ETV Bharat / bharat

మమతా బెనర్జీ నుంచి బంగాల్​ను విముక్తి చేయడమే మా లక్ష్యం: నితిన్ నబీన్​

అక్రమ చొరబాటుదారులకు అండగా మమతా బెనర్జీ- ఆమె అవినీతిమయ టీఎంసీ ప్రభుత్వం నుంచి బంగాల్​కు విముక్తి కల్పించడమే మా లక్ష్యం- బీజేపీ చీఫ్​ నతిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు​

Nitin Nabin
Nitin Nabin (IANS)
author img

By ETV Bharat Telugu Team

Published : March 1, 2026 at 6:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

Nitin Nabin Slams Mamata Banerjee : అవినీతిలో కూరుకుపోయిన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ దుష్పరిపాలన నుంచి బంగాల్​ను విముక్తి చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. బంగాల్ ప్రజలు ప్రస్తుతం రాష్ట్రంలో పెను మార్పు కోసం తహతహలాడుతున్నారని, నిజమైన 'పరిబోర్తన్'​ (మార్పు) కోసం ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం కూచ్​ బెహార్​లో పార్టీ చేపట్టిన 'పరిబోర్తన్​ యాత్ర' ప్రారంభించిన ఆయన, మమతా బెనర్జీ సర్కార్​పై విమర్శలు గుప్పించారు.

దేశ భద్రతకు ముప్పు!
ఎస్ఐఆర్​ చేపట్టి ఓటర్ల జాబితాలోని అక్రమ చొరబాటుదారులను తొలగించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తే, దానిని మమతా బెనర్జీ అడ్డుకునే ప్రయత్నం చేశారని నితిన్ నబీన్ ఆరోపించారు. "మమతా బెనర్జీ తన పార్టీ ఓటు బ్యాంక్​ను కాపాడుకోవడం కోసం, ఓటర్ల జాబిలోని చొరబాటుదారులకు రక్షించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారు" అని విమర్శించారు. అయితే ఈసీ మాత్రం బంగాల్​ యువత ఉద్యోగులను కొల్లగొడుతున్న సుమారు 50 లక్షల మందికిపైగా అక్రమ చొరబాటుదారుల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించామని, రాష్ట్రంలో అక్రమ వలసదారుల కాలం చెల్లిందని అన్నారు. ఎస్​ఐఆర్​ పూర్తి చేసిన తర్వాత బంగాల్ ఓటర్ జాబితా నుంచి 63.66 లక్షల పేర్లను తొలగించినట్లు ఈసీ ఇంతకు ముందే ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

"వాస్తవానికి ఓటర్ జాబితా నుంచి తొలగించబడిన వారంతా చొరబాటుదారులే. వారు అసలైన పౌరులకు చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలను, సంక్షేమ పథకాల ప్రయోజనాలను అక్రమంగా అనుభవిస్తున్నారు. పైగా వాళ్లు దేశభద్రతకు ముప్పుగా పరిణమించారు. మమతా బెనర్జీ అక్రమ చొరబాటుదారుల కోసం నకిలీ పత్రాలు సృష్టించి రక్షణ కల్పించారు. కానీ ఇప్పుడు మనం (బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి) కేవలం చొరబాటుదారులను రాష్ట్రం నుంచి తరిమి వేయడమే కాకుండా, బంగాల్​లోని అభివృద్ధిని పరుగులు పెట్టించే ఒక నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది."
- నితిన్ నబీన్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు

మమతా ఓటు బ్యాంక్ రాజకీయం
'మమతా బెనర్జీ ఓటర్ల జాబితాలోని చొరబాటుదారులను కాపాడుకోవడం కోసం కోర్టులకు పరుగులు తీశారు. ఎందుకంటే వారే ఆమె పార్టీకి ఓటు బ్యాంక్​. కానీ రాష్ట్రంలో మహిళలు అవమానాలకు గురవుతుంటే మాత్రం, ఆమె కళ్లు మూసుకున్నారు' అని నితిన్ ఆరోపించారు. చొరబాటుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, 'బంగాల్​ నుంచి మిమ్మల్ని తరిమేసే సమయం ఆసన్నమైంది' అని అన్నారు.

ఏకంగా 63.66 లక్షల ఓటర్ల తొలగింపు
బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈసీ శనివారం అధికారిక గణాంకాలు విడుదల చేసింది. గతేడాది నవంబర్​లో ప్రారంభించిన ఎస్​ఐఆర్​ ద్వారా 63.66 లక్షల ఓటర్ల పేర్లను (మొత్తం ఓటర్లలో 8.3 శాతం) తొలగించామని స్పష్టం చేసింది. దీనితో రాష్ట్ర ఓటర్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 7.04 కోట్లకు చేరింది. 2002 తరువాత జరిగి ఈ భారీ ప్రక్షాళనలో మరో 60.06 లక్షల మంది ఓటర్లను అండర్​ అడ్జ్యుడికేషన్ విభాగంలో ఉంచారు. వీరి అర్హతపై మరికొన్ని వారాల్లో న్యాయ విచారణ జరగనుంది. ఇది నియోజకవర్గాల స్థాయి సమీకరణాలను మరింత మార్చే అవకాశం ఉంది. 2025 డిసెంబర్​ 16న ప్రచురించిన ముసాయిదా జాబితాలో మరణం, వలసలు, నకిలీ నమోదులు, ఆచూకీ లేని కారణాలతో 58 లక్షల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించారు. కాగా తాజా విచారణ, అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫారమ్-7 ద్వారా మరో 5.46 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేశారు. అంటే మొత్తంగా 63.66 లక్షల పేర్లను అధికారికంగా తొలగించారు.