'వికసిత్ భారత్‌లో రేప్ కేసు నిందితులకు బెయిల్- ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తినవారికి కాదు'- ప్రియాంక ఖర్గే ఫైర్
దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరణ- కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు

Published : January 5, 2026 at 4:37 PM IST
Priyank Kharge Slams BJP : దేశ రాజధాని దిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంపై కాంగ్రెస్ నాయకుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే అసహనం వ్యక్తం చేశారు. వికిసిత్ భారత్‌లో అత్యాచార నిందితులకు బెయిల్ మంజూరు చేస్తారని ఆరోపించారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించినవారికి బెయిల్ లభించదని అన్నారు.
అత్యాచార కేసుల్లో నిందితులుగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగార్, ఆశారాం బాపు, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వంటివారికి వికసిత్ భారత్‌లో బెయిల్ మంజూరు అయ్యిందని ప్రియాంక్ ఖర్గే ఎద్దేవా చేశారు. ప్రజల కోసం గళం వినిపించిన ఉమర్ ఖాలీద్, సోనమ్ వాంగ్ చుక్, సాగర్ ఘోర్కె, రమేశ్ గైచోర్ వంటి వారు జైలు పాలయ్యారని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Welcome to #ViksitBharat where you are jailed for raising your voice and get a bail for being a rapist. pic.twitter.com/UxJvdX0y6M
— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) January 5, 2026
బీజేపీ ఏమందంటే?
మరోవైపు, ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ నిరాకరించడంపై బీజేపీ స్పందించింది. "ఉమర్ ఖాలీద్, శర్జీల్ ఇమామ్ కాంగ్రెస్, దాని ఎకో సిస్టమ్ నుంచి సానుభూతిని పొందారు. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా లేఖలు అందుకున్నారు. అయితే వారికి సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించింది. వీరిద్దరూ ఉగ్రవాదం, దిల్లీని తగలబెట్టడం వంటి నేరాలు చేసేందుకు ప్రయత్నించారని సుప్రీంకోర్టు కూడా గమనించింది" అని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు.
'ఈ తీర్పు కాంగ్రెస్, రాహుల్ గాంధీకి చెంపపెట్టు లాంటిది'
ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్‌కు బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్, లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీకి చెంపపెట్టులాంటిదని బీజేపీ అధికార ప్రతినిధి ప్రతీప్ భండారీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన జాతీయ వ్యతిరేక తుక్డే తుక్డే బ్రిగేడ్ ఉమర్ ఖాలీద్, శర్జీల్ ఇమామ్‌కు సుప్రీంకోర్టు బెయిల్ తిరస్కరించిందని విమర్శించారు. నిందితులందర్నీ ఒకే ప్రాతిపదికన పరిగణించలేమని పేర్కొన్నారు.
దురదృష్టకరమన్న ఉమర్ ఖాలిద్ తండ్రి
మరోవైపు, తన కుమారుడికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడంపై ఉమర్ ఖాలిద్ తండ్రి ఇలియాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖాలిద్‌కు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడం దురదృష్టకమన్నారు. "నో కామెంట్స్. ఈ తీర్పు దురదృష్టకరం. నేను చెప్పడానికి ఏమీ లేదు" అని ఇలియాస్ పేర్కొన్నారు.
అలాగే దిల్లీ అల్లర్ల కేసులో ఐదుగురికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఉమర్ ఖాలిద్ స్నేహితురాలు బనోజ్యోత్స్న కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీ అల్లర్ల కేసులో ఇతరులకు బెయిల్ లభించినందుకు ఉమర్ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "'దిల్లీ అల్లర్ల కేసులో ఐదుగురికి బెయిల్ లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను! చాలా ఉపశమనం కలిగింది' అని ఉమర్ నాతో చెప్పారు. 'నేను ములాఖత్ కోసం రేపు (మంగళవారం) వస్తాను' అని ఉమర్‌కు నేను బదులిచ్చాను" అని బనోజ్యోత్స్న స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే?
పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో దిల్లీలో జరిగిన హింసాత్మక నిరసనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ అల్లర్లలో 53 మంది మరణించారు. మరో 700 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. దీంతో ఈ అల్లర్లకు సంబంధించి 15 మందిని నిందితులుగా పేర్కొంటూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద ఛార్జిషీటు నమోదైంది. వీరిలో కొందరికి గతంలో బెయిల్ మంజూరైంది. అయితే ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్ సహా ఏడుగురి నిందితులకు గతేడాది సెప్టెంబరులో దిల్లీ హైకోర్టు షాకిచ్చింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. తాజాగా ఖాలిద్, ఇమామ్‌కు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెల్లడించింది. మరో ఐదుగురు నిందితులు గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రహమాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్‌కు కోర్టు ఊపశమనం ఇచ్చింది. వారికి బెయిల్ మంజూరు చేసింది.
దిల్లీ అల్లర్ల కేసు- ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరణ
'ట్రంప్ కోసం చేసినవన్నీ భారత్‌కు చాలా తక్కువ మేలు చేశాయి'- కేంద్రంపై కాంగ్రెస్ ఫైర్

