బంగాల్‌లో ముగిసిన ఎస్ఐఆర్- జాబితా నుంచి 58లక్షలకు పైగా ఓటర్ల తొలగింపు
బంగాల్‌లో తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన భారత ఎన్నికల సంఘం- తుది ఓటర్ల సంఖ్య 7.04 కోట్లుగా పేర్కొన్న ఈసీ

Published : February 28, 2026 at 7:41 PM IST
West Bengal SIR Final List : బంగాల్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ముగిసింది. దీంతో ఈసీ శనివారం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 58,20,899 మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు బంగాల్‌లో మొత్తం 7.66 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం 7.04 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ఈసీ పేర్కొంది. మొత్తం 58 లక్షలకుపైగా ఫారాలు అందలేదని ఈసీ తెలిపింది. 24 లక్షలకు పైగా ఓటర్లు చనిపోయారని వెల్లడించింది. ఇతర కారణాల వల్ల మరికొంత మందిని జాబితా నుంచి తొలగించామని తెలిపింది.
"మొత్తం 58,20,899 ఎన్యూమరేషన్ ఫారమ్‌లు అందలేదు. దాదాపు 24,16,852 మంది మరణించినవారిగా గుర్తించాం. 12,20,039 మంది గైర్హాజరు అయ్యారు. 19,88,076 మంది ఇతర ప్రాంతాలకు మారినట్లు నమోదు అయింది. 1,38,328 మంది ఇప్పటికే ఇతర చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు గుర్తించాం. అదనంగా 57,604 పేర్లు ఇతర కారణాలతో తొలగించాం" అని ఈసీ అధికారులు పేర్కొన్నారు.
2025 డిసెంబర్ 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత, ఫారం-6, 6A ద్వారా 1,82,036 మంది కొత్త ఓటర్లను చేర్చారు. ఫారం-8 ద్వారా 6,671 సవరణలు, చేర్పులు చేశారు. విచారణలో ఉన్న 60,06,675 మంది ఓటర్లను తుది జాబితాలో చేర్చినట్లు ఈసీ వెల్లడించింది. ముసాయిదా జాబితా సమయంలో ఉన్నట్లుగానే లింగ నిష్పత్తి 956 వద్ద కొనసాగుతోందని తెలిపింది.
అర్హులను ఓటరు జాబితాలో చేర్చడమే ఎస్ఐఆర్ లక్ష్యం
మరోవైపు, ఎస్‌ఐఆర్ ప్రధాన లక్ష్యం అర్హులైన ప్రతి ఓటరును చేర్చడం, అనర్హులను పారదర్శకంగా తొలగించడమేనని ఎన్నికల సంఘం పేర్కొంది. 100 శాతం భౌతిక ధృవీకరణ విధానాన్ని అనుసరించినట్లు వెల్లడించింది. బూత్ స్థాయి అధికారులు వ్యక్తిగతంగా ఫారమ్‌ల పంపిణీ, సేకరణ బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపింది. ఈ సమగ్ర ప్రక్రియ ద్వారా మరణించిన వారు, శాశ్వతంగా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారు, డూప్లికేట్ నమోదులు వంటి అనర్హ పేర్లను గుర్తించి తొలగించామని అధికారులు పేర్కొన్నారు.
ఓటర్లు తమ పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని, అవసరమైతే చేర్పు (ఫారం-6/6A), సవరణ (ఫారం-8), తొలగింపు (ఫారం-7) కోసం ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇదిలా ఉండగా, బంగాల్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ రాజకీయ వివాదాలకు దారి తీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం ఈ ప్రక్రియను తీవ్రంగా విమర్శించింది. బీజేపీ, ఈసీ కలిసి కుట్ర పన్నాయని ఆరోపించింది. బంగాల్ ముఖ్యమంత్రి ఈసీ ప్రక్రియపై పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఆమె ఎస్ఐఆర్ ప్రక్రియను విమర్శిస్తూ, 'వృద్ధులు, అనారోగ్యంగా, బలహీనంగా ఉన్నవారిని విచారణలకు రావాలని బలవంతం చేస్తూ ఈసీ వేధిస్తోంది. అర్హులైన ఓటర్లను చనిపోయినట్లుగా చూపిస్తోంది. ఎస్ఐఆర్ కోసం బీజేపీ ఐటీ విభాగం రూపొందించిన యాప్‌ను వాడుతోంది. ఇది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం'అని విమర్శించారు. చివరికి ఆమె సుప్రీం కోర్టును సైతం ఆశ్రయించారు. మరోవైపు, ఎస్‌ఐఆర్ ప్రక్రియతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భయపడుతున్నారని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వివాదం కోర్టుల వరకూ వెళ్లింది. అభ్యంతరాల ధ్రువీకరణ కోసం అదనపు సివిల్ జడ్జిలను నియమించుకోవడానికి సుప్రీంకోర్టు, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అనుమతినిచ్చింది. అవసరమైతే జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల జడ్జిల సహాయం తీసుకోవచ్చని పేర్కొంది. అయితే, జ్యుడీషియల్ అధికారులకు ఎన్నికల సంఘం ఎటువంటి ఆదేశాలు ఇవ్వకుండా నిరోధించాలని బంగాల్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

