ETV Bharat / bharat

'ఆయన్ను బ్లాస్ట్ చేస్తాం'- బంగాల్​ గవర్నర్‌కు బెదిరింపు మెయిల్‌- అధికారులు అలర్ట్

గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌కు పేలుడు బెదిరింపు ఈమెయిల్‌- కోల్‌కతా లోక్​భవన్‌లో కట్టుదిట్టమైన భద్రత- ఈడీ దాడులు, మమత చర్యలపై రాజ్యాంగ వివాదం- బీజేపీ, టీఎంసీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు

Threat To Bengal Governor
Threat To Bengal Governor (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : January 9, 2026 at 7:09 AM IST

3 Min Read
Choose ETV Bharat

Threat To Bengal Governor : బంగాల్‌లో రాజకీయ వాతావరణం రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు, మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్‌ (TMC)–బీజేపీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు- ఇదంతా కొనసాగుతున్న తరుణంలో గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌కు బెదిరింపు ఈమెయిల్‌ రావడం రాష్ట్రంలో కలకలం రేపింది.

బ్లాస్ట్ చేస్తామంటూ బెదిరింపులు
గురువారం అర్ధరాత్రి కోల్‌కతాలోని లోక్‌ భవన్‌లో భద్రతను భారీగా పెంచారు. గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌కు "విల్‌ బ్లాస్ట్‌ హిమ్‌" అంటూ పేలుడు హెచ్చరికతో కూడిన బెదిరింపు ఈమెయిల్‌ అందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ బెదిరింపు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సమాచారం అందించారు. ఇప్పటికే జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన గవర్నర్‌కు అదనపు భద్రత ఏర్పాటు చేశారు.

భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు
ఈ ఘటన అనంతరం గవర్నర్‌ భద్రత బాధ్యతలు నిర్వర్తిస్తున్న సీనియర్‌ అధికారులు అర్ధరాత్రి సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. బెంగాల్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ (CRPF) సిబ్బంది సమన్వయంతో గవర్నర్‌ రక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి బెదిరింపు సందేశాలు వచ్చినట్లు రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈమెయిల్‌ వెనుక ఎవరు ఉన్నారు? ఇది రాజకీయంగా ప్రేరపణా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

గవర్నర్‌కే భద్రత లేకుండా పోయింది: బీజేపీ
ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నాయకుడు అమిత్‌ మాల్వియా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. "మమతా బెనర్జీ పాలనలో గవర్నర్‌కే భద్రత లేకుండా పోయింది. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా కూలిపోయింది" అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, "హోంమంత్రి హోదాలో ఉన్న మమతా బెనర్జీ, బొగ్గు కుంభకోణం, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్‌ సంస్థను కాపాడేందుకు ఈడీ నుంచి కీలక ఫైళ్లను లాక్కునే పనిలో బిజీగా ఉన్నారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బంగాల్​లో హైడ్రామా
ఇదిలా ఉండగా, గురువారం బంగాల్‌లో హైడ్రామా చోటుచేసుకుంది. బొగ్గు అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఈడీ దాడులు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌ (I-PAC) కార్యాలయాలు, దాని చీఫ్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసానికి వెళ్లారు. ఈడీ చర్యలను ప్రశ్నించిన మమతా, పార్టీకి సంబంధించిన హార్డ్‌డిస్కులు, అభ్యర్థుల జాబితాలు, వ్యూహాత్మక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో బీజేపీ- టీఎంసీ మధ్య రాజకీయ పోరు మరింత ముదిరింది. జనవరి 9న కోల్‌కతాలో ఈడీ దాడులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలో నిరసన చేపట్టనున్నట్లు టీఎంసీ ప్రకటించింది. ఈ ఏడాది తొలి భాగంలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజకీయ రంగు పులుముకుంది. ఈ పరిణామాలపై గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

బెదిరించడం, భయపెట్టడం మరింత తీవ్రమైన నేరం!
"ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ అమలుకు సహకరించాలి. ప్రజాసేవకుడు తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం నేరం. అదే విధంగా బెదిరించడం, భయపెట్టడం మరింత తీవ్రమైన నేరం" అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగ హోదాలో ఉన్నారని, ఆమె చర్యలు రాజ్యాంగ పరిధిలో ఉన్నాయా లేదా అన్న అంశంపై నిపుణులతో సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే విషయం న్యాయస్థానంలో ఉన్నందున (సబ్‌జుడిస్‌) తాను తుది వ్యాఖ్య చేయబోనని స్పష్టం చేశారు.

ఈడీ ఇప్పటికే కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. దాడుల సమయంలో అక్రమ జోక్యం జరిగిందని, దర్యాప్తుకు అడ్డంకులు సృష్టించారని ఆరోపిస్తూ కేసు నమోదు చేసింది. ఈడీ ప్రకారం, బొగ్గు అక్రమ రవాణా కేసులో కీలక ఆధారాల కోసం శాంతియుతంగా తనిఖీలు జరుపుతుండగా ముఖ్యమంత్రి, ఆమె సహచరులు, పోలీసు అధికారులు జోక్యం చేసుకున్నారని ఆరోపించింది. ప్రతీక్‌ జైన్‌ నివాసం, ఐ-ప్యాక్‌ కార్యాలయాల నుంచి కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపింది. ఇదే సమయంలో టీఎంసీ మాత్రం బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేసింది. "ఎన్నికల వ్యూహాలు, పార్టీ పత్రాలు స్వాధీనం చేసుకోవడమే ఈడీ దాడుల అసలు లక్ష్యం. ఇది ప్రజాస్వామ్యంపై దాడి" అంటూ సోషల్‌ మీడియా వేదికగా మండిపడింది.

ఐ ప్యాక్‌పై రైడ్స్‌: సీఎం మమత ఆధారాలను లాక్కెళ్లారన్న ఈడీ- హైకోర్టుకు చేరిన వ్యవహారం

'దేశాన్ని రక్షించాల్సిన హోంమంత్రి నీచంగా వ్యవహరిస్తున్నారు'- ఐప్యాక్​ ఆఫీసుల్లో ఈడీ దాడులపై మమతా ఫైర్​