ETV Bharat / bharat

చంద్ర గ్రహణం రోజే ఒక్కటైన 19 జంటలు- సామూహిక వివాహాలు ఎక్కడో తెలుసా?

కర్ణాటకలో చంద్ర గ్రహణం నాడు పెళ్లి చేసుకున్న 19 జంటలు- గడగ్‌లోని పుట్టరాజ గవై మఠంలో వివాహాలు

Mass Marriage Ceremony on Lunar Eclipse
Mass Marriage Ceremony on Lunar Eclipse (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : March 4, 2026 at 2:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

Mass Marriage Ceremony on Lunar Eclipse : చంద్ర గ్రహణం నాడు భారతీయులు ఎటువంటి శుభకార్యాలు చేయరు. దేవాలయాలను సైతం మూసేస్తారు. సాధారణ ప్రజలు సైతం ఇంటిని కడిగి, ఆ తర్వాత తలస్నానం చేస్తారు. ఆపైనే వండుకుని భోజనం చేస్తారు. అంతలా చంద్ర గ్రహణాన్ని పాటిస్తారు. కానీ కర్ణాటకలో గడగ్ జిల్లాలో మాత్రం చంద్ర గ్రహణం నాడే పలు మతాలకు చెందిన 19 జంటలు వివాహం చేసుకున్నారు.

ఉత్తర కర్ణాటక ప్రజలు దేవుడుగా కొలిచే పండిట్ పుట్టరాజ గవై 112వ జయంతి మంగళవారం గడగ్ నగరంలో జరిగింది. ఈ క్రమంలో ఏపీఎంసీ ప్రాంగణంలోని గవై మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పుట్టరాజ గవై చిత్రపటాన్ని వేడుకగా ఊరేగింపు నిర్వహించారు. మఠం ప్రాంగణాన్ని వివిధ రంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ జయంతి వేడుకలకు శ్రీ వీరేశ్వర పుణ్యాశ్రమ పీఠాధిపతి కల్లయ్యజ్జ, తొంటదార్య మఠాధిపతి డాక్టర్ సిద్ధరామ శ్రీ సహా అనేక మంది మఠాధిపతులు, ప్రముఖులు, వేలాది మంది భక్తులు హాజరయ్యారు. బాగల్‌కోట్, హావేరి, హుబ్లి-ధార్వాడ్ సహా వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

మూఢనమ్మకాలు పొగొట్టేందుకు
చంద్ర గ్రహణం గురించి మూఢనమ్మకాలను పొగొట్టేందుకు హిందూ, ముస్లింలతో సహా వివిధ వర్గాలకు చెందిన 19 జంటలు ఒకే వేదికపై వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో మఠం నిర్వాహకులు వారికి తాళిబొట్టు, బట్టలు ఉచితంగా పంపిణీ చేశారు. ఆ తర్వాత పుట్టరాజ గవై 112వ జయంతి సందర్భంగా మఠంలో 112 కిలోల పెద్ద కేక్‌ను కట్ చేశారు. హలిగే మేళా, డొల్లుకునిట వంటి వివిధ సంగీత బృందాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ జయంతి వేడుకలకు హాజరైన వారికి బూందీ సహా పలు రకాల ప్రసాదాన్ని పంపిణీ చేశారు. పుట్టరాజ గవై జయంతి నేపథ్యంలో సర్వమత సామూహిక వివాహ కార్యక్రమం జరిగిందన్నారు పుణ్యాశ్రమ పీఠాధిపతి కల్లయ్యజ్జ. ఈ నూతన దంపతులను వివిధ మఠాధిపతులు ఆశ్వీరదించారని తెలిపారు. ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు.

'ఈ మఠం సాంస్కృతిక కేంద్రంగా ప్రకాశిస్తోంది'
పండిత పుట్టరాజ గవై ఆశ్రమం భక్తులకు ఆధ్యాత్మిక భక్తి కేంద్రంగా ఉండేదని తొంటదార్య మఠాధిపతి సిద్ధరామ వెల్లడించాడు. ఇప్పుడు అది సాంస్కృతిక కేంద్రంగా ప్రకాశిస్తోందని కొనియాడారు. ఇటువంటి కేంద్రాల్లో సామూహిక వివాహాలు నిర్వహించడం ద్వారా, చాలా మంది పేదలకు ఆర్థిక భారం తగ్గుతోందని అభిప్రాయపడ్డారు.

"ఎటువంటి ఖర్చులు లేకుండా పేదలు ఇక్కడ పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టొచ్చు. ఇటువంటి సామూహిక వివాహాలు సమయం, డబ్బు వృథాను నివారిస్తాయి. పీఠాధిపతి కల్లయ్యజ్జ నాయకత్వంలో, కె.హెచ్. పాటిల్ అభిమానుల సహకారంతో ఇక్కడ జరుగుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా మారుతున్నాయి. దుబారా ఖర్చు చేయకుండా జీవితాలను సాఫీగా కొనసాగించడం మంచిది." అని తొంటదార్య మఠాధిపతి సిద్ధరామ తెలిపారు.

'గత ఏడేళ్లుగా సామూహిక వివాహాలు'
గత ఏడేళ్లుగా పుట్టరాజ గవై జయంతి ఉత్సవాల సందర్భంగా సామూహిక వివాహాలు జరుగుతున్నాయని కేహెచ్ పాటిల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీరాసాబ్ కౌటాలా తెలిపారు. ఈసారి 19 జంటలు కొత్తగా వివాహ జీవితంలోకి అడుగుపెట్టాయని పేర్కొన్నారు. వధూవరులకు ఉచిత బట్టలు పంపిణీ చేశారని వెల్లడించారు. పసందైన భోజనం ఏర్పాటు చేశారని చెప్పారు. మీడియాతో సహా అందరు భక్తులు సహాయం వల్ల ఈ కార్యక్రమం ఘనంగా జరిగిందని అన్నారు. తాను చాలా సంవత్సరాలుగా పుట్టరాజ గవై భక్తుడిని పేర్కొన్నారు.

"ఈ రోజుల్లో మత సామరస్యం చాలా అవసరం. గడగ్‌లో జరిగినటువంటి ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలనేది నా కోరిక. అప్పుడే దేశంలో మరింత ఐక్యత ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ తమ గ్రామాలలో తమ గురువుల సంస్మరణ, జయంత్యోత్సవ కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా మత సామరస్యాన్ని పెంపొందించుకోవాలి." అని పీరాసాబ్ కౌటాలా అభిప్రాయపడ్డారు.