిపారు. భారతీయ సంస్కృతిలో మూల సూత్రమైన 'సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' అనే మంత్రాన్ని ఏఐ టెక్నాలజీ అమలులో అంతర్జాతీయ సూత్రంగా ఈ సదస్సు గుర్తించించినట్లు చెప్పారు. అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, ఇటలీ, ఇజ్రాయెల్, జర్మనీ, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్, వంటి దేశాలు ఈ డిక్లరేషన్‌పై సంతకాలు చేశాయి. పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, భూటాన్ కూడా ఇందులో భాగస్వాములయ్యాయి.
88 countries and international organisatons have signed the AI Impact Summit Declaration. Entire world has endorsed PM @narendramodi Ji’s human-centric vision of AI.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 21, 2026
The declaration is inspired by the principle of ‘Sarvajana Hitaya, Sarvajana Sukhaya’, for democratising AI… pic.twitter.com/dnnNTIMysl
"దిల్లీలో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026' అంతర్జాతీయ సహకారంలో ఒక మైలురాయిని అధిగమించింది. 'దిల్లీ డిక్లరేషన్ ఆన్ ఏఐ ఇంపాక్ట్' ఏకగ్రీవ ఆమోదంతో ముగిసింది. ఆర్థిక వృద్ధి, సామాజిక శ్రేయస్సు కోసం ఏఐని వినియోగించుకోవడంలో అంతర్జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తం 88 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ డిక్లరేషన్‌ను ఆమోదించాయి."
- కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రపంచ దేశాలన్నీ ఏకగ్రీవంగా భారత్ పక్షాన నిలవడం గర్వకారణంగా ఉందని మంత్రి తెలిపారు. ఏఐ వనరులను కేవలం కొన్ని ధనిక దేశాలు లేదా కొన్ని కార్పొరేట్ సంస్థలకే పరిమితం చేయకుండా, వాటిని ప్రజాస్వామ్యబద్ధం చేయాలని తాము కోరినట్లు చెప్పారు. ఈ సాంకేతికత ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రపంచంలోని ప్రతి మూలకు చేరాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ దార్శనికతను ప్రపంచం ఇప్పుడు అధికారికంగా ఆమోదించిందన్నారు.
గ్లోబల్ సౌత్ నుంచి తొలి అడుగు
ఏఐ సాంకేతికతపై సాధారణంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోనే చర్చలు జరుగుతుంటాయి. అయితే, గ్లోబల్ సౌత్ నుంచి ఇటువంటి భారీ ఏఐ సదస్సును నిర్వహించిన ఘనత భారత్‌కు దక్కింది. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను, అక్కడ ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఏఐ పాలన, భద్రత వంటి అంశాలపై దిల్లీ వేదికగా విస్తృతమైన చర్చలు జరిగాయి. ఈ సదస్సు కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలే కాకుండా, ప్రపంచ ప్రసిద్ధ టెక్నాలజీ కంపెనీల నిపుణులు, ఇన్నోవేటర్లు, సివిల్ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి స్టార్టప్ వ్యవస్థాపకులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించి, భారతీయ మేధాశక్తిని ప్రపంచానికి పరిచయం చేశారు.
ఏఐ సదస్సులో ప్రధానంగా చర్చించిన అంశాలు ఇవే!
• ఏఐ వల్ల తలెత్తే ముప్పులను ఎలా అరికట్టాలి? డీప్ ఫేక్స్ వంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై సభ్య దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి.
• విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఏఐని సామాన్యుడికి ఉపయోగపడేలా ఎలా మార్చాలి? అనే అంశంపై దృష్టి సారించారు.
• ఏఐ రాకతో ఉపాధి కోల్పోయే ప్రమాదం లేకుండా, ప్రజలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఎలా అందించాలి? అనే దానిపై రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు.
• ఏఐ అల్గారిథమ్స్ పారదర్శకంగా ఉండాలని, ఎటువంటి వివక్షకు తావు ఇవ్వకూడదని డిక్లరేషన్‌లో స్పష్టం చేశారు.

