ETV Bharat / bharat

ఆ ఊరిలో కరెంట్ స్తంభాలే బ్లాక్‌బోర్డులు- రోడ్డే ఓపెన్ ఎయిర్ స్కూల్- ఆ విలేజ్ ఎక్కడుందంటే?

చదువుకు ప్రాధాన్యతనిస్తున్న బంగాల్‌లోని ఓ గ్రామం- విద్యుత్ స్తంభాలపై విద్యకు సంబంధించిన పెయింటింగ్స్- స్కూల్‌కు వెళ్లేటప్పుడు వాటిని చదువుతున్న స్టూడెంట్స్

Electricity Poles Turned Into Blackboards
Electricity Poles Turned Into Blackboards (ETV BHARAT)
author img

By ETV Bharat Telugu Team

Published : February 24, 2026 at 8:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Electricity Poles Turned Into Blackboards : విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం. అదే సమాజంలో అట్టడుగున ఉన్నవారిని అందలం ఎక్కిస్తుంది. పేదవారిని ధనికులుగా మారుస్తుంది. అలాగే గౌరవం లభించేటట్లు చేస్తుంది. చదువే సమాజంలో మార్పును తీసుకొస్తుందని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని గ్రహించింది బంగాల్‌లోని డ్యూల్‌బరి గ్రామం. ఆ ఊరిలో ఉన్న విద్యుత్ స్తంభాలను బ్లాక్‌బోర్డ్‌లుగా, రోడ్డును ఓపెన్ ఎయిర్ స్కూల్‌గా మార్చేసింది.

కరెంట్ స్తంభాలపై రాతలు
దక్షిణ 24 పరగణాల జిల్లా సుందరబన్స్ ప్రాంతంలోని కుల్‌బరి బ్లాక్‌లో డ్యూల్‌బరి గ్రామం ఉంది. మట్టి రోడ్డు, చుట్టూ చెట్లతో ఉన్న ఆ ఊరు విద్యను వ్యాప్తి చేయడానికి వినూత్న చొరవ తీసుకుంది. గ్రామంలోని రోడ్ల వెంబడి ఉన్న దాదాపు 40-45 విద్యుత్ స్తంభాలపై బెంగాలీ వర్ణమాల, ఆంగ్ల సంఖ్యలు మొదలైన వాటితో పెయింటింగ్‌తో రాశారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లే రహదారిని ఓపెన్ స్కూల్‌గా మార్చేశారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఆంగ్ల సంఖ్యలు, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహార చిహ్నాలను నేర్చుకుంటున్నారు.

ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్ఫూర్తితో
అయితే డ్యూల్‌బరి గ్రామ ప్రజలు బంగాల్ పునరుజ్జీవనోద్యమానికి మార్గదర్శకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ స్ఫూర్తిగా తీసుకుని విద్యను వ్యాప్తి చేస్తున్నారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చిన్నతనంలో మేదినీపుర్ జిల్లాలోని తన గ్రామం నుంచి కోల్‌కతాలోని స్కూల్‌కు నడిచి వెళ్లేవారు. ఆ సమయంలో మైలురాళ్లపై ఉన్న ఆంగ్ల సంఖ్యలను చదివేవారట. అదే స్ఫూర్తితో డ్యూల్‌బరి గ్రామంలోని విద్యార్థులు ముందుకు సాగుతున్నారు.

చొరవ వెనుక ఓ మహా మహామనిషి
విద్య పట్ల డ్యూల్‌బరి గ్రామ ప్రజల చొరవ వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే పులక్ మండల్. చాలా కాలంగా రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు కలుపు మొక్కలు, చిరిగిన పోస్టర్లు, చెత్త కుప్పలతో కప్పి ఉండడాన్ని పులక్ మండల్ గమనించాడు. అప్పుడు ఓ రోజు పెయింట్ బ్రష్ తీసుకొని గ్రామస్థులతో కలిసి కరెంట్ స్తంభాలను శుభ్రం చేశాడు. రంగురంగుల కలర్ పెయింటింగ్స్‌తో బెంగాలీ వర్ణమాలలు, ఆంగ్ల సంఖ్యలను విద్యుత్ స్తంభాలపై చిత్రీకరించాడు. బంగాల్ పునరుజ్జీవనోద్యమానికి మార్గదర్శకుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బాల్యం నుంచి ప్రేరణ పొంది తాను ఇలా చేశానని పులక్ మండల్ తెలిపాడు. నిర్లక్ష్యంగా పడి ఉన్న విద్యుత్ స్తంభాలతో విద్యను వ్యాప్తి చేశానని పేర్కొన్నాడు. ఈ మారుమూల ప్రాంతంలో విద్యపై ఆసక్తిని పెంచడానికి 'వన్ రూపీ స్కూల్'ను కూడా ప్రారంభించానని చెప్పాడు.

సంతోషం వ్యక్తం చేసిన గ్రామస్థులు, యువత
విద్యుత్ స్తంభాలపై అక్షరాలను పెయింట్ చేయడం పట్ల గ్రామస్థులు, యువత సంతోషం వ్యక్తం చేస్తారు. గ్రామంలోని ప్రతి మూల విద్యా సందేశాన్ని అందిస్తోందని అన్నారు. దీని వల్ల తరువాతి తరానికి చదువుపై మరింత అవగాహన, నమ్మకం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. "మా పిల్లలు విద్యుత్ స్తంభాలపై పెయింటింగ్ చేసిన అక్షరాలు, సంఖ్యలు చదువుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు బోధించే అవకాశాన్ని పొందుతారు. పిల్లలకు చదువుపై ఆసక్తి పెరిగే కొద్దీ గ్రామమంతటా చదువుకు అనుకూల వాతావరణం ఏర్పడింది. " అని డ్యూల్‌బరి గ్రామస్థుడు మింటి భూయాన్ తెలిపారు.

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే
విద్య అనేది నాలుగు గోడలకే పరిమితం కాదని డ్యూల్‌బరి గ్రామం మనకు గుర్తు చేసింది. సంకల్పం ఉంటే రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కూడా స్కూల్‌గా మారుతుందని రుజువు చేసింది. ఈ చిన్న గ్రామం విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించింది. చదువే తమ పిల్లల భవిష్యత్తును మార్చగలదని విశ్వసించింది. అదే విధంగా తమ పిల్లల చదువు కోసం అనుకూల వాతావరణాన్ని కల్పించింది.