ETV Bharat / bharat

వైరల్ మ్యారేజ్: 35 ఎద్దుల బండ్లతో పెళ్లి ఊరేగింపు- నో డీజే, ఓన్లీ జానపద గేయాలే

కార్లు లేవు, డీజే లేదు, పర్యావరణహితంగా పెళ్లి ఊరేగింపు- వివాహ వేడుక సోషల్ మీడియాలో వైరల్- గుర్రంపై వరుడు, 35 ఎద్దుల బండ్లతో అట్టహాసంగా ఊరేగింపు- పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చిన వరుడి ఫ్యామిలీ

SPECIAL WEDDING PROCESSION
SPECIAL WEDDING PROCESSION (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : February 26, 2026 at 10:01 PM IST

3 Min Read
Choose ETV Bharat

Special Wedding Procession : ఈతరం వాళ్లకు పెళ్లి ఊరేగింపు అనగానే దిక్కులు పిక్కటిల్లే డీజే సౌండ్స్ గుర్తుకొస్తాయి. ఆడంబరాల కోసం మ్యారేజ్ ఊరేగింపుల్లో లగ్జరీ కార్లను వినియోగించడం ఇప్పుడొక ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈనేపథ్యంలో ఇందుకు పూర్తి భిన్నమైన పెళ్లి వేడుక ఒకటి అందరి దృష్టిని ఆకట్టుకుంది. కాలుష్యానికి తావు ఇవ్వని, పర్యావరణ హితమైన ఆ ఊరేగింపును చూసి అందరూ వహ్వా అన్నారు. తమ మొబైల్ ఫోన్లను బయటికి తీసి ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు. మనమూ ఆ పెళ్లి ఊరేగింపు విశేషాలను తెలుసుకుందాం.

పర్యావరణహితంగా, సంప్రదాయ పద్ధతిలో
అది బిహార్‌లోని సమస్తీపుర్ జిల్లా కేంద్రం. నగరంలోని స్వర్గ్ హోటల్ యజమాని ప్రదీప్ సేథ్ కుమారుడు అలోక్‌కు, రోసెరా పట్టణానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. భారీ ఖర్చుతో తన కొడుకు పెళ్లి ఊరేగింపును నిర్వహించే ఆర్థిక స్థోమత ప్రదీప్ సేథ్‌కు ఉంది. అయితే వరుడు అలోక్ బాబాయి మహేంద్ర ప్రధాన్ చొరవ చూపి ప్రదీప్ సేథ్‌తో మాట్లాడారు. ఈ పెళ్లి ఊరేగింపును పర్యావరణ హితంగా, ప్రాచీన సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని ప్రదీప్‌‌కు సూచించారు. ఇందుకు వరుడు అలోక్, ఆయన తండ్రి ప్రదీప్ ఒప్పుకున్నారు.

ఊరేగింపు ఇలా జరిగింది!
ఫిబ్రవరి 25వ తేదీన అలోక్ పెళ్లి జరిగింది. ఆ రోజున వరుడి ఊరేగింపు సమస్తీపూర్ నగరంలోని స్వర్గ్ హోటల్ నుంచి బయలుదేరింది. వరుడు గుర్రంపై కూర్చున్నాడు. ముందు గుర్రం నడుస్తుండగా, దాని వెనుక 35 ఎద్దుల బండ్లు మెల్లగా కదలసాగాయి. ఈక్రమంలో ఎద్దుల బండ్లలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ సిస్టమ్‌లలో శ్రావ్యమైన జానపద గేయాలను ప్లే చేశారు. దీంతో ఈ ఊరేగింపునకు జోష్ వచ్చింది. బంధువులు, అతిథులు సౌకర్యవంతంగా కూర్చునేందుకు ఎద్దుల బండ్లలో సోఫాలు, పరుపులను ఏర్పాటు చేశారు. స్వర్గ్ హోటల్ నుంచి గజరాజ్ ప్యాలెస్ దాకా 1.7 కిలోమీటర్ల దూరం పాటు ఈ ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. దీన్ని చూసేందుకు జనమంతా రోడ్డుపై బారులుతీరారు. ఒక్కో ఎద్దుల బండికి రెండు చొప్పున మొత్తం 70 ఎద్దులను ఈ ఊరేగింపులో వినియోగించారు. వాటిని కూడా అందంగా, శుభ్రంగా అలకరించడం విశేషం. ఇది భిన్నమైన వివాహ ఊరేగింపు కావడంతో అందరూ తమ ఫోన్లకు పనిచెప్పారు. కెమెరాలతో ఈ ఊరేగింపు సీన్లను రికార్డు చేసుకున్నారు.

Special Wedding Procession
ఎద్దుల బండ్లతో పెళ్లి ఊరేగింపు (ETV BHARAT)

వరుడు, వరుడి తండ్రి నిర్ణయం గొప్పది
"నేను జంతు ప్రేమికుడిని, పర్యావరణ ప్రేమికుడిని. బిహార్‌లో ఏటా జరిగే సోనేపూర్ జాతరలో ఎద్దుల బండ్లతో నేను చాలా ఈవెంట్లను నిర్వహించాను. ఆ అనుభవం నుంచే ఈ ఐడియా వచ్చింది. నేను వరుడి బాబాయిని. నా ఐడియాను వరుడు అలోక్, ఆయన తండ్రి ప్రదీప్ ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో వివాహ ఊరేగింపులు అంటే ఖరీదైన వాహనాలు అనుకుంటున్నారు. ఈతరానికి ఎద్దుల బండ్లు ఎలా ప్రయాణించేవో కూడా తెలియదు. ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి, కాలుష్య రహిత జీవనశైలిని ప్రోత్సహించడానికి ఈ ప్రయత్నం చేశాం" అని వరుడు అలోక్ బాబాయి మహేంద్ర ప్రధాన్ తెలిపారు.

https://imgs.etvbharat.com/etvbharat/prod-images/26-02-2026/26127598_b.jpg
ఎద్దుల బండ్లతో పెళ్లి ఊరేగింపు (ETV BHARAT)

ప్రజలు, అతిథులకు కొత్త అనుభూతి
"ఈ పెళ్లి ఊరేగింపు జరుగుతున్నప్పుడు ప్రజలు దారి పొడవునా నృత్యాలు చేసి ఎంజాయ్ చేశారు. ఎద్దుల
బండ్లపై కూర్చున్న అతిథులు కూడా ప్రత్యేకమైన అనుభూతిని ఆస్వాదించారు. గజరాజ్ ప్యాలెస్‌కు పెళ్లి ఊరేగింపు చేరుకున్న తర్వాత, అందరూ ఈ ఏర్పాట్లను కొనియాడారు. కోట్ల విలువైన కార్లతో జరిగే వివాహ ఊరేగింపులను ప్రజలు అంతగా పట్టించుకోరు. కానీ ఈ ఊరేగింపు భారీ జనసమూహాన్ని ఆకర్షించింది. ప్రజలు వాళ్ల మొబైల్స్‌లో వీడియోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు" అని మహేంద్ర ప్రధాన్ వివరించారు.

Special Wedding Procession
ఎద్దుల బండ్లతో పెళ్లి ఊరేగింపు (ETV BHARAT)

1980వ దశకంలోకి వెళ్లినట్టు అనిపించింది
"ఈ పెళ్లి ఊరేగింపును చూసిన ప్రజలకు మళ్లీ 1980వ దశకంలోకి వెళ్లినట్టుగా అనిపించింది. 70 ఎద్దులను అందంగా అలంకరించి ఈ ఊరేగింపులో వినియోగించారు. ఎద్దుల బండ్లనూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఈ ఊరేగింపు పర్ఫెక్టుగా అనిపించింది" అని వెహికల్ డ్రైవర్ రామశిష్ రాయ్ చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్
ఇక ఎద్దుల బండ్లతో జరిగిన ఈ పెళ్లి ఊరేగింపు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పెళ్లి వేడుక ప్రత్యేకమైంది, చిరస్మరణీయమైంది అని ప్రజలు కామెంట్లు పెడుతున్నారు. ఈ వివాహ వేడుక సమస్తిపూర్‌లో చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది .తమ సాంస్కృతిక వారసత్వాన్ని సైతం జనం గుర్తు చేసుకుంటున్నారు.