జేడీయూ కొత్త బాస్ ఎవరు? పార్టీ సారథిగా నీతీశే కొనసాగుతారా? కుమారుడు నిశాంత్‌కు పట్టాభిషేకం చేస్తారా?
జేడీయూ జాతీయ అధ్యక్షుడి ఎన్నికపై ఉత్కంఠ- ఆ పదవిని చేపట్టే వారే సీఎం నీతీశ్ రాజకీయ వారసుడు? రేసులో కర్పూరి రామ్‌నాథ్ ఠాకూర్- నీతీశ్ కుమారుడు నిశాంత్‌కు ఛాన్స్ ఇవ్వాలంటున్న జేడీయూ క్యాడర్

Published : January 10, 2026 at 4:46 PM IST
Who Is Nitish Kumars Successor : ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా బిహార్ సీఎం నీతీశ్ కుమార్ చక్రం తిప్పుతున్నారు. ఈనేపథ్యంలో ఆయన సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో జరిగే ప్రతీ పరిణామాన్నీ యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది. త్వరలోనే జేడీయూ జాతీయ, రాష్ట్ర అధ్యక్ష పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా సీఎం నీతీశ్ వ్యవహరిస్తున్నారు. ఆయన స్థానంలో ఈ పదవిలోకి వచ్చే వ్యక్తే ఆయన రాజకీయ వారసుడు అవుతాడనే టాక్ వినిపిస్తోంది. ఈ రెండు పార్టీ పదవుల్లో ఏదో ఒకటి నీతీశ్ కుమారుడు నిశాంత్‌కు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ జేడీయూలో ఎలాంటి కీలక మార్పులు జరగబోతున్నాయి ? నీతీశ్ రాజకీయ వారసుడు ఎవరు ? నిశాంత్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమేనా ? పార్టీ పదవుల రేసులో ఉన్న ముఖ్య నేతలు ఎవరు ? ఈ కథనంలో చూద్దాం.
నీతీశ్ చుట్టే బిహార్ పాలిటిక్స్
గత 20 ఏళ్లుగా బిహార్ అధికార పీఠంపై జేడీయూ పార్టీ ఉంది. జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ చుట్టే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆయన ఏ కూటమికి మద్దతు ఇస్తే, అదే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. నీతీశే సీఎం కూడా అవుతున్నారు. జేడీయూకు బిహార్‌లో 12 మంది లోక్‌సభ ఎంపీలు, నలుగురు రాజ్యసభ ఎంపీలు, 85 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. పొరుగు రాష్ట్రం జార్ఖండ్‌లోనూ జేడీయూకు 1 ఎమ్మెల్యే ఉన్నారు.
2022 నుంచి 2023 డిసెంబరు వరకు జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా లలన్ సింగ్ వ్యవహరించారు. 2023 డిసెంబరులో లలన్‌ను తప్పించి, స్వయంగా నీతీశ్ కుమార్ జేడీయూ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బిహార్‌లో జేడీయూ, బీజేపీలతో కూడిన ఎన్‌డీఏ కూటమి సత్తా చాటింది. కేంద్రంలోనూ ఎన్‌డీఏ కూటమి సర్కారు ఏర్పడింది. జేడీయూ జాతీయ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన లలన్ సింగ్, సీఎం నీతీశ్ సిఫారసుతో 2024 జూన్‌లో కేంద్ర మంత్రి అయ్యారు. ప్రస్తుతం పార్టీ నేషనల్ ప్రెసిడెంట్‌గా నీతీశ్ కొనసాగుతున్నారు. జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సంజయ్ ఝా వ్యవహరిస్తున్నారు.
జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడికి ప్రమోషన్ ?
ప్రస్తుతం జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉమేశ్ సింగ్ కుశ్వాహ వ్యవహరిస్తున్నారు. 2021 నుంచి ఆయనే ఈ పదవిలో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ విజయంలో ఉమేశ్ కీలక పాత్ర పోషించారు. మహనార్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అందుకే ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలని సీఎం నీతీశ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయనకు మంత్రి పదవిని ఇస్తారని జేడీయూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి రెండోవారం నుంచి ఏప్రిల్ మూడోవారం మధ్యలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణతో పాటు 5 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపాయి.
జనవరి 15 తర్వాత పార్టీ పదవుల భర్తీ
2025 అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ఘన విజయంతో జేడీయూ శ్రేణులు ఉత్సాహంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1 కోటి సభ్యత్వాల నమోదు లక్ష్యంగా జేడీయూ సభ్యత్వ నమోదు డ్రైవ్ కొనసాగుతోంది. జనవరి 15లోగా ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సీఎం నీతీశ్ నిర్దేశించారు. ఆ తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికల తేదీలపై ప్రకటనలు చేయనున్నారు. ఆయా తేదీల్లో గ్రామ పంచాయతీ, బ్లాక్, మండల, పట్టణ/నగర, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో పార్టీ పదవుల భర్తీ కోసం ఎన్నికలు జరుగుతాయి. జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ? జాతీయ అధ్యక్షుడు ఎవరు ? అనేది ఈ ఎన్నికల్లోనే నిర్ణయమవుతుంది. సీఎం నీతీశ్ విశ్వసించే వ్యక్తులకే ఈ రెండు కీలక పదవులు దక్కుతాయి.
రేసులో ఎవరు ?
- రామ్‌నాథ్ ఠాకూర్ : జేడీయూ జాతీయ అధ్యక్ష పదవి కోసం జన్ నాయక్ కర్పూరి ఠాకూర్ కుమారుడు రామ్‌నాథ్ ఠాకూర్ పేరును సీఎం నీతీశ్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈయన జేడీయూ కోటాలో కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రామ్‌నాథ్ ఠాకూర్ రాజ్యసభ సభ్యత్వం ఈ సంవత్సరమే ముగియనుంది. ఈనేపథ్యంలో ఆయనకు జేడీయూ జాతీయ స్థాయి పగ్గాలను అప్పగించే అంశం నీతీశ్ పరిశీలనలో ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
- మనీశ్ వర్మ : జేడీయూలో చేరిన ఐఏఎస్ అధికారి మనీశ్ వర్మ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్నారు. ఆయనకు రాష్ట్ర స్థాయి లేదా జాతీయ స్థాయిలో కొత్త బాధ్యతలను అప్పగిస్తారనే టాక్ వినిపిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు, 2025 అసెంబ్లీ ఎన్నికల టైంలో క్షేత్రస్థాయిలో జేడీయూ బలోపేతంలో మనీశ్ ముఖ్య పాత్ర పోషించారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పార్టీ క్యాడర్‌ను చైతన్యవంతం చేశారు.
- చంద్రేశ్వర్ ప్రసాద్ : సీఎం నీతీశ్ సన్నిహితుడిగా పేరొందిన చంద్రేశ్వర్ ప్రసాద్ చంద్రవంశీ కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నారని అంటున్నారు. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జహానాబాద్ అసెంబ్లీ స్థానంలో ఆర్‌జేడీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడం చంద్రేశ్వర్‌కు మైనస్ పాయింట్‌గా మారొచ్చు.
- నిశాంత్ కుమార్ : సీఎం నీతీశ్ కుమారుడు నిశాంత్ కుమార్ ఇప్పటివరకు తెర వెనుక నుంచి జేడీయూ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేసుకుంటున్నారు. ఆయనకు జేడీయూ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలనే డిమాండ్ పార్టీ క్యాడర్, నీతీశ్ కుటుంబం నుంచి వినిపిస్తోంది. అయితే దీనికి నీతీశ్ ఎలా స్పందిస్తారు ? ఒకవేళ ఈ పదవిని ఇవ్వడానికి నీతీశ్ సిద్ధమైతే నిశాంత్ ఎలా స్పందిస్తారు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
సామాజిక సమీకరణాల ప్రకారమే పదవుల భర్తీ
'సీఎం నీతీశ్ ప్రస్తుతం రాజకీయాల్లో తన చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈనేపథ్యంలో జేడీయూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఇందుకోసం రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త వ్యక్తికి అవకాశం ఇవ్వడం ఖాయం. ఈ పదవిని తన కుమారుడు నిశాంత్‌కు ఇవ్వడానికి నీతీశ్ మొగ్గుచూపక పోవచ్చని జేడీయూ వర్గాలు అంటున్నాయి. గత 20 ఏళ్లుగా జేడీయూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సామాజిక వర్గాలతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేలా పార్టీ పదవుల కూర్పును నీతీశ్ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటివరకు జేడీయూ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఎక్కువసార్లు అగ్రవర్ణాల నేతలే పొందారు. మునుపటి, ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షులు మాత్రమే బీసీ నేతలు. రాష్ట్ర సామాజిక సమీకరణాలకు అనుగుణంగా జేడీయూలో పదవుల భర్తీ జరగొచ్చు' అని రాజకీయ పరిశీలకుడు, ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్ విశ్లేషించారు.
జాతీయ అధ్యక్షుడిగా నీతీశే కొనసాగుతారు
సీఎం నీతీశ్ రాజకీయాల్లో చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నందున ఆయనే జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకుడు అరుణ్ పాండే తెలిపారు.'జేడీయూ క్యాడర్ కూడా అదే కోరుకుంటోంది. ఈ లెక్కన రాష్ట్ర అధ్యక్షుడు మాత్రమే మారే ఛాన్స్ ఉంది. జేడీయూకు అండగా నిలుస్తున్న ప్రధాన ఓటుబ్యాంకులకు పార్టీ పదవుల కేటాయింపులో నీతీశ్ ప్రాధాన్యత ఇస్తారని అనిపిస్తోంది' అని అరుణ్ పాండే పేర్కొన్నారు.
కష్టపడి పనిచేసే నేతలకు జేడీయూలో గుర్తింపు
'మా పార్టీలో పదవుల భర్తీ కోసం ప్రతి మూడేళ్లకోసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అధ్యక్షులను ఎంపిక చేస్తారు. నాకు తదుపరిగా ఏ బాధ్యతను ఇవ్వాలనేది సీఎం నీతీశ్ ఇష్టం. ఆయన ఏ బాధ్యతను అప్పగించినా, జేడీయూ పార్టీ సైనికుడిలా పనిచేస్తాను. కష్టపడి పనిచేసే నేతలకు జేడీయూలో తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది' అని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ కుశ్వాహ పేర్కొన్నారు.

