ETV Bharat / bharat

తుదిదశలో అహ్మదాబాద్‌ విమాన ప్రమాద దర్యాప్తు- AAIB నివేదిక కోసమే ఎదురుచూస్తున్నాం : కేంద్రమంత్రి రామ్మోహన్‌

ఎయిర్​ ఇండియా విమాన దుర్ఘటనపై స్పందించిన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు- ఈ దుర్ఙటనకు సంబంధించిన దర్యాప్తు తుదిదశలో ఉందని వెల్లడి

Ram Mohan Naidu On Air India Plane Crash
Union Civil Aviation Minister Ram Mohan Naidu (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : June 15, 2026 at 11:26 AM IST

3 Min Read
Choose ETV Bharat

Ram Mohan Naidu On Air India Plane Crash : అహ్మదాబాద్‌ ఎయిర్ ‌ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు తుది దశలో ఉందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. అంతర్జాతీయ దర్యాప్తు విధానాలను (ప్రోటోకాల్‌లను) కచ్చితంగా పాటిస్తూ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) త్వరలోనే తన తుది నివేదికను సమర్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ తుది నివేదిక కోసం తామంతా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.

"ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు తుది నివేదిక కోసం మేమంతా ఎదురుచూస్తున్నాం. ఏఏఐబీ ఈ దర్యాప్తు ప్రక్రియను అనవసరంగా వేగవంతం చేయాలని అనుకోవడం లేదు. అంతర్జాతీయ దర్యాప్తు విధానాలను (ప్రోటోకాల్‌ను) చాలా కచ్చితంగా పాటించాలనుకుంటోంది. ఇది అంతర్జాతీయ దర్యాప్తు విధానంలోని ఏ దశనూ విస్మరించట్లేదు. ఏఏఐబీ విమాన ప్రమాదం దర్యాప్తుపై చాలా క్షుణ్ణంగా దృష్టి సారిస్తోంది. అందుకే కాస్త సమయం తీసుకుంటోంది. అయితే ఎయిర్‌ ఇండియా విమాన దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తు చివరి దశలో ఉండడంతో ఇటీవలే ఏఏఐబీ ఒక ప్రకటన విడుదల చేసింది. దర్యాప్తును పూర్తి చేసి, త్వరలోనే మాకు తుది నివేదికను ఏఏఐబీ సమర్పించవచ్చు."
-- కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి

విమాన దుర్ఘటనలో 260 మంది మృతి
కాగా, గతేడాది జూన్ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదానికి గురైంది. ఓ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ఘటనలో 229 మంది విమాన ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, 19 మంది విద్యార్థులు సహా మొత్తం 260 మంది మరణించారు. ఈ ప్రమాదంలో విశ్వాస్‌ కుమార్‌ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. బాధిత కుటుంబాలకు టాటా గ్రూప్‌ పరిహారం ఇచ్చింది. ఈ ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది.

ప్రకటన రిలీజ్ చేసిన ఏఏఐబీ
అయితే ఈ ఘటన జరిగి 2026 జూన్ 12 (శుక్రవారం) నాటికి ఏడాది పూర్తైంది. ఈ క్రమంలో అహ్మదాబాద్ విమాన దుర్ఘటన దర్యాప్తునకు సంబంధించి ఏఏఐబీ ఒక మధ్యంతర ప్రకటన రిలీజ్ చేసింది. ప్రమాదానికి అసలు కారణం తెలుసుకునేందుకు ఫ్లైట్ రికార్డర్ డేటా, ఇంజిన్ భాగాలు, ఇతర ఆధారాలను విశ్లేషిస్తున్నామని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దర్యాప్తులో గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొంది. సేకరించిన సాక్ష్యాలు, పరిశీలన ఫలితాలను సమగ్రంగా, సమన్వయంతో విశ్లేషిస్తున్నట్లు తెలిపింది. గతేడాది కాలంగా దర్యాప్తు బృందం ప్రమాదానికి సంబంధించిన సాంకేతిక, నిర్వహణ, సంస్థాగత, మానవ కారకాలపై విస్తృతమైన పరిశీలన చేపట్టామని వివరించింది. సమగ్రమైన, స్వతంత్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పింది. అంతర్జాతీయ సమీక్షలు, సంప్రదింపు ప్రక్రియలు పూర్తైన తర్వాత విమాన ప్రమాదంపై తుది నివేదిక విడుదల చేస్తామని పేర్కొంది.

'దుర్ఘటనపై సమగ్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు చేస్తున్నాం'
"విమాన వ్యవస్థలు, ఫ్లైట్ రికార్డర్ డేటా, ఇంజిన్ సంబంధిత భాగాలు, నిర్వహణ, కార్యకలాపాల రికార్డులు, అలాగే దర్యాప్తునకు సంబంధించిన ఇతర సాక్ష్యాల పరిశీలన, విశ్లేషణలో గణనీయమైన పురోగతి సాధించాం. సేకరించిన సాక్ష్యాధారాలు, వివిధ పరీక్షల ఫలితాలను ప్రస్తుతం సమగ్రంగా, ఏకీకృత పద్ధతిలో విశ్లేషిస్తున్నాం. అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై సమగ్రమైన, స్వతంత్రమైన, నిష్పాక్షికమైన దర్యాప్తును నిర్వహించడానికి కట్టుబడి ఉన్నాం. అన్ని దర్యాప్తు కార్యకలాపాలు, ఐసీఏఓ (ICAO) అనెక్స్ 13 కింద నిర్దేశించిన అవసరమైన అంతర్జాతీయ సమీక్ష, సంప్రదింపుల ప్రక్రియలు పూర్తైన తర్వాత తుది నివేదిక విడుదల చేస్తాం. విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం. ఈ దుర్ఘటన వల్ల ప్రభావితమైన వారందరూ అనుభవిస్తున్న శాశ్వతమైన బాధను, నష్టాన్ని మేము అర్థం చేసుకోగలం" అని ఏఏఐబీ ప్రకటనలో తెలిపింది.

బావిలో పడ్డ వ్యాన్​- 8 మంది మృతి!- రైలు ఢీకొని మరో నలుగురు మరణం

జోర్హాట్ ఎయిర్‌బేస్ వద్ద కూలిపోయిన ఐఏఎఫ్ AN-32 విమానం- ఐదుగురు మృతి