NCERT వివాదం- బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి
న్యాయవ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్- ఆర్ఎస్ఎస్ పాత్రపై విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్

Published : February 26, 2026 at 5:05 PM IST
Education Minister On NCERT Row : ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలోని అవినీతి' గురించి ఒక అధ్యాయం చేర్చడంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ వివాదాస్పద అంశాన్ని పిల్లల పాఠ్యాంశంగా రూపొందించిన వారిని బాధ్యులుగా చేస్తామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం పేర్కొన్నారు. ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవం ఉందని, ఆ వ్యవస్థను అగౌరవపరిచే ఉద్దేశం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసే ఒక సంఘటిత కుట్ర జరిగినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ కీలక ప్రకటన చేయడం గమనార్హం.
#WATCH | Jamshedpur, Jharkhand: Union Education Minister Dharmendra Pradhan says, " we respect the judiciary. whatever happened is unfortunate. i express regret on behalf of the govt as well as on a personal level. as soon as i came to know 2 days back, i directed the ncert to… pic.twitter.com/T4boFCX5ZE
— ANI (@ANI) February 26, 2026
బీజేపీ స్టాండ్ ఇదే!
మరోవైపు బీజేపీ కూడా ఈ అంశంపై స్పందించింది. ఎన్సీఈఆర్టీ పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఉన్న వివాదాస్పద అధ్యయాన్ని 'సున్నితమైన అంశంగా' అభివర్ణించింది. తాము దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తామని, దాని నిష్పాక్షిక పనితీరు పట్ల గర్విస్తున్నామని పేర్కొంది.
"ఇది చాలా సున్నితమైన అంశం. పార్టీ ప్రతినిధిగా నేను ఒక విషయం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. భారత్‌లోనే కాకుండా ప్రపంచం మొత్తంలో భారత న్యాయవ్యవస్థ అంత స్వతంత్రమైనది, అర్హత కలిగినది మరెక్కడా లేదని నేను చెబుతాను. భారత న్యాయవ్యవస్థ పట్ల మనందరికీ ఎంతో గౌరవం, గర్వం ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరి హృదయంలోని భావన."
- సంబిత్ పాత్ర, బీజేపీ జాతీయ ప్రతినిధి
బుధవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు, ప్రభుత్వం న్యాయవ్యవస్థకు అండగా ఉంటుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని సంబిత్ పాత్ర గుర్తుచేశారు.
ఆ పుస్తకంపై నిషేధం
వివాదాస్పద ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సామాజిక శాస్త్ర పుస్తకంలో అవినీతి, భారీగా పేరుకుపోయిన కేసులు, సరిపడా సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వంటివి న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లుగా పేర్కొన్నారు. అంతేకాదు న్యాయవ్యవస్థలో అవినీతి అనే సబ్ఛాప్టర్ను చేర్చారు. ఇదే తీవ్ర వివాదానికి దారి తీసింది. అందుకే ఈ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు పూర్తిస్థాయి నిషేధం విధించింది. అంతేకాదు ఫిజికల్, డిజిటల్ రూపంలో ఉన్న అన్ని కాపీలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది.
తాము రూపొందించిన 8వ తరగతి పాఠ్యపుస్తకంలో 'అనుచిత కంటెంట్ ఉండడం'పై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) క్షమాపణలు చెప్పింది. సదరు పాఠ్యాంశాన్ని తొలగిస్తామని పేర్కొంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్, "వారు తుపాకీతో కాల్చారు. న్యాయవ్యవస్థ రక్తమోడుతోంది" అంటూ ఎన్సీఈఆర్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
RSS పాత్రపై విచారణ చేయాలి!
మరోవైపు ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో 'న్యాయవ్యవస్థలోని అవినీతి' అంశాన్ని చేర్చడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ సమర్థించారు. గత దశాబ్ద కాలంగా పాఠ్యపుస్తకాల రూపకల్పనలో 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్' (ఆర్ఎస్ఎస్) సాగించిన 'దుర్మార్గపు, ద్వేషపూరిత చర్యల'పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
NCERT की पाठ्यपुस्तकों में न्यायपालिका को लेकर किए गए आलोचनात्मक उल्लेखों पर सुप्रीम कोर्ट का आक्रोश जायज़ है। दरअसल, पिछले एक दशक में जिस तरह NCERT की पाठ्यपुस्तकों को दोबारा लिखा गया है, वह शर्मनाक है। यह आरएसएस की कुत्सित और दुर्भावना से प्रेरित कार्य है। असल में, इस पूरे…
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 26, 2026
"ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో న్యాయవ్యవస్థపై ఉన్న విమర్శనాత్మక ప్రస్తావనల పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం సరైనదే. నిజానికి గత దశాబ్దకాలంగా ఈ పుస్తకాలను తిరిగి రాసిన తీరు సిగ్గుచేటు. ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్న దుర్మార్గపు, కుట్రపూరితమైన పని. వాస్తవానికి ఈ మొత్తం ముఠాపై విచారణ జరగాలి."
- జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎక్స్ పోస్ట్
వారికి షోకాజ్ నోటీసులు
పిల్లల పాఠ్యపుస్తకంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి' అనే ఉప-అధ్యాయాన్ని చేర్చినందుకు విద్యామంత్రిత్వశాఖ కార్యదర్శికి, ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీకి సుప్రీంకోర్టు గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కార చర్యలు, ఇతర చట్టాల కింద వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కోరింది.
#WATCH | Delhi | On SC's show cause notices to the Secretary of the Department of Education and Literacy (Ministry of Education) and to NCERT Director Dr Dinesh Prashad Saklani, Advocate Ashwini Upadhyay says, “If the NCERT wants to add a chapter to the textbook of class 8, it… pic.twitter.com/tPGEE79RFR
— ANI (@ANI) February 26, 2026
వాస్తవానికి ఇప్పటికే ఎన్సీఈఆర్టీ క్షమాపణలు చెప్పినప్పటికీ, ఈ అంశంపై సుమోటోగా చేపట్టిన విచారణను నిలిపివేయడానికి నిరాకరించింది. అంతేకాదు ఈ ఉత్తర్వులు ఉల్లంఘించే ఏ ప్రయత్నమైనా న్యాయపరిపాలనలో నేరుగా జోక్యం చేసుకున్నట్లు, కోర్టు ధిక్కారచర్యలు చేపట్టినట్లే భావిస్తామని హెచ్చరించింది.
సదరు వివాదాస్పద అధ్యాయాన్ని ఆమోదించిన టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్స్ కమిటీకి సంబంధించిన పూర్తి రికార్డులను సమర్పించాలని సుప్రీంకోర్టు ఎన్సీఈఆర్టీని ఆదేశించింది. ముఖ్యంగా ఆ పాఠ్యాంశ రూపకల్పన బృందంలోని సభ్యుల పేర్లు, వారి అర్హతలు, ఇతర వివరాలను అందజేయాలని స్పష్టం చేసింది.
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు పూర్తి బాధ్యత వహించడం తప్పనిసరి: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఎప్స్టీన్ ఫైల్స్‌తో అమెరికా ఒత్తిడి- ట్రేడ్ డీల్ వల్ల మన రైతులే బలి : రాహుల్ గాంధీ

