బంగారం, వెండి ధరలకు రెక్కలు- ఒక్కరోజులోనే భారీ పెరుగుదల- ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు వివరాలు మీకోసం!

Published : June 3, 2026 at 9:37 AM IST
Gold Rate Today : దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్-రూపాయి మారకపు విలువల్లో మార్పులు వంటి కారణాలతో విలువైన లోహాల ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు, పెట్టుబడిదారులు తాజా ధరలపై దృష్టి సారిస్తున్నారు.
క్యాప్స్ గోల్డ్ వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,470కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం, ప్రొద్దుటూరు మార్కెట్లలో అదే పరిమాణంలోని బంగారం రూ.1,60,370 వద్ద నమోదైంది. గత రోజు ధరతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.1,120 మేర పెరుగుదల కనిపించింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,43,190గా ఉంది.
వెండి ధరల్లోనూ జోరు
బంగారం ధరల పెరుగుదలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.2,69,731కు చేరింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ.2,65,950గా ఉన్న వెండి ధర ఒక్కరోజులోనే రూ.3,781 పెరగడం గమనార్హం. ఇటీవల కాలంలో వెండి ధరలు కూడా బంగారం తరహాలోనే తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి.
నోట్- బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలు చేసేముందు ధరలు పరిశీలించుకోవాలి.
అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణం
బంగారం, వెండి ధరల మార్పుల్లో ప్రపంచ మార్కెట్ల పాత్ర కీలకమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు వంటి అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు దేశీయ మార్కెట్‌లో కూడా అదే ప్రభావం కనిపిస్తుంది. అలాగే ధరలు తగ్గితే దేశీయంగా కూడా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. భారత్ అవసరాలకు గాను వినియోగించే బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి దిగుమతి అవుతుండటంతో అంతర్జాతీయ ధరల మార్పులు నేరుగా దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎందుకు ముఖ్యం?
బంగారం కొనుగోలు సమయంలో ధరతో పాటు దాని స్వచ్ఛతను కూడా పరిశీలించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బంగారం నాణ్యతను క్యారెట్ల ఆధారంగా అంచనా వేస్తారు. 24 క్యారెట్ల బంగారం దాదాపు 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉండి అత్యంత శుద్ధమైనదిగా పరిగణిస్తారు. అయితే ఇది చాలా మెత్తగా ఉండటంతో నగల తయారీలో ఎక్కువగా ఉపయోగించరు. బంగారు నాణేలు, బార్లు, పెట్టుబడి ఉత్పత్తుల తయారీలో దీనికి ప్రాధాన్యం ఉంటుంది. మరోవైపు 22 క్యారెట్ల బంగారంలో వెండి, రాగి వంటి ఇతర లోహాలను స్వల్పంగా కలపడం వల్ల అది మరింత బలంగా మారుతుంది. అందుకే ఆభరణాల తయారీలో ప్రధానంగా 22 క్యారెట్ల బంగారాన్నే వినియోగిస్తారు. భారత మార్కెట్‌లో విక్రయించే చాలా బంగారు ఆభరణాలపై కనిపించే 916 హాల్‌మార్క్ 22 క్యారెట్ల స్వచ్ఛతకు గుర్తుగా పరిగణించబడుతుంది.
కొనుగోలు ముందు ఇవి తప్పనిసరిగా పరిశీలించాలి
బంగారం ధరలు ప్రకటించినప్పుడు సాధారణంగా గ్రాము లేదా 10 గ్రాముల ప్రాథమిక ధర మాత్రమే వెల్లడవుతుంది. అయితే తుది బిల్లులో జీఎస్‌టితో పాటు మేకింగ్ ఛార్జీలు, హాల్‌మార్కింగ్ ఖర్చులు, ఇతర పన్నులు కూడా జత అవుతాయి. దీంతో వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం ప్రకటించిన ధర కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వివిధ నగల దుకాణాల్లో మేకింగ్ ఛార్జీలు, తరుగు రేట్లు భిన్నంగా ఉండవచ్చు. అందువల్ల కేవలం బంగారం గ్రాము ధరను మాత్రమే కాకుండా మొత్తం బిల్లులోని అన్ని అంశాలను పరిశీలించి కొనుగోలు నిర్ణయం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

